ఇంట్లో నక్కి చోరీ
నెల్లూరు (క్రైమ్) : ఓ గుర్తుతెలియని దుండగుడు ఇంట్లో నక్కాడు. కప్ బోర్డులో ఉంచిన బంగారు ఆభరణాలను దొంగలించాడు. పడక గదిలో ఉన్న మహిళ మెడలోని బంగారు తెంచేందుకు విఫలయత్నం చేసి తప్పించుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి తల్పగిరి కాలనీలో చోటు చేసుకుంది. తల్పగిరి కాలనీలో నాగిశెట్టి వెంకటేశ్వర్లు, పద్మ దంపతులు నివసిస్తున్నారు. వెంకటేశ్వర్లు నెల్లూరు ఆర్టీసీ–2 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మంగళవారం ఉదయం డ్యూటీపై బెంగళూరుకు వెళ్లారు. ఆయన భార్య పద్మ, కుమార్తె అర్చనలు ఇంట్లో ఉన్నారు. మంగళవారం రాత్రి వారు కింద పోర్షన్‌లో ఉన్న ఇంటి యజమాని వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇదే సమయంలో గుర్తుతెలియని దుండగుడు వారి కళ్లు గప్పి పద్మ ఇంట్లోకి చొరబడి ఓ మూలన దాక్కున్నాడు. కొద్దిసేపటికి పద్మ, తన కుమార్తెతో కలిసి పడుకునేందుకు ఇంట్లోకి వచ్చింది. ఇంటి లోపల తలుపునకు తాళం వేసి పడక గదిలో తల్లి, కుమార్తెలు నిద్రపోయారు. అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు పద్మ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును తెంచే వెళ్లే క్రమంలో అతని చేయి తగిలి ఆమె నిద్రనుంచి మేల్కొంది. దుండగుడిని చూసి పెద్దగా కేకలు వేస్తూ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీశాడు. పడక గదికి బయట నుంచి తలుపు పెట్టి కప్ బోర్డులో ఉన్న 7 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుని వెళ్లాడు. తల్లి, కుమార్తెలు తలుపును తెరిచే ప్రయత్నం చేయగా ఎంతకీ తలుపు రాలేదు. దీంతో జరిగిన విషయాన్ని పద్మ తన భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఆయన పద్మ సోదరి అరుణకు ఫోన్‌లో విషయం చెప్పడంతో అరుణ, ఆమె కుమారుడు ఇంటికి వచ్చి తలుపులు తెరిచారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు బాధితురాలు బుధవారం ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదో నగర ఇన్‌స్పెక్టర్ జి. మంగరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. ఇన్‌స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.