ఆర్‌యూలో పోస్టుల గోల
– సిఫారసు చేస్తున్న అధికార పార్టీ ఎంపీ
– నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రాయలసీమ యూనివర్సిటీ(ఆర్‌యూ)లో పోస్టుల భర్తీ వ్యవహారం మరోసారి విమర్శలకు తావిస్తోంది. అర్హులను కాదని అధికార పార్టీ సిఫారసు చేసిన వ్యక్తులకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు అర్హత లేనప్పటికీ అధికార పార్టీ నేత సిఫారసు పేరుతో రిజిస్ట్రార్ పోస్టును కట్టబెటారనే ఆరోపణలు సమసిపోకముందే.. అసిస్టెంట్ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టుల భర్తీలోనూ ఇదే రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎంపీ సిఫారసు చేసిన వ్యక్తికే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు దక్కినట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని వర్సిటీ వర్గాలు కూడా ధ్రువీకరించడం ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
వర్సిటీ వారికి ఇవ్వకుండా..
వాస్తవానికి రాయలసీమ యూనివర్సిటీలో అర్హులైన అనేక మంది అధ్యాపకులు ఉన్నారు. వీరికి పదోన్నతి ద్వారా ఆయా పోస్టులను కట్టబెట్టేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ పొరుగింటి పుల్లకూర రుచి అనే చందంగా బయటి వ్యక్తులను తీసుకోవడంపై వర్సిటీలోని అధ్యాపక సిబ్బందిలోనూ నిరాసక్తి వ్యక్తమవుతోంది. తమను కాదని అధికార పార్టీ చెప్పిన వారికి అందలం ఎక్కించేందుకు పోస్టుల భర్తీ చేపట్టడం సరికాదని వాపోతున్నారు. వాస్తవానికి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌తో పాటు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 28వ తేదీన నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్టుకు ఒక పేరును సిఫారసు చేసినట్టు తెలిసింది. అయితే, సదరు వ్యక్తికి నిబంధనలకు మేరకు సరిౖయెన అర్హతలు లేవని.. పైగా ఆయనకంటే మంచి అర్హతలు, అనుభవం ఉన్న వారు ఉన్నారని అంటున్నారు. ఎంపీ సిఫారసు చేసిన వ్యక్తికి చెందిన ఆర్టికల్స్ ఒక్కటంటే ఒక్క జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురణకు నోచుకోలేదని సమాచారం. అయినప్పటికీ మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పాలకమండలి(ఈసీ) సమావేశంలో ఈ వ్యక్తికే పోస్టు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఆరోపణలు అవాస్తవం
యూనివర్సిటీలో మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించాం. అందులో అర్హులైన వారినే ఎంపిక చేశాం. అధికారపార్టీ నుంచి ఒత్తిళ్లు లేవు. నా హయాంలో అలాంటివి జరిగే అవకాశం లేదు. ఎంపికైన వారికి త్వరలో ఆదేశాలు పంపిస్తాం.
– నరసింహులు, వీసీ, ఆర్‌యూ