వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
తొండంగి (తుని) :
మామిడికాయలు కొనుగోలు చేసేందుకు వాహనంలో బయలుదేరిన వ్యాపారులు మార్గమధ్యలోనే ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. యానాంలోని యూకేవీ నగర్‌కు చెందిన వ్యాపారులు సీహెచ్ గోవిందు, భావన రాంబాబు, సాపిరెడ్డి ఏసు మామిడికాయలు కొనుగోలుకు టాటా ఏస్ వ్యాన్‌లో తుని బయలుదేరారు. కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా ఒంటిమామిడి జంక‌్షన్ నుంచి తొండంగి మీదుగా అన్నవరం బైపాస్‌లోకి వస్తున్నారు. ఎ.కొత్తపల్లి కావటి చెరువు మలుపు వద్ద వీరు వస్తున్న వీరి వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన సమయంలో వ్యాన్ తొట్టెలో ఇద్దరు నిద్రస్తుండగా డ్రైవర్ రాజు, వ్యాపారి గోవిందు (42) కేబిన్‌లో ఉన్నారు. గోవిందు కాళ్లు నుజ్జవ్వడంతో తీవ్ర రక్తస్రావమైంది. తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాంబాబు, ఏసుబాబులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతినికి భార్య రాము, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన మృతుడు గోవిందు బంధువులు, కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఉపాధి కూలీ... మరొకరికి తీవ్ర గాయాలు
తాళ్లరేవు (ముమ్మిడివరం) : పోలేకుర్రు పంచాయతీ చినబాపనపల్లిలో బుధవారం పిడుగు పడడంతో ఉపాధి కూలీ కర్రి సత్యనారాయణ (42) మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఇరిగేషన్ కాలువలో సుమారు 120 మంది ఉపాధి కూలీలు పని చేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వర్షం వస్తుంటే ఐదుగురు పూరిపాకలోకి వెళ్లారు. అక్కడ పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తీవ్రగాయాల పాలైన దాకే చిట్టిబాబును స్థానికులు యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెపుతున్నారు. పిడుగుపాటు సత్యనారాయణ మృతి చెందడంతో కూలీలు తీవ్ర ఆవేదన చెందారు. స్థానిక సర్పంచ్ మొండి హరిచిన్నారావు, తహసీల్దార్ లోడా జోసెఫ్, ఎంపీడీఓ సీహెచ్ చినబాబు, ఏఎస్సై ఏవీ సుబ్బారావు తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా కోసం తరలించారు. కోరంగి ఎస్సై వి.సుమంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.