వన్నె తెచ్చిన ‘శిశు సంజీవని’
-
ఎన్‌ఎన్‌ఎఫ్ సర్టిఫికెట్ అందుకున్న ఎంజీఎం అధికారులు
-
నవజాత శిశువులకు
-
మెరుగుపడనున్న సేవలు
ఎంజీఎం(వరంగల్) : వరంగల్‌లోని మహత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) ఆస్పత్రి పిల్లల విభాగం వైద్యులు రెండేళ్ల పాటు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఎంజీఎం ఆస్పత్రిలోని పీడియాట్రీక్ విభాగానికి ప్రతిష్టాత్మకమైన నేషనల్ నియోనాటాలజీ ఫోరం(ఎన్‌ఎన్‌ఎఫ్) సర్టిఫికెట్ మంజూ రైంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్‌ఎన్‌ఎఫ్ సర్టిఫికెట్ పొందిన మొట్టమొదటి ఆస్పత్రిగా ఎంజీఎం అరుదైన గుర్తింపు దక్కిం చుకుంది. ఎన్‌ఎన్‌ఎఫ్ అధ్యక్షులు అజయ్ గంభీర్, కార్యదర్శి సునీల్ మహేందీరత మంజూరు చేసిన సర్టిఫికెట్‌ను మంగళవారం పీడియాట్రిక్ విభాగాధిపతి బలరాంకు డీఎంఈ రమణి, యూనిసెఫ్ ప్రతినిధులు అందించారు.
సందర్శించిన ఎన్‌ఎన్‌ఎఫ్ ప్రతినిధి
ఎన్‌ఎన్‌ఎఫ్ సర్టిఫికేషన్ కోసం ఎంజీఎం నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించాలని ఢిల్లీకి చెందిన ఎన్‌ఎన్‌ఎఫ్ బృందాన్ని కోరగా ఆగస్టు 10వ తేదీన ఒరిస్సాకు చెందిన ఎన్‌ఎన్‌ఎఫ్ ప్రతినిధిlడాక్టర్ అసితోష్ మహాపాత్ర ఎస్‌ఎన్‌సీయూ(నవజాత శిశుసంరక్షణ కేంద్రం)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో శిశువులకు అందుతున్న వైద్యసేవలతో పాటు అత్యాధునిక పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు తమ నివేదికను ఢిల్లీ బృందానికి అందజేయగా ఎన్‌ఎన్‌ఎఫ్ సర్టిఫికెట్ అందజేశారు.
నాలుగు జిల్లాలకు పెద్దదిక్కుగా...
నాలుగు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంతో ఎంజీఎం ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తోంది. ఈ ఆస్పత్రిలో శిశు మరణాలు నివారించేందుకు నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2011లో ప్రతిపాదనలు పంపించారు. దీంతో 2012 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఎంజీఎం ఆస్పత్రికి నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)ను మం జూరు చేసింది. ఈ మేరకు 14 మంది స్టాఫ్ నర్సులు, నలుగురు మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ అటెండర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు సెక్యూరిటీ, నలుగురి సపోర్టింగ్ స్టాఫ్‌ను అం దిస్తూ 20 పడకలతో అనుమతి ఇచ్చింది. ఇం దులో ఇరవై వార్మర్లు, పది వెంటిలేటర్లు, ఏడు సిపాక్ మిషన్లతో 24 గంటల పాటు శిశువులకు వైద్య చికిత్స అందిస్తూ ఏడాది కాలంలో ఐదు వేలకు పైగా శిశువులను సురక్షితంగా తల్లుల ఒడికి చేర్చారు. ఈవిధంగా అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు.
ఆధునిక పరికరాలు
2012లో ఆక్సిజన్ అందక పెద్ద ఎత్తున శిశుమరణాలు సంభవించిన క్రమంలో ఎంజీఎం పిడియాట్రిక్ విభాగంలో పది వెంటిలైటర్లను అం దుబాటులోకి తీసుకవచ్చారు. పుట్టగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే చిన్నారులకు ఈ వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందజేస్తారు. ఇదే వెంటిలేటర్ల ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం రోజుకు రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో వెంటిలేటర్లతో పాటు సిపాక్, వార్మర్లతో కలిపి అత్యాధునిక పరికరాలు ఎంజీఎంలో ఉండడంతో పైసా ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా వైద్యచికిత అందుతోంది.
ఇదేకాకుండా నెలలు నిండకుం డా తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఊపిరి తిత్తుల్లో సమస్య తలెత్తుతుంది. అలాంటి సమయాల్లో వెంటనే శిశువుకు వెంటిలైటర్లతో పాటు సిపాక్ పరికరాలను ఉపయోగించి కృతిమ శ్వాస అందించాల్సి ఉంటుంది. ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణకేంద్రానికి కరీంనగర్‌తో పాటు సీకేఎం, జీహెచ్‌ఎం ఆస్పత్రుల్లో సంరక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్న శిశువులను ఎంజీఎంకే తరలిస్తుంటారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో 20 పడకలు(వార్మర్లు) ఉన్నప్పటికీ ఒక్కో వార్మర్‌పై ఇద్దరు, ముగ్గురు చొప్పున 70 మందికి వైద్య చికిత్స అందిస్తున్నారు.