గవర్నర్‌ను చూసి కంటతడి పెట్టుకున్న ప్రీతి తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంతర్గత అవయవాలు ఫెయిలైన స్థితిలో ఆమెను నిమ్స్‌కు తెచ్చారని, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచేందుకు ఎక్మో, సీఆర్‌ఆర్టీలతో ప్రయత్నం చేస్తున్నామని నిమ్స్ వైద్యులు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈమేరకు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సీనియర్ విద్యార్థి చేతిలో వేధింపులకు గురైన ప్రీతి బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే.
పోలీసుల అదుపులో సైఫ్?
ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు, సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సైఫ్‌పై ర్యాగింగ్, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఏసీపీ బోనాల కిషన్ గురువారం కేఎంసీ, ఎంజీఎంలో విచారణ జరిపారు. ప్రీతి, సైఫ్‌ల సెల్‌ఫోన్‌లను సీజ్ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా కూడా విచారిస్తున్నారు.
అదేవిధంగా ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణమా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఆరా తీశారు. మరోవైపు, ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రీతి సహచర విద్యార్థులు, అనస్థీషియా విభాగ వైద్యులతో మాట్లాడి ప్రాథమిక నివేదిక తయారుచేసింది.
ఈ నివేదికను శుక్రవారం డీఎంఈకి పంపనున్నట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రీతి, సైఫ్ ఇద్దరి కుటుంబాలదీ రైల్వే బ్యాక్ గ్రౌండే కావడం గమనార్హం. ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ రైల్వే ప్రొటెక్షన్స్ ఫోర్స్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తుండగా, సైఫ్ తండ్రి సలీం కాజీపేటలో రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో పని చేస్తున్నారు.
సరస్వతీ పుత్రిక
ఎంజీఎం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి సర్వసతీ పుత్రిక అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెబుతున్నారు. ఎస్‌ఎస్‌సీలో 600కు గాను 526 మార్కులు సాధించింది. ఇంటర్‌లో వెయ్యి మార్కులకు 970 సాధించింది. ఎంసెట్ ఎంట్రన్స్‌లో 5 వేల ర్యాంకు సాధించి కామినేని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
2013లో వైద్యవిద్యను ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. పీజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 1161 ర్యాంకు సాధించి కేఎంసీలో అనస్థీషియా విభాగంలో అడ్మిషన్ పొందింది. అన్ని స్థాయిల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్న ప్రీతి ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గేది కాదని, వైద్యవిద్య అంటే ఆమెకు ఇష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment