దొంగల ముఠా అరెస్ట్‌ | robbery gang arrest | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్ట్‌

Published Sat, Jul 30 2016 9:48 PM | Last Updated on Tue, Oct 9 2018 3:01 PM

దొంగల ముఠా అరెస్ట్‌ - Sakshi

దొంగల ముఠా అరెస్ట్‌

దేవరపల్లి : జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుకాణాల షట్టర్లు తొలగించి చోరీలకు పాల్పడడంతో పాటు మోటారు సైకిళ్లను అపహరిస్తున్న దొంగలను దేవరపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆ వివరాలిలా.. 
దేవరపల్లి మండలం గౌరీపట్నం, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన కొంత మంది యువకులు ముఠాగా ఏర్పడి జిల్లలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయంలో దుకాణాల షట్టర్లను గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేసి చోరీలకు పాల్పడంతో పాటు మోటారు సైకిళ్లను దొంగిలిస్తున్నట్టు చెప్పారు.
ఈ నెల 22న దేవరపల్లి మండలం గౌరీపట్నం ఆంధ్రాబ్యాంకు ఆవరణలో గల జిరాక్సు సెంటర్, కిరాణా దుకాణం షట్టర్‌ను తెరిచి జిరాక్సు, లామినేషన్‌ మిషన్, తిను బండారాలను దొంగిలించారు. ట్రక్కు ఆటోను అడ్డుగా పెట్టి గ్యాస్‌కట్టర్‌తో దుకాణం షట్టర్‌ను తెరవడం వీరి ప్రత్యేకత. దేవరపల్లిలోని దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరపల్లి ఎసై ్స సీహెచ్‌ ఆంజనేయులు కేసునమోదు చేయగా కొవ్వూరు రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు దర్యాప్తు చేశారు. ఈ నెల 29న అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు దేవరపల్లిలో ఎసై ్స.ఆంజనేయులు, సిబ్బంది తనిఖీ  చేస్తుండగా జిరాక్సు, లామినేషన్‌ మిషన్‌ ఉన్న ట్రక్కు ఆటోను గుర్తించి ఆరా తీశారు. గౌరీపట్నం ఆంధ్రాబ్యాంకు ఆవరణలో గల దుకాణంలో దొంగతనం చేసినట్టు ఆటోలోని వ్యక్తులు చాండ్ర వెంకటేశ్‌(వెంకన్న), మాదేటి పవన్‌(చిన్న), గాలుల శ్రీను, గన్నమని నవ సందీప్‌ తెలిపారు. అలాగే మోటారు సైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న కనుమూరి రాము, మాదాసు సంతోష్, పట్నాని శంకర్, మల్లిపూడి మురళి, మేరుగుల సోమరాజును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 9 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. దొంగిలించిన వాటిలో మూడు మోటారు సైకిళ్లను ఉండ్రాజవరం మండలం తాటిపర్రుకు చెందిన మాదిశెట్టి సురేష్‌ కొనుగోలు చేయగా అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. యర్రంపేటకు చెందిన వెంకన్న గతంలో పలు నేరాలకు పాల్పడినట్టు చెప్పారు. చోరీలకు ఇతనే ప్రణాళికను తయారు చేస్తున్నట్టు వివరించారు. సీఐ ఎం.సుబ్బారావు, ఎసై ్స ఆంజనేయులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తానని చెప్పారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. 
జిల్లాలో వరుస చోరీలు : డీఎస్పీ 
జిల్లాలో వరుసగా చోరీలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు సూచించారు. విలువైన వస్తువులను ఇళ్లల్లో పెట్టుకోరాదని, బ్యాంకు లాకర్లతో పెట్టుకోవాలని కోరారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement