సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్‌ను (హెచ్‌ఆర్‌సీ) ఆశ్రయించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్‌ఆరీసీలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదు చేసింది. నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో పోలీసుల వ్యవహర తీరుపై విచారణ చేపట్టాలని తెలిపింది.
మరోవైపు తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. తన కూతురు ఎలా చనిపోయిందో సమగ్ర నివేదిక కావాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు అనస్థీషియా హెచ్‌ఓడీని సస్పెండ్ చేసిన తర్వాతే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కన్నీటి వీడ్కోలు
కాగా సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఖమ్మం జైలులో సైఫ్..
ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది.
చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే..
Comments
Please login to add a commentAdd a comment