మదనపల్లె మండలంలో శనివారం రాత్రి ఆటో బోల్తా పడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మదనపల్లె క్రైం : మదనపల్లె మండలంలో శనివారం రాత్రి ఆటో బోల్తా పడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం ఏటిగడ్డపల్లెకు చెందిన ఇడగొట్టి నాగరాజ (39) భార్యాపిల్లలు, తల్లితండ్రులతో కలిసి అనంతపురంలో డిగ్రీ చదువుకుంటున్న తన కొడుకు వెంకటేష్‌ను చూసేందుకు శుక్రవారం వెళ్లారు. శనివారం రాత్రి తిరిగి గుంతకల్ - తిరుపతికి రైలు ఎక్కి మదనపల్లె సమీపంలోని సీటీఎం రైల్వే స్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి మదనపల్లెకు వచ్చేందుకు అర్ధరాత్రి సమయంలో ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఆటో ఐదో మైలురాయి వద్ద రాగానే అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో నాగరాజ (39), అతని తండ్రి వెంకటరమణ (68), భార్య ఉమాదేవి(32), కుమార్తె భువనేశ్వరి(16)తో పాటు పట్టణంలోని చీకిలగుట్టకు చెందిన ఆదెమ్మ (60) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటరమణ, నాగరాజు, ఉమాదేవిని తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు.