పీజీ సీట్ల కేటాయింపులో మరోసారి గందరగోళం
– నాన్‌లోకల్ రిజర్వేషన్ కమ్ రోస్టర్‌పై విద్యార్థి సంఘాల అభ్యంతరం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆర్‌యూ పీజీసెట్ వెబ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపులో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ నెల 12న కేటాయించిన సీట్లలో కేటాయింపులో రెగ్యులర్, సెల్ఫండింగ్ కోర్సుల్లో ఎంపికలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో దానిని రద్దుచేశారు. తిరిగి ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు విద్యార్థులతో వెబ్ ఆప్షన్లను తీసుకున్నారు. అయితే ఈసారి రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్ల కేటాయింపులో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. నాన్‌లోకల్ కోటాలో రిజర్వేషన్ కమ్ రోస్టర్ పాయింట్ల ప్రకారం అ«ధికారులు సీట్లు కేటాయించారు. దీంతో మంచి ర్యాంకులు వచ్చిన కొందరికీ సీటురాలేదు.
ఇంగ్లిష్ సబ్జెక్టులో లక్ష్మన్న అనే విద్యార్థికి 30 ర్యాంకు వచ్చింది. అయినా ఇతనికి వర్సిటీలో ర్యాంకు రాలేదు. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్‌ను పాటించడంతో 36వ ర్యాంకు విద్యార్థికి సీటు వచ్చింది. అలాగే యూనివర్సిటీలో ఇంగ్లిష్ సబ్జెక్టులో బీసీడీ క్యాటగిరికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. మరోవైపు ఎక్కువమంది విద్యార్థులకు న్యాయం చేయాలని నాన్‌లోకల్‌లో రోస్టర్‌పాయింట్లను కేటాయించినట్లు వీసీ వై.నరసింహులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఇదే విధానాన్ని అమలు చేస్తాయని, కొందరికి అన్యాయం జరిగినా ఎక్కువమందికి లాభం చేకూరుతుందని తనను కలిసిన విద్యార్థి సంఘాలకు వివరించారు. కాగా, ఎవరికైనా మంచి ర్యాంకు వచ్చి వర్సిటీలో సీటు రాకపోతే తనకు దరఖాస్తు చేసుకోవాలని, అలాంటి దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.