
ఘనంగా గ్రామ దేవతల బోనాలు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఆయా గ్రామాల్లో వైభవంగా బోనాలు
చేవెళ్ల రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని ఆలూరు, దామరగిద్ద, వెంకన్నగూడ, గుండాల, రేగడిఘనాపూర్ గ్రామాల్లో బోనాల పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు పెద్ద ఎత్తున పోచమ్మ, దుర్గమ్మ, ఈదమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ దేవతలకు పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు పూనకాలు ఆకట్టుకున్నాయి.
కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం, ముచ్చర్ల, బేగంపేట గ్రామాల్లో ఆదివారం మహంకాళీ బోనాలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లో డప్పు వాయిద్యాల నడుమ మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.