ru
-
డిగ్రీ ఫలితాలు విడుదల
-జబ్లింగ్ విధానం అమలుతో తగ్గిన ఉత్తీర్ణత శాతం కర్నూలు(ఆర్యూ): డిగ్రీ పరీక్ష ఫలితాలను రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ వై.నరసింహులు శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మయిలు సత్తా చాటారు. మొత్తం మీద ఉత్తీర్ణత 42 శాతానికి మించలేదు. రెండో సెమిస్టర్‌కు 16,138 మంది హాజరవ్వగా 4,995 మంది (30.95 శాతం) ఉత్తీర్ణులయ్యారు. నాలుగో సెమిస్టర్‌కు 14,075 మందికి గాను 5,815 మంది(41.31 శాతం), మూడో సంవత్సరం విద్యార్థుల్లో 13,948 మంది హాజరవ్వగా, 5,810 మంది(41.65 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోల్చగా ఈ సంవత్సరం ఫలితాల శాతం దారుణంగా తగ్గింది. దీనికి జంబ్లింగ్ విధానంలో పరీక్షల నిర్వహణే కారణంగా తెలుస్తోంది. మొత్తం బాలికలు 5,954 మంది పరీక్ష రాయగా 3,079 మంది(51.71 శాతం) పాసయ్యారు. బాలురు 10,184 మంది హాజరవ్వగా 1,916(18.81 శాతం) మాత్రమే పాసయ్యారు. బాలురు బీబీఏలో అత్యధికంగా 50.27 శాతం మంది, బాలికలు బీసీఏలో 92.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థులు వారి సమాధాన పత్రాల మీద కళాశాల కోడ్ పొందుపర్చకపోవడంతో వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. విద్యార్థులు ఫలితాలను www.ruk.ac.in, ruexams.in అనే వెబ్సైట్లో శనివారం నుంచి చూసుకోవచ్చు. ఏప్రిల్ 2017 పరీక్షల్లో మూడో సంవత్సరం రెగ్యులర్ పరీక్షలు రాసి ఒక్క సబ్జెక్టు ఫెయిలై ఉంటే ఇన్స్టంట్ పరీక్ష నిర్వహిస్తామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఆర్‌యూను సందర్శించిన పద్మావతి వర్సిటీ వీసీ
కర్నూలు (ఆర్యూ): పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీరమాచినేని దుర్గా భవాని బుధవారం రాయలసీమ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్యూ అభివృద్ధి పనులను, వర్సిటీ భవనాలను పరిశీలించారు. వర్సిటీలో విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్యూ మాదిరిగా తమ వర్సిటీలో ప్రభుత్వ సంస్థల సహకారంతో భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటి రిజిస్ట్రార్ అమర్నాథ్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిజనిర్ధారణ కమిటీ నియామకం
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీలో కీలకమైన రికార్డులు మాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులపై విచారణకు వీసీ వై. నరసింహులు త్రిసభ్య కమిటీని నియమించారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆర్యూ నుంచి ఈసీ మెంబర్లు ప్రొఫెసర్ జి.టి.నాయుడు, ప్రొఫెసర్ కె.సంజీవరాయుడు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. వీరు విచారణ చేసి మూడు రోజుల్లో నివేదిక అందించనున్నారు. -
ఆర్యూ మాజీ రిజిస్ట్రార్‌కు అస్వస్థత
- ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిక - ఏడు నెలలుగా మానసిక క్షోభ కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.టి.కె.నాయక్ మానసిక క్షోభతో ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రీ ఎస్టేట్‌లోని విజయదుర్గ కార్డియాక్ సెంటర్‌కు తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు.. మనోవేదనకు గురైనట్లు, గుండె సంబంధ సమస్యలున్నట్లు తెలిపారు. వర్సిటీలో ఇటీవలి పరిణామాలు, అధికారుల వేధింపులే ఇందుకు ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
తూతూమంత్రంగా ఈసీ మీటింగ్
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం తూతూమంత్రంగా ముగించేశారు. వర్సిటీ సమస్యలు, పరిష్కారంపై చర్చ కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, రాష్ట్ర కాలేజ్ మేట్ కమిషనర్ కాని హాజరుకాలేదు.రాష్ట్ర ఫైనాన్స్ జాయింట్ సెక్రటరి సి.హెచ్.వి.ఎన్.మల్లేశ్వరరావు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ వై.నరసింహులు మాట్లాడుతూ వర్సిటీలో విద్యుత్ వాడకం ఎక్కువైనందునా లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి రూ. 1.2 కోట్లతో 11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం, 500 కేవీ పరిమాణంలో రూఫ్‌టాప్ పవర్లో భాగంగా వర్సిటీలోనే సోలార్ పవర్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయించామన్నారు. పీపీపీ భాగస్వామ్యంలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న లైఫ్ సైన్స్ బిల్డింగ్‌లో అవసరమయ్యే ల్యాబ్ పరికరాలు, కంప్యూటర్లు, స్టోరేజ్ పాయింట్, ఫర్నీచర్ తదితరవాటికి రూ.2 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించామన్నారు. కార్యక్రమంలో ఈసీ మెంబర్లు రిజిస్ట్రార్ అమర్నాథ్, డాక్టర్ అబ్దుల్ ఖాదర్, డాక్టర్ శివశంకర్, డాక్టర్ జి.టి.నాయుడు, ప్రొఫెసర్ సంజీవరావు, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రిన్సిపల్ కె.శ్రీనివాసరావును ఈసీ మెంబర్‌గా ప్రభుత్వానికి నివేదించకపోవడంపై ఈ సమావేశానికి కూడా దూరం పెట్టారు. -
ఆర్యూ పీజీ సెట్ గడువు పొడిగింపు
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు, వర్సిటీ ప్రాంగణంలోని కళాశాల పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు పీజీ సెట్ కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఉన్న గడువును 30వ తేదీ వరకు పొడిగించారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో మే నెల 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్షలన్నీ ఆన్లైన్లో షెడ్యూల్ ప్రకారమే అంటే మే నెల 24, 25, 26 తేదీల్లో నంద్యాల, ఆదోని, కర్నూలు కేంద్రాలుగా నిర్వహిస్తామని తెలిపారు. -
డిగ్రీ అధ్యాపకుల చర్చలు సఫలం
– నేటీ నుంచి స్పాట్‌కు హాజరుకానున్న అధ్యాపకులు కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షల స్పాట్‌కు రెమ్యూనరేషన్ పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా స్పాట్ అధ్యాపకులు బహిష్కరించారు. శుక్రవారం ఆర్యూ అ«ధికారులు డిగ్రీ కాలేజీ అధ్యాపకుల అసోసియేషన్ జేఏసీ నాయకులతో జరిపిన చర్చలు సఫలమైనట్లు జేఏసీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. రెమ్యూనరేషన్ నాన్ లోకల్ అధ్యాపకులకు రూ. 640 నుంచి 710 రూపాయలకు, లోకల్ వారికి రూ. 550 నుంచి 640కు పెంచేందుకు ఆర్యూ అధికారులు అంగీకరించారు. ఇతర డిమాండ్‌పై కూడా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి స్పాట్‌కు హాజరుకానున్నట్లు వారు పేర్కొన్నారు. -
ఆర్‌యూలో మొబైల్ యాప్ విడుదల
కర్నూలు (ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీలో మొబైల్ యాప్‌ను వైస్ చాన్సలర్ వై.నరసింహులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్న మహమ్మద్ ఇలియాస్.. స్పోకన్ ఇంగ్లిష్ యాప్ తయారు చేశారన్నారు. మున్ముందు ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఇలియాస్‌కు త్వరలో ల్యాప్‌టాప్‌ను బహుకరిస్తామన్నారు. ఇలియాస్ మాట్లాడుతూ.. ఆత్మకూరుకు చెందిన తన తండ్రి బాషా లారీ డ్రైవర్ అని, తల్లి కమ్రున్బి గృహిణి అన్నారు. తనకు సహకరించిన అధ్యాపకులు రవికుమార్, జేమియాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
12 మంది డిగ్రీ విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం జరిగిన మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా 12 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. తుగ్గలి ఏఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, పత్తికొండ రాఘవేంద్ర కళాశాలకు చెందిన ఇద్దరు, ఆలూరు రాఘవేంద్ర కళాశాలకు చెందిన నలుగురు, ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి, బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో 32 మందిపై మాల్ ప్రాక్టీసు కేసులు
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 32 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. గురువారం.. కోడుమూరు సాయిరాం డిగ్రీ కళాశాలలో 18 మంది విద్యార్థులు, వివేకానంద డిగ్రీ కళాశాలలో 11 మంది విద్యార్థులు, గూడూరు సాయిరాం డిగ్రీ కళాశాలలలో ముగ్గురు విద్యార్థులపై పరీక్షల తనిఖీ అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి వెంకటేశ్వర్లు తెలిపారు. -
23 మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు
కర్నూలు(ఆర్యూ): శనివారం జరిగిన రెండో సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 23 విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. నందికొట్కూరు వైష్ణవి కళాశాలలో ఇద్దరు, కర్నూలు డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోవెలకుంట్ల ఎస్.వి డిగ్రీ కళాశాల సెంటర్లో ముగ్గురు, ఎమ్మిగనూరు రావూస్ కళాశాల సెంటర్లో ఇద్దరు, వైష్ణవి డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోడుమూరు సాయిరాం సెంటర్లో 14 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో రెండు రోజులుగా మొత్తం 31 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యార్థుల పరీక్ష పేపర్లను తనిఖీ చేసి ప్రత్యేక కమిటీ నిర్ణయం ద్వారా ఒకటి లేదా రెండుసార్లు పరీక్షలకు అనుమతించకుండా చేసే అవకాశాలున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు. -
రేపు ఆర్యూ కళాశాల వార్షికోత్సవం
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీ కాలేజీ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. గుండెపోటుతో సోమవారం మరణించిన విద్యార్థి శ్రీనివాస్‌కు మంగళవారం నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా వివిధ ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌ప్రసాద్ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు సునిత, రామ్‌ప్రసాద్, జయప్రతాప్, డీన్ సంజీవరావు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆర్‌యూలో మరో కొత్త కోర్సు
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్న 15 కోర్సులతో పాటు మరో కొత్త కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ఖనిజాల గనిగా పేరుగాంచిందని ఈ నేపథ్యంలో మైనింగ్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశలు అందిపుచ్చుకునేందుకు ఎర్త్ సైన్స్(భూ ఖనిజ శాస్త్రం) అనే కొత్త కోర్సు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో సున్నపురాయి, ఇనుము, యురేనియం, వజ్రాలు, బంగారం తదితర ఖనిజాల వెలికితీతలో మైనింగ్, కార్పొరేట్ కంపెనీలు ఎర్త్సైన్్స పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఇస్తాయన్నారు. ఈకోర్సుకు సైన్స్ లేదా మ్యాథ్స్ చదివిన డిగ్రీ విద్యార్థులు అర్హులు అని తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా పరిగణించి ఫీజు నిర్ణయిస్తామని, ఇందులో మొత్తం 30 సీట్లు ఉంటాయని వెల్లడించారు. -
పొరపాటు.. గ్రహపాటు
గందరగోళంలో ఎంపీఈడీ కోర్సు విద్యార్థులు - ఫీజు నిర్ణయంలో తప్పులో కాలేసిన ఆర్యూ అధికారులు - వర్సిటీ నిర్ణయించిన ఫీజు రూ.21,735 - యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్న మొత్తం రూ.95వేలు - కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థుల వాగ్వాదం - ఆశలు వదులుకున్న 28 మంది విద్యార్థులు కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ(ఆర్యూ) పరిధిలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఎంపీఈడీ కోర్సు ఫీజు విషయంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. ఇదే సమయంలో ప్రైవేటు కాలేజీల ధన దాహంతో కోర్సులో చేరేందుకు విద్యార్థులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో రెండు కాలేజీలకు ఎంపీఈడీ కోర్సుకు అనుమతినిచ్చారు. శుక్రవారం ఆర్‌యూలో ఎంపీఈడీ కోర్సుకు చివరి కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం సీట్లు 120 కాగా.. అదనంగా 20 శాతం మేనేజ్మెంట్ కోటాగా నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వర్సిటీ నిర్ణయించిన మేరకు ఓసీలు రూ.21,735, రిజర్వేషన్ అభ్యర్థులు రూ.1,735ల ఫీజు చెల్లించారు. వాస్తవానికి కోర్సు ఫీజు రూ.59 వేలు కాగా.. ఆర్యూ అధికారులు పొరపాటున రూ.21,735లుగా ప్రకటించారు. తీరా ఇప్పుడు విద్యార్థులు కోర్సులో చేరిన తర్వాత.. తాము తప్పుగా ఫీజు నిర్ణయించామని చెప్పడం వివాదాస్పదమవుతోంది. పైగా ఇదే ఫీజుకే ప్రయివేట్ కాలేజీలు అడ్మిషన్లు ఇవ్వాలని ఆర్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేట్ కాలేజీల యాజమాన్యం కూడా మరో తిరకాసు పెట్టింది. తమకు వర్సిటీ నిర్ణయించిన రూ.21,735 ఫీజు ఏమాత్రం సరిపోదని.. కళాశాలల్లో చదవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్లోనే ఉండాలనే నిబంధన విధించారు. ఇందుకోసం సంవత్సరానికి అదనంగా రూ.45వేలు చెల్లించాలని తేల్చారు. అంటే కళాశాల ఫీజుతో పాటు సెమిస్టర్‌కు రూ.2వేలు చొప్పున 4 సెమిస్టర్లకు రూ.8వేల పరీక్ష ఫీజు.. యూడీఎఫ్ రూ.5వేలు, డ్రెస్‌కు రూ.10వేలు, స్పోర్ట్్స కిట్‌కు రూ.2,500, రికార్డు ఫీజు రూ.2వేల ప్రకారం ప్రతి సంవత్సరానికి రూ.95వేల ప్రకారం రెండేళ్లకు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈవిధంగా కడతామంటే అడ్మిషన్ ఇస్తామని.. లేదంటే సీటు క్యాన్సల్ చేసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 28 మంది విద్యార్థులు ఎంపీఈడీ కోర్సు మానుకోవాల్సి వచ్చింది. ఫీజు నిర్ణయంలో ఆర్యూ అధికారుల పొరపాటు రాష్ట్రంలోని వెంకటేశ్వర, ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు అఫిలియేట్ కళాశాలల్లో ఎంపీఈడీ కోర్సు ఫీజు రూ.34,540, వర్సిటీ ప్రాంగణాల్లో రూ.4,950లుగా ఉంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలల్లో రూ.59 వేలుగా ఉంది. అయితే ఆర్యూ అధికారులు ఎస్కేయూను అనుసరించామని చెబుతున్నప్పటికీ.. అదీ చేయకుండా గత 15 రోజుల క్రితం పత్రికా ప్రకటనలో కన్వీనర్ కోటాలో రూ.29 వేలు ప్రకటించారు. మళ్లీ పెద్ద మనసుతో దాన్ని కాస్తా ఓసీలకు రూ.21,735లు చేస్తూ.. రిజర్వేషన్ అభ్యర్థులు కేవలం రూ.1,735 చెల్లించాలని విద్యార్థులకు పోస్టు చేశారు. దీంతో మెరిట్ మీద ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో వర్సిటీ తెలిపిన ఫీజును చెల్లించారు. అయితే యాజమాన్యాలు మొండికేయడంతో విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారింది. ఇది ప్రైవేటు కళాశాలల మోసం : యు.మల్లేష్ నేను మొదటి ర్యాంకర్‌ను. వర్సిటీ నిర్ణయించిన ఫీజు చెల్లించా. కానీ కళాశాల యాజమాన్యం సంవత్సరానికి రూ.95 వేలు కడితేనే అడ్మిషన్ ఇస్తాం.. లేకుంటే వెళ్లిపోవచ్చంటున్నారు. మరి మా భవిష్యత్ ఏమిటి? ఫీజు గురించి ముందే చెప్పాల్సింది.. : ఆయేషా వర్సిటీ పాలకులు ఎంత ఫీజు చెల్లించాలో ముందే చెప్పారు. లెటర్ పంపారు. పత్రికల్లో ప్రకటించారు. మరి ఇక్కడికి వచ్చాక రూ.21 వేల నుంచి రూ.95 వేలకు పెంచి కట్టమంటున్నారు. అదెలా? ఈ సంవత్సరానికి ఇంతే ఫీజు : బి.అమర్నాథ్, రిజిస్ట్రార్ ఎంపీఈడీ ఫీజు నిర్ణయించడంలో మా అధికారుల వైఫల్యం ఉంది. కన్వీనర్ కోటా రూ.59 వేలుగా నిర్ణయించినా.. పొరపాటున రూ.21,735లుగా ప్రకటించారు. వాస్తవానికి కళాశాలలకు తీవ్రమైన నష్టం వస్తుంది. అయితే ఈ సంవత్సరం వరకు మాత్రం రూ.21,735 మాత్రమే కాలేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజుకే ఈ ఏడాది అడ్మిషన్లు ఇవ్వాలి. అయితే, వచ్చే ఏడాది ఎంత ఫీజు అనే అంశంపై ఒక కమిటీ వేస్తాం. ఫీజు వివరాలను త్వరలో విడుదల చేయబోయే ఆర్యూ పీజీ సెట్ నోటిఫికేషన్లో పేర్కొంటాం. -
ఎన్నెన్నో ఆశలు
- నేడు ఆర్యూ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశం - అనుకూల నిర్ణయాలు ఉంటాయని ఉద్యోగుల నిరీక్షణ కర్నూలు(ఆర్యూ): రాయలసీమ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించే ఎగ్జిక్యూటీవ్ కౌన్సెల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో కౌన్సిల్ చైర్మన్ అయిన వీసీ వై.నరసింహులు అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ ఐఏఎస్ ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ మల్లేశ్వరరావులు హాజరయ్యారవుతున్నారు. కౌన్సిల్ సభ్యులైన సంజీవరావు, కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, నాయుడు, సిల్వర్‌జూబ్లీ ప్రిన్సిపాల్, అడ్వకేట్ శివశంకర్ తదితరులు పాల్గొంటున్నట్లు రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు తీసుకునే నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండాలని వర్సిటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని అందరూ వెయ్యికళ్లతో నిరీక్షిస్తున్నారు. ఈ సమావేశంలోనైనా ఉద్యోగులకు టైమ్ స్కేల్ వర్తింపజేస్తారని, ఇటీవల కోర్టు రద్దు చేసిన ప్రొఫెసర్ల పోస్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేమోనని ఉత్కంఠగా ఎదురు చూస్తునానరు. టైమ్ స్కేల్ వర్తింపజేయాలి: కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న చిరుద్యోగుల్లో 8 సంవత్సరాలు దాటిన వారికి టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరుతున్నారు. దినసరి కూలీతో పని చేస్తున్న వారికి జీఓ నెం.151 వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం చేపట్టాలని చిరుద్యోగులు కోరుతున్నారు. వేతనాల్లో వ్యత్యాసం: ప్రస్తుతం వీసీ వచ్చిన తర్వాత గత వీసీల హయాంలో టీచింగ్ స్టాఫ్ వేతనం క్రమం 0–5 సంవత్సరాలు, 6–10, 11–15, 16 ఆ తర్వాత అనే విధంగా ఉండేది. ప్రస్తుత వీసీ గడచిన ఈసీ మీటింగ్‌లో 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత నిబంధనలతో అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రమైన క్షోభకు గురవుతున్నారు. జీతం పెంచాలంటే 10 సంవత్సరాల తర్వాతనే ఎన్హస్మెంట్ వస్తుంది. పాత పద్ధతిలో అయితే 6 సంవత్సరాలు దాటితే దక్కేది. ప్రస్తుతం టీచింగ్ అసిస్టెంట్లకు 10 సంవత్సరాలు దాటిన వారికి రూ.30 వేలు, 15 సంవత్సరాలు దాటిన వారికి రూ.35 వేలుగా ఇస్తున్నారు. గత ఈసీ మీటింగ్‌లో చర్చించకుండానే నోటిఫికేషన్ : వర్సిటీలో ఈ మధ్య వచ్చిన టీచింగ్ ఫ్యాకల్టీల నియామకం ఈసీ మీటింగ్‌లో చర్చించకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అప్పట్లో మంత్రి గంటా శ్రీనివాసరావే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ఈ మీటింగ్‌లో సరిచేసే అవకాశం ఉంది. కోర్టులో చుక్కెదురు: వర్సిటీ పాలకుల నిర్ణయాలతో ప్రస్తుతం పని చేస్తున్న బోధనా సిబ్బంది తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకెళ్లడంతో టీచింగ్ ఫ్యాకల్టీల నియామక ప్రక్రియను కోర్టు నిలిపివేసింది. తద్వారా ఎవరైతే కోర్టుకెళ్లారో వారిపై వేధింపులుకూడా అదే స్థాయిలో చూపుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అంతేగాక వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం రద్దు చేసింది. -
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
– విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి – శాస్త్ర సాంకేతిక రంగాల్లో అపార అవకాశాలు – యోగివేమన వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ ఎ.రామచంద్రారెడ్డి పిలుపు కర్నూలు (ఆర్యూ): విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఐదు రోజుల నుంచి రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సైన్స్ ఇంటర్న్‌షిప్ ఇన్స్పైర్–2017 మంగళవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవాడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఆర్యూ వీసీ నరసింహులు మాట్లాడుతూ సైన్స్ లేనిదే ప్రపంచం లేదన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు మెమెంటో అందజేశారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అమర్నాథ్, క్యాంపు కోఆర్డినేటర్ చక్రవర్తి, అడిషనల్ కోఆర్డినేటర్లు ఎస్.రమణయ్య, డాక్టర్ కమల, ప్రొఫెసర్లు సంజీవరావు, సునీత తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేం
– హెచ్‌సీయూ ప్రొఫెసర్ దయానంద్ కర్నూలు (ఆర్యూ): సైన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేమని హెచ్‌సీయూ లైఫ్‌సైన్స్ ప్రొఫెసర్ దయానంద్ అన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో సైన్స్ ఇన్స్పైర్ క్యాంపు మూడో రోజు నిర్వహించారు. ఫ్లోరైడ్ ప్రభావంతో దంత సమస్యలు ఏర్పడుతున్నాయని.. వీటిని ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు ప్రయోగాత్మకంగా వివరించారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతం, పులికాట్ సరస్సు నీటి నమూనాల గురించి చేసిన పరిశోధనలను ఫ్రొసెర్లు దయానంద్, జనార్దనరాజు వివరించారు. తుంగభద్ర, హంద్రీ, వక్కిలేరు, కుందూ, భవనాశి నదుల్లో మేలైన నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని సూచించారు. నీటి సంరక్షణ ద్వారా రాయలసీమలో కరువు పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. బ్లాక్ బోర్డ్ ఉత్తమం.. బోధన సామర్థ్యాలకు ఎలక్ట్రానిక్ పరికరాల కాకుండా బ్లాక్‌బోర్డు ఉత్తమంగా ఉంటుందని హెచ్‌సీయూ ప్రొఫెసర్ డా.వి.కన్నన్ తెలిపారు. వేదగణితం, సంఖ్యామానం, సంఖ్యామాన విశ్లేషణా పద్ధతులను నల్లబల్ల మీదుగానే విద్యార్థులకు ఉపదేశించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో జనటిక్ ఇంజినీరింగ్‌పై ప్రొఫెసర్ దయానంద్ ఉపన్యశించారు. నేటి కార్యక్రమాలు.. వాస్తవ సంఖ్యలు, వాటి అనువర్తితాలు..విశ్లేషణ అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గణితభాగం ప్రొఫెసర్ భాస్కరరెడ్డి ప్రసంగిస్తారు. వాతావరణ కాలుష్యం, పర్యావరణంలో రసాయనశాస్త్రం ప్రాముఖ్యత, కాలుష్య నివారణ పద్ధతులను పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కర్నూలు అధ్యాపకులు బి.భాస్కరరెడ్డి వివరిస్తారు. -
భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదే
- హెచ్‌సీయూ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, రామాచార్యులు - సైన్స్ ఇన్స్పైర్ - ఆసక్తి రేకెత్తిస్తోందంటున్న విద్యార్థులు కర్నూలు(ఆర్యూ): భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. చంద్రశేఖర్, డాక్టర్ రామాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న సైన్స్ ఇన్స్పైర్ క్యాంపు రెండో రోజులో భాగంగా శనివారం వారు ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నానో పదార్థాలు, వాటి ఉపరితల దృగ్విషయాలు సైజు తగ్గే కొలది ఉపరితల వైశాల్యం పెరిగి విలక్షణమైన స్వభావాన్ని కల్గి ఉంటాయన్నారు. ఆధునిక ప్రపంచంలో నానో మెడిసిన్, నానో బయో టెక్నాలజీ, నానో దుస్తులు, నానో జెల్స్ ఇలా మానవుని దైనందిన వస్తువుల తయారీ ఉపయోగాల గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. రాబోయే తరం నానో తరంగా భావించవచ్చని ఉద్ఘాటించారు. హెచ్‌సీయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ రామాచార్యులు మాట్లాడుతూ కర్బణ రసాయన శాస్త్రంలో మందుల తయారీ, వాటిని తయారు చేసే సంశ్లేషణా పద్ధతులు మానవాళికి వాటి ఉపయోగాల గురించి వివరించారు. శనివారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతిక, మానవీయ విలువల పరీక్ష ఉండటంతో సైన్స్ ఇన్సై్పర్కు చాలామంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నేటి కార్యక్రమాలు న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ భూ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్. జనార్దన్‌రాజు పాల్గొని, భూ రసాయన శాస్త్రం, నీరు పర్యావరణం, కాలుష్యం తదితర అంశాల గురించి వివరించనున్నారు. అలాగే హెచ్‌సీయూ ప్రొఫెసర్ దయానంద బయో రెమిడేషన్ మీద ప్రసంగిస్తారు. మానవ శరీరంలో జీన్స్ ప్రోటీన్స్ తదితర వాటిపై వివరిస్తారు. -
రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు శంకరాస్ విద్యార్థులు
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల్లో శంకరాస్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఉత్సవాలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఆ కాలేజీ డైరెక్టర్ డాక్టర హరికిషన్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం కళాశాలలో అభినందించి మాట్లాడారు. క్విజ్ పోటీలలో వెంకటరమణ, రూపేష్ , సోలోసాంగ్ పోటీలలో శ్రావణి విజేతలుగా నిలిచారన్నారు. వీరు ఈ నెల 30 వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ మద్దిలేటి, అధ్యాపకులు సోమశేఖర్, రఘునందన్, పాల్గొన్నారు. -
సైన్స్‌తోనే దేశం అగ్రగామి
-విద్యార్థులు పరిశోధనలు వైపు అడుగులు వేయాలి - ప్రముఖ శాస్త్రవేత్త పిలుపు -ఆర్‌యూలో అట్టహాసంగా సైన్స్ ఇన్స్పైర్ ప్రారంభం కర్నూలు(ఆర్యూ): సైన్స్‌తోనే దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని బాబా అటామిక్ ఎనర్జీ ముంబాయి శాస్త్రవేత్త ఎ.వి.రెడ్డి, హెచ్‌సీయూ ప్రొఫెసర్ అభినయ్ సమంత అన్నారు. విద్యార్థులు పరిశోధన వైపు ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో శుక్రవారం ఇన్స్పైర్ ఇంటర్న్‌షిప్ సైన్స్ క్యాంప్ అట్టహాసంగా ప్రారంభమైంది. వర్సిటీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి వారు అతిథులుగా హాజరై మాట్లాడారు. మన శాస్త్రవేత్తలు దేశం గర్వపడేలా 103 ఉపగ్రహాలను త్వరలో ప్రయోగించనున్నారని చెప్పారు. కెమిస్ట్రీలో ఎగ్జ్జైట్మెంట్ ఇన్ సైన్స్ అనే అంశంపై ప్రొఫెసర్ సమంత ఉపన్యాసించారు. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పరిశోధన రంగాల్లో విద్యార్థుల పాత్ర, ప్రభుత్వ ఆలోచన విధానం తదితర విషయాలను వివరించారు. న్యూక్లియర్ రంగంలో అధునాతన పరిశోధనల గురించి శాస్త్రవేత్త ఏవీరెడ్డి వెల్లడించారు. అకర్బన రసాయన శాస్త్రంలో కొన్ని ప్రయోగాలను విద్యార్థులతో చేయించి వారిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఆర్యూ వైస్ చాన్స్‌లర్ నరసింహులు, రిజిస్ట్రార్ బి.అమర్నాథ్, సమన్వయకర్త ఎస్.రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు రెండో రోజు శనివారం హైదరబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.రామాచారి పాల్గొని కర్బన రసాయన శాస్త్రంలో ఔషధాల తయారీ ప్రాముఖ్యత, వాటిని ప్రయోగించాల్సిన పద్ధతులను వివరించి ప్రయోగాలు చేసి చూపించనున్నారు. అంతేకాక ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖర్ హెచ్‌సీయూ కెమిస్ట్రీ విభాగం నుంచి నానో పదార్థాల మీద జరిగే పరిశోధనలు, ప్రపంచంలో నానో రంగంలో జరుగుతున్న అధునాతనమైన పద్ధతులను తెలియజేస్తారు. హెచ్‌సీయూ వీసీ పర్యటన రద్దు..ఊపిరి పిల్చుకున్న పోలీసులు సైన్్స ఇన్‌స్పైర్‌కు హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ అప్పారావు హాజరవుతున్నారని విద్యార్తి సంఘాలకు సమాచారం అందిందిం. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన ఆయనను ఎలాగైనా అడ్డుకోవాలని విద్యార్థులు వర్సిటీ గేట్ల ఎదుట బైఠాయించారు. ఈవిషయం తెలిసి ఆర్యు అధికారులు వర్సిటీ క్యాంపస్‌లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అయితే, ఉన్నట్టుండి అప్పారావు తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలియడంతో పోలీసులు, ఆర్యూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థి మృతికి కారణమైన అప్పారావును ఆహ్వానించిన ఆర్యూ వీసీ నరసింహులు వైఖరికి ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, ఆర్పీఎస్ ఎస్ఎఫ్, ఏఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. -
ఆర్యూ లో ధర్నా
కర్నూలు (ఆర్యూ) : ప్రత్యేక హోదా కోసం.. రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయలసీమ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, బీవీ రమణలు మాట్లాడారు. హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇప్పకైనా రాష్ట్ర ప్రభుత్వం హోదా కోసం ఉద్యమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్, నాయక్, రమేష్, నిర్మల్, రాము, చలపతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆర్‌యూలో జిల్లాస్థాయి యూత్ ఫెస్టివల్
కర్నూలు(ఆర్యూ): స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో నేడు జిల్లాస్థాయి యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా డివిజన్ వారీగా జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో గెలుపొందిన విజేతలకు జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించే విజేతలు ఈనెల 31వ తేదీన రాజమహేంద్రవరంలోని నన్నయ యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్‌కు ఎంపికవుతారు. జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో భాగంగా వివిధ రకాల లలిత కళలు, వ్యాసరచన, కరిక్యులర్, కో–కరిక్యులర్ యాక్టివిటీస్ తదితర సాంస్కృతిక పోటీలను 23 విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్.నరసింహులు తెలిపారు. -
ఆర్యూ తరగతులు పునఃప్రారంభం
కర్నూలు(ఆర్యూ): సంక్రాంతి సెలవుల అనంతరం రాయలసీమ యూనివర్సిటీ తరగతులు పునఃప్రారంభమైనట్లు రిజిస్ట్రార్ ఆచార్య అమర్నాథ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెలవుల అనంతరం వర్సిటీ కళాశాల తరగతులు, మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి రావాల్సి ఉండగా హాజరు శాతం తక్కువగా ఉందన్నారు. నేటి నుంచి నగరంలో జరిగే నందినాటకోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 4 నాటకాలను విద్యార్థుల విభాగం నుంచి ప్రదర్శిస్తామని తెలిపారు. -
27 నుంచి ఆర్‌యూలో ఇన్స్పైర్ సైన్స్ క్యాంప్
కర్నూలు సిటీ: రాయలసీమ వర్సిటీలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఇన్స్రైర్ సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వీసీ వై.నరసింహూలు, రిజిస్ట్రార్ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు రోజుల సైన్స్ క్యాంప్‌నకు ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారని, ఇందులో కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌తోపాటు ప్రోగ్రామ్ కోర్టినేటర్ ప్రొఫెసర్ ఐఈ.చక్రవర్తి, సహాయ నమన్వయకర్తలు డా.రమణయ్య, కమల(ఫోన్: 9393801635, 8986026400)ను సంప్రదించాలన్నారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో అమ్మాయిల హావా
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల సెమిస్టర్ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. గతేడాది నవంబరులో నిర్వహించిన మొదటి, మూడవ సెమిస్టర్, సíప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఆర్యూ వీసీ వై.నరసింహులు, రిజిస్ట్రార్ అమర్నాథ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు 16,944 మంది విద్యార్థులకుగాను 9743 మంది, మూడవ సెమిస్టర్ పరీక్షల్లో 14,410 మందికిగాను 8088 మంది ఉత్తీర్ణులయ్యారు. సఫ్లిమెంటరీ పరీక్షల్లో 14,692 మంది విద్యార్థులు హాజరైతే 8139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఠీఠీఠీ.టuజు.్చఛి.జీn, ట్ఛటu ్టట.టuజు.్చఛి.జీn, ఆయా కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఆర్యూ సీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు - బీఏలో అబ్బాయిలు 1838లో 992 మంది, అమ్మాయిలు 573కుగాను 425 మంది ఉత్తీర్ణులయ్యారు. బీబీఏలో అబ్బాయిలు 193కుగాను 105, అమ్మాయిలు 135కు 115 మంది, బీసీఏలో అబ్బాయిలు 128కిగాను 50, అమ్మాయిలు 39లో 30 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకామ్‌లో అబ్బాయిలు 4443లో 2042, అమ్మాయిలు 1626లో 1195, బీఎస్సీలో అబ్బాయిలు 4231లో 2032, అమ్మాయిలు 3766లో 2747 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడో సెమిస్టర్.. - బీఏలో అబ్బాయిలు 1588లో 739 మంది, అమ్మాయిలు 659లో 428, బీబీఏలో అబ్బాయిలు 160లో 126 మంది, అమ్మాయిలు 118లో 115 మంది పాసయ్యారు. బీసీఏలో అబ్బాయిలు 34లో 16, అమ్మాయిలు 15లో 09 మంది, బీకామ్‌లో అబ్బాయిలు 3864లో 1311, అమ్మాయిలు 1642 మందిలో 1064, బీఎస్సీలో అబ్బాయిలు 3340లో 1806, అమ్మాయిలు 2975లో 2408 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.