fundamentals
-
ద్రవ్యోల్బణం మార్కెట్‌కా, మందికా?
ఒకప్పుడు ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రామిక సరుకు ఉత్పత్తి, సేవారంగాలు ఆర్థిక వ్యవస్థలో పైచేయిలో ఉండేవి. కానీ 1980ల అనంతరం, ఈ రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్ రంగానిది పైచేయి అయింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. దీంతో ఎటువంటి ఉత్పత్తి లేకుండా డబ్బును మరింత డబ్బుగా మార్చే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల హవా పెరిగింది. ఈ నేపథ్యంలో, షేర్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అయింది. పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది. కొద్ది రోజుల క్రితం, అమెరికాలో నెలవారీ ఉపాధి కల్పన గణాంకాలు ఊహించిన దాని కంటే మెరుగైనవిగా వెలువడ్డాయి. కానీ ఈ వార్త అమెరికా షేర్ మార్కెట్ సూచీలలో పతనానికి కారణమైంది. నిజానికి, మార్కెట్ విశ్లేషకులు చెప్పే ఫండమెంటల్స్ బాగుంటే, అది షేర్ మార్కెట్ సూచీలలో పెరుగుదలకు కారణం కావాలి. పైన జరిగింది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. ఇక్కడ ఉపాధి కల్పన గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంటే, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, ప్రజల కొనుగోలు శక్తి బాగున్నాయన్నమాట. ఇదే, వాస్తవంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలిక అంశాలు లేదా ఫండమెంటల్స్ బాగుండటం అంటే. ఇది, స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. ఈ స్థూల ఆర్థిక వ్యవస్థ బాగున్నదంటే దానిలో అంతర్భాగమైన వివిధ రంగాలకు చెందిన సంస్థలూ, పరిశ్రమలూ, ఇతరత్రా వ్యాపారాల ఫండమెంటల్స్ కూడా బాగున్నట్లే. మరి అటువంటప్పుడు అమెరికా షేర్మార్కెట్లు ఎందుకు పతనం అయినట్లు? ఇక్కడ గమనించవలసింది 1980ల అనంతరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మౌలికంగా జరిగిన మార్పులను. ఈ మార్పులు, మనం పైన చెçప్పుకున్న ఫండమెంటల్స్‌కు భిన్నమైన వాతావరణాన్ని తెచ్చి పెట్టాయి. ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రా మిక సరుకు ఉత్పత్తి, సేవారంగాల (నిజ ఆర్థిక వ్యవస్థగా పిలవ బడేవి) కంటే... అటువంటి రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్ రంగానిది పైచేయి అయింది. నిజ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ విధంగా సమతూకం మారింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. ఈ క్రమంలోనే, ఎటువంటి ఉత్పత్తి లేకుండానే కేవలం డబ్బును మరింత డబ్బుగా మార్చివేసే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటి సట్టా వ్యాపార రంగాలది పైచేయి అయ్యింది. ఇటువంటి పరిస్థితిలో, షేర్ మార్కెట్‌కు సంబంధించి కూడా ఫండమెంటల్స్ ఏవి అన్నది పూర్తిగా మారిపోయింది. ఈ కారణం చేతనే అమెరికాలో అంచనా కంటే మెరుగ్గా ఉన్న ఉపాధి గణాంకాలు మార్కెట్ల పతనానికి కారణం అయ్యాయి. అయితే, ఈ సరికొత్త ఫైనాన్స్ రంగ ఫండమెంటల్స్ తాలూకు ఏ పనితీరు ఈ మార్కెట్ల పతనానికి దారితీసింది అన్నది ఇక్కడి ప్రశ్న. షేర్ మార్కెట్ల వంటి ఈ ఫైనాన్స్ రంగాలలో, మదుపుదారులు పెట్టిన పెట్టుబడి విలువను కాపాడుకోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ షేర్ మార్కెట్లలో కొంత మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టినప్పుడు, అది దాని నుంచి లాభాలను ఆశిస్తుంది. లాభాల సంగతి కాసేపు పక్కన పెట్టినా, కనీసం తను పెట్టిన పెట్టుబడి తాలూకు విలువను కాపాడుకోవాలని కోరుకుంటుంది. దీనికోసం మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలి. అది తీవ్ర ఒడుదుడుకులకు లోనవ్వడం లేదా క్షీణించడం జరగకూడదు. ఇది, షేర్మార్కెట్ల పెట్టుబడుల తాలూకు ప్రధాన అవసరం. మరి ఇక్కడ కరెన్సీల విలువల పతనానికి కారణంగా లేదా దాని వ్యక్తీకరణగా ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. ఒక కరెన్సీ విలువ తగ్గినప్పుడే, దాని కొనుగోలు శక్తి తగ్గుతుంది. కరెన్సీ తాలూకు ఈ కొనుగోలు శక్తి తగ్గుదలనే ద్రవ్యోల్బణం అంటాం. ఈ నేపథ్యంలోనే, షేర్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు గానూ ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అవసరంగా మారింది. ఫలితంగానే, ఫైనాన్స్ పెట్టుబడుల ఆధిపత్యం పెరిగిన 1980ల అనంతరం, అంటే సుమారుగా 1990ల నుంచీ ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులూ ద్రవ్యోల్బణం అదుపును తమ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. ఉదాహరణకు మన రిజర్వ్ బ్యాంకుకు ఈ ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యం, రెండు శాతం అటూ ఇటుగా నాలుగు శాతంగా నిర్ణయించబడింది. అంటే, మన దేశీయ రిజర్వ్ బ్యాంక్, దేశంలో ద్రవ్యోల్బణాన్ని 26 శాతం నడుమన నియంత్రించి ఉంచాలి. అలా అయితేనే భారత షేర్ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడుల విలువకు కాస్త భరోసా ఉంటుంది. ఇక్కడ మరో ఉదాహరణగా అమెరికా నుంచి భారతదేశ షేర్ మార్కెట్లలోకి ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థ డాలర్లను పెట్టుబడిగా తెచ్చింది అనుకుందాం. ఆ సంస్థ డాలర్లను నేరుగా పెట్టుబడిగా పెట్టలేదు. దానికోసం కరెన్సీని రూపాయలలోకి మార్చుకుంటుంది. ఇక, ఆ సంస్థకు కీలక ప్రాధాన్యత గల అంశంగా రూపాయి విలువ కాపాడబడటం అనేది ఉంటుంది. ఆ విదేశీ మదుపు సంస్థ, తన షేర్ మార్కెట్ పెట్టుబడులను అమ్ముకుని దేశం నుంచి మరోచోటకి వెళ్ళిపోయే నాటికి రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోయి ఉంటే అది పెట్టుబడి + లాభాల విలువ తగ్గుదలకు కారణం అవుతుంది. మార్కెట్లో తన పెట్టుబడులను అమ్మివేసినప్పుడు ఆ మదుపు దారుడికి రూపాయల్లో డబ్బు వస్తుంది. తిరిగివెళ్ళిపోయే క్రమంలో రూపాయలను వేరే దేశంలోకి తీసుకుని వెళ్ళలేడు గనుక తిరిగి ఆ మదుపుదారుడు తనకు లభించిన రూపాయలను డాలర్లుగా మార్చుకుంటాడు. ఇక్కడ అతను పెట్టుబడి పెట్టేనాటికీ, వాటిని అమ్ముకుని వెనక్కు వెళ్ళేనాటికీ మధ్యన రూపాయి విలువ తగ్గితే, అతనికి ఈ రూపాయలను తిరిగి డాలర్లుగా మార్చుకుంటే, లభించే డాలర్ల మొత్తం కూడా తక్కువగానే వుంటుంది. ఈ మొత్తం పరిస్థితిని మదింపు చేసుకోవడం కోసమే మన దేశంలోకి లేదా ఇతరేతర దేశాలలోకి కూడా పెట్టుబడులను తీసుకువెళ్ళే మదుపుదారులు వాటిపై లభించే లాభాలను అటు, ఆ దేశం తాలూకు కరెన్సీలతో పాటుగా, మరొక కొలబద్ద అయిన డాలెక్స్ (డాలర్లలో లభించిన లాభం ) రూపంలో కూడా లెక్కించుకుంటారు. అదీ కథ! కాబట్టి, నేటి ఫైనాన్స్ యుగంలో ఫండమెంటల్స్ అనేవాటి అర్థం మారిపోయింది. నేడు ఫండమెంటల్స్‌గా పరిగణించబడుతున్నవి ప్రధానంగా ఫైనాన్స్ పెట్టుబడుల కొలబద్ద అయిన ద్రవ్యోల్బణం సూచీలు. ఈ కారణం చేతనే, అమెరికాలో ఉపాధి కల్పన బాగా జరిగిన క్రమంలో షేర్ మార్కెట్లు దిగజారాయి. ఇక్కడ, మరో చిన్న విషయం... ఈ మార్కెట్లు ఆ రోజు మధ్యాహ్నానికి తిరిగి కాస్త కోలు కున్నాయి. దీనికి కారణం, ఈ మెరుగైన ఉపాధి గణాంకం అనేది, వేతనాల పెరుగుదల రూపంలో పెద్దగా ప్రభావం చూపలేదు. అంటే, ఉపాధి మెరుగ్గానే కనబడిందిగానీ... దాని వలన వేతనాల మొత్తం పెరిగిపోయి అది మార్కెట్లో పెరిగిన ప్రజల కొనుగోలు శక్తీ లేదా డిమాండ్ రూపంలో ప్రభావం చూపగలిగిందిగా లేదన్నమాట. ఈ వాస్తవాన్ని మధ్యాహ్నానికి గ్రహించిన అమెరికా మార్కెట్ సూచీలు తిరిగి మళ్ళీ పుంజుకున్నాయి. ప్రజల కొనుగోలుశక్తీ, లేదా డిమాండ్ పెరగకుంటే మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగదనే సూక్ష్మమే దీనికి కారణం. 1980ల ముందరినాటి కాలం ఫండమెంటల్స్ వేరుగా ఉన్నాయి. అవి, ఒక కంపెనీ తాలూకు బ్యాలెన్స్ షీట్, అలాగే స్థూలంగా నిజ ఆర్థిక వ్యవస్థ తాలూకు బలంపై ఆధారపడి వున్నాయి. కానీ నేడు అది పూర్తిగా నిజంకాదు. ద్రవ్యోల్బణం, దాని కట్టడి అనేవి నేడు మార్కెట్లో ప్రధాన అంశంగా మారింది. కాబట్టి నేడు వివిధ దేశాలలో పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది. వినాశ కాలే విపరీత బుద్ధి... ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
పటిష్టంగా ఎకానమీ పునాదులు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వాస్తవ జీడీపీ గణాంకాలు.. కరోనా పూర్వ స్థాయిని అధిగమించడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కోవిడ్–19 మహమ్మారి సమస్యను సాధ్యమైన వేగంగా, నిర్మయాత్మకంగా దేశం అధిగమించాలని పనగారియా పేర్కొన్నారు. దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికే పుంజుకున్నాయని ఆయన వివరించారు. మరోవైపు, సంపన్న దేశాలు అమలు చేస్తున్న ఉపశమన ప్యాకేజీల (క్యూఈ) వల్లే భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. భారత్‌లోకి పెట్టుబడులకు క్యూఈతో పాటు అనేక కారణాలు ఉన్నాయన్నారు. ‘క్యూఈ అనేది సంపన్న దేశాల నుంచి ఇతర దేశాలకు పెట్టుబడులు మరలడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నిధులన్నీ ఇతర వర్ధమాన మార్కెట్లలోకి కాకుండా మొత్తం భారత్‌లోకే వస్తాయన్న హామీ లేదు. అత్యధికంగా రాబడులు వస్తాయన్న భరోసా కారణంగానే ఇన్వెస్టర్లు భారత్‌ను ఎంచుకుంటున్నారు‘ అని పనగారియా చెప్పారు. సంపన్న దేశాలు క్రమంగా ప్యాకేజీలను ఉపసంహరించే కొద్దీ పెట్టుబడుల్లో కొంత మొత్తం వెనక్కి వెళ్లడం సాధారణమేనన్నారు. అయితే, ఆయా సంపన్న దేశాల్లో వచ్చే రాబడులకన్నా ఎంత అధికంగా అందించగలదన్న అంశంపైనే భారత్‌లో పెట్టుబడుల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని పనగారియా చెప్పారు. హేతుబద్ధంగానే స్టాక్ మార్కెట్ల తీరు .. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేనట్లుగా ఆర్థిక వృద్ధి మందగించిన తరుణంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిపోతుండటం అసాధారణమేమీ కాకపోవచ్చని పనగారియా చెప్పారు. భవిష్యత్ రాబడుల అంచనాలపైనే స్టాక్ మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో షేర్ల రేట్ల విషయంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు హేతుబద్ధంగానే వ్యవహరిస్తున్నారని భావించవచ్చన్నారు. -
ఫండమెంటల్స్ పరుగు పెట్టిస్తాయ్
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను లిక్విడిటీ లీడ్ చేస్తున్నట్లు సుందరం మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఐవో ఎస్ కృష్ణకుమార్ పేర్కొంటున్నారు. అయితే రానున్న 6-12 నెలల కాలంలో ఫండమెంటల్స్ వెలుగులోకిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. తద్వారా భవిష్యత్‌లో లిక్విడిటీ ఆవిరైనప్పటికీ మార్కెట్లను ఫండమెంటల్స్ పరుగు పెట్టిస్తాయని చెబుతున్నారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు, వినియోగ డిమాండ్ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. కేంద్ర బ్యాంకులు ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత, భారీ ప్యాకేజీల కారణంగా లిక్విడిటీ పెరిగింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పరుగు తీస్తున్నాయి. అయితే ఇటీవల చైనాసహా యూఎస్, యూరోపియన్ దేశాలలో పరిస్థితులు కుదుటపడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెల రోజులుగా దేశీయంగానూ కార్పొరేట్, తదితర రంగాలలో యాక్టివిటీ పెరిగింది. ఎన్బీఎఫ్సీ, బ్యాంకుల వసూళ్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో నమోదవుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా డీలర్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలతోసహా దేశీయంగానూ ఇదే ధోరణి కనిపిస్తోంది. అయితే కోవిడ్ తలెత్తకముందున్న పరిస్థితులు నెలకొనేందుకు 6 నెలల నుంచి ఏడాది కాలం పట్టవచ్చు. వెరసి మార్కెట్లు పూర్తిగా లిక్విడిటీ ఆధారితంగానే బలపడటం లేదని చెప్పవచ్చు. మెరుగుపడుతున్న ఫండమెంటల్స్ సైతం ప్రభావం చూపుతున్నాయి. ఇందువల్లనే మార్చిలో నమోదైన పతనంనుంచి మార్కెట్లు తిరిగి కోలుకున్నాయ్. ఆర్థిక వ్యవస్థలు బలపడితే.. ఫెడ్, ఈసీబీ, బీవోజే తదితర కేంద్ర బ్యాంకులు లిక్విడిటీని కఠినతరం చేస్తాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఫండమెంటల్స్ మాత్రమే మార్కెట్లను ఆదుకోగలవు. అయితే ప్రస్తుత స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఆటుపోట్లు, దిద్దుబాట్ల మధ్య మార్కెట్లు నెమ్మదిగా రికవరీ సాధించే వీలుంది. టూ వీలర్స్ ఇటీవల గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ బలపడుతోంది. వ్యవసాయ రంగ ఆదాయాలు పెరుగుతున్నాయ్. ప్రభుత్వం నుంచి లభిస్తున్న తోడ్పాటు సైతం ఇందుకు సహకరిస్తోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచనాలు వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నాయి. పంటల విస్తీర్ణం, దిగుబడులు పెరగడం ద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పుంజుకునే అవకాశముంది. దీంతో గ్రామ ప్రాంతాలలో వినియోగం ఊపందుకోనుంది. ఇది సమీప కాలంలో పారిశ్రామిక రంగానికి ఊతమివ్వవచ్చు. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, అప్లయెన్సెస్, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు వంటి విభాగాలలో డిమాండ్ ఏర్పడుతుంది. ఇక మరోపక్క ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ రంగాలు వెలుగులో నిలవనున్నాయి. సరఫరాల కోసం విదేశాల నుంచి భారీ కాంట్రాక్టులు లభించే వీలుంది. టెలికం ఏడాది కాలంగా టెలికం పరిశ్రమలో జరిగిన కన్సాలిడేషన్ కంపెనీలకు మేలు చేయగలదు. టెలికం పరిశ్రమకు మద్దతివ్వడం ద్వారా ప్రభుత్వం బ్యాంకుల రుణ వసూళ్లకు మరింత చేయూతనిచ్చే వీలుంది. అంతేకాకుండా కొద్ది రోజులుగా ఆదాయాలు, ఏఆర్పీయూలు మెరుగుపడటం వంటి అంశాలు పరిశ్రమకు చేయూతనివ్వనున్నాయి. ఇటీవల విదేశీ సంస్థలు దేశీ కంపెనీలలో పెట్టుబడులకు క్యూకట్టడం ద్వారా టెలికంతోపాటు.. సోషల్ కనెక్ట్, పేమెంట్స్ వ్యవస్థ, ఈకామర్స్ తదితర విభాగాల నుంచీ లబ్ది పొందాలని చూస్తున్నాయి. గ్రోసరీస్, అపారెల్స్, ఫుట్‌వేర్ తదితర పలు రిటైల్ అమ్మకాలపైనా కన్నేశాయి. వెరసి జియో బాటలో టెలికం కంపెనీలు డిజిటల్ బాటలో మరింత పెద్ద అడుగులు వేసే అవకాశముంది. -
ఆర్‌యూలో పోస్టుల గోల
– సిఫారసు చేస్తున్న అధికార పార్టీ ఎంపీ – నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ(ఆర్యూ)లో పోస్టుల భర్తీ వ్యవహారం మరోసారి విమర్శలకు తావిస్తోంది. అర్హులను కాదని అధికార పార్టీ సిఫారసు చేసిన వ్యక్తులకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు అర్హత లేనప్పటికీ అధికార పార్టీ నేత సిఫారసు పేరుతో రిజిస్ట్రార్ పోస్టును కట్టబెటారనే ఆరోపణలు సమసిపోకముందే.. అసిస్టెంట్ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టుల భర్తీలోనూ ఇదే రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎంపీ సిఫారసు చేసిన వ్యక్తికే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు దక్కినట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని వర్సిటీ వర్గాలు కూడా ధ్రువీకరించడం ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వర్సిటీ వారికి ఇవ్వకుండా.. వాస్తవానికి రాయలసీమ యూనివర్సిటీలో అర్హులైన అనేక మంది అధ్యాపకులు ఉన్నారు. వీరికి పదోన్నతి ద్వారా ఆయా పోస్టులను కట్టబెట్టేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ పొరుగింటి పుల్లకూర రుచి అనే చందంగా బయటి వ్యక్తులను తీసుకోవడంపై వర్సిటీలోని అధ్యాపక సిబ్బందిలోనూ నిరాసక్తి వ్యక్తమవుతోంది. తమను కాదని అధికార పార్టీ చెప్పిన వారికి అందలం ఎక్కించేందుకు పోస్టుల భర్తీ చేపట్టడం సరికాదని వాపోతున్నారు. వాస్తవానికి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌తో పాటు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 28వ తేదీన నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్టుకు ఒక పేరును సిఫారసు చేసినట్టు తెలిసింది. అయితే, సదరు వ్యక్తికి నిబంధనలకు మేరకు సరిౖయెన అర్హతలు లేవని.. పైగా ఆయనకంటే మంచి అర్హతలు, అనుభవం ఉన్న వారు ఉన్నారని అంటున్నారు. ఎంపీ సిఫారసు చేసిన వ్యక్తికి చెందిన ఆర్టికల్స్ ఒక్కటంటే ఒక్క జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురణకు నోచుకోలేదని సమాచారం. అయినప్పటికీ మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పాలకమండలి(ఈసీ) సమావేశంలో ఈ వ్యక్తికే పోస్టు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆరోపణలు అవాస్తవం యూనివర్సిటీలో మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించాం. అందులో అర్హులైన వారినే ఎంపిక చేశాం. అధికారపార్టీ నుంచి ఒత్తిళ్లు లేవు. నా హయాంలో అలాంటివి జరిగే అవకాశం లేదు. ఎంపికైన వారికి త్వరలో ఆదేశాలు పంపిస్తాం. – నరసింహులు, వీసీ, ఆర్యూ