నాచారం గుట్ట(వర్గల్): రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ డ్రైవర్ లేకుండానే పల్లం వైపు పరుగులు తీసి మూడు కార్లను తాకుతూ చెట్టును ఢీకొట్టిన సంఘటన ఆదివారం వర్గల్ మండలం నాచారం గుట్ట పుణ్యక్షేత్రం ఎదుట జరిగింది. ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఘటన జరగగా ఆ సమయంలో భక్తులు రోడ్డు మీద లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తూప్రాన్ వైపు నుంచి గజ్వేల్ వైపు మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ వెళుతోంది. డ్రైవర్ నాచారం గుట్ట వద్దకు రాగానే టీ తాగేందుకు వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఇంజన్ ఆఫ్ చేసి హŸటల్లోకి వెళ్లాడు. అతడి దిగిన వెంటనే లారీ మెల్లమెల్లగా ముందుకు కదిలింది. దీన్ని డ్రైవర్ గమనించలేదు. కొద్దిసేపటికే అది పల్లం వైపు ముందుకు సాగింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఇన్నోవా, స్విఫ్ట్, వ్యాగనార్ కార్లను తాకుతూ ముందుకు వెళ్లింది. అక్కడే ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ తగలడంతో వాహనాలు కొంత మేర దెబ్బతిన్నాయి. డ్రైవర్ లేకుండానే లారీ దూసుకొస్తున్న సమయంలో రోడ్డు మీద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గౌరారం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని ఎస్సై శ్రీధర్ తెలిపారు.