వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్‌లో ప్రత్యక్షం | Malliah who has been home after 13 years | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్‌లో ప్రత్యక్షం

Published Mon, Jun 15 2020 4:47 AM | Last Updated on Mon, Jun 15 2020 4:47 AM

Malliah who has been home after 13 years - Sakshi

నర్సంపేట రూరల్‌: మతిస్థిమితం లేని కుటుంబ పెద్ద తప్పిపోయి.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి చేరడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కీర్తి మల్లయ్య, శాంతమ్మ దంపతులకు కుమారుడు యాకయ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి మల్లయ్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కొడుకు యాకయ్య వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స చేయించేవాడు. ఈ క్రమంలో 2007 ఎండాకాలంలో పరీక్షల నిమిత్తం కొడుకుతో కలసి ఎంజీఎంకు వెళ్లిన మల్లయ్య అక్కడ తప్పిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతకని ప్రదేశం లేదు. ఎన్నిచోట్ల వాకబు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇంటికి చేరాడిలా..
గత నెల 25న జమ్మూ, కశ్మీర్‌లో మల్లయ్య తిరుగుతూ కనిపించడంతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని నర్సంపేట వాసిగా గుర్తించి క్యాంప్‌లో ఉన్న తెలంగాణ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో పాటు తెలంగాణ రిటైర్డ్‌ సెంట్రల్‌ పారామిలటరీ ఫోర్సెస్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. స్థానిక పోలీçసుల సహాయంతో మల్లయ్యను కుటుంబ సభ్యులతో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడించడంతో అతడిని గుర్తు పట్టారు. ఈనెల 9న జమ్మూలో ఫౌండేషన్‌ ప్రతినిధులకు మల్లయ్యను అప్పగించడంతో శనివారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆదివారం ఫౌండేషన్‌ అధ్యక్షుడు మావురం సత్యనారాయణరెడ్డి, నర్సంపేట ఎస్సై యుగేందర్, మల్లయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

సోషల్‌ మీడియాలో ఫొటో పంపించాం..
సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, మల్లయ్యను కుటుంబ సభ్యులు గుర్తించడంతో సోషల్‌ మీడియాలో ఫొటో పంపించామని, దాంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ అధికారులు మల్లయ్యను అప్పగించారని తెలిపారు. కాగా తండ్రిని తమకు అప్పగించిన సీఆర్‌పీఎçఫ్, జమ్మూకశ్మీర్‌ పోలీసులు, నర్సంపేట పోలీసులు, ఫౌండేషన్‌ బృందానికి యాకయ్య కృతజ్ఞతలు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement