రోడ్డు ప్రమాదం- ఐదుగురికి గాయాలు
బైకును.. కంటెయినర్‌ను ఢీకొన్న లారీ
రాజీవ్ రహదారిపై ఘటన
శామీర్‌పేట్: ఓ లారీ బైకును మరో లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగల మైసమ్మ చౌరాస్తా వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ నగరంలోని ఈసీఐఎల్ నుంచి కరీంనగర్‌కు రాజీవ్ రహదారి మీదుగా వెళ్తోంది. శామీర్‌పేట్ మండలం తూంకుంట నుంచి ఓ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు బిట్స్ పిలానీ వైపు దొంగలమైసమ్మ చౌరాస్తా నుంచి వెళ్తున్నారు.
మేడ్చల్ నుంచి కీసర వైపు ఓ కంటెనర్ లారీ వస్తుంది. ఈక్రమంలో శామీర్‌పేట్ మండలం దొంగలమైసమ్మ వద్దకు రాగానే గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదవశాత్తు తూంకుంట నుంచి బిట్స్ వైపు వెళ్తున్న బైక్ ఢీకొంది. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ భయాందోళనకు గురై లారీని తిప్పే క్రమంలో మేడ్చల్ నుంచి కీసర వైపు వెళ్తున్న కంటెయినర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌తో పాటు కంటెయినర్ లారీ బోల్తా పడ్డాయి. బైక్‌పై వెళ్తున్న తూంకుంటకు చెందిన విజయ్, పవన్‌తో పాటు కంటెయినర్ డ్రైవర్ బ్రిజేష్, లారీ గైడ్ ప్రదీప్‌కుమార్, కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.