ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను లిక్విడిటీ లీడ్ చేస్తున్నట్లు సుందరం మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఐవో ఎస్ కృష్ణకుమార్ పేర్కొంటున్నారు. అయితే రానున్న 6-12 నెలల కాలంలో ఫండమెంటల్స్ వెలుగులోకిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. తద్వారా భవిష్యత్‌లో లిక్విడిటీ ఆవిరైనప్పటికీ మార్కెట్లను ఫండమెంటల్స్ పరుగు పెట్టిస్తాయని చెబుతున్నారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు, వినియోగ డిమాండ్ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..
కేంద్ర బ్యాంకులు
ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత, భారీ ప్యాకేజీల కారణంగా లిక్విడిటీ పెరిగింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పరుగు తీస్తున్నాయి. అయితే ఇటీవల చైనాసహా యూఎస్, యూరోపియన్ దేశాలలో పరిస్థితులు కుదుటపడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెల రోజులుగా దేశీయంగానూ కార్పొరేట్, తదితర రంగాలలో యాక్టివిటీ పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకుల వసూళ్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో నమోదవుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా డీలర్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలతోసహా దేశీయంగానూ ఇదే ధోరణి కనిపిస్తోంది. అయితే కోవిడ్ తలెత్తకముందున్న పరిస్థితులు నెలకొనేందుకు 6 నెలల నుంచి ఏడాది కాలం పట్టవచ్చు. వెరసి మార్కెట్లు పూర్తిగా లిక్విడిటీ ఆధారితంగానే బలపడటం లేదని చెప్పవచ్చు. మెరుగుపడుతున్న ఫండమెంటల్స్ సైతం ప్రభావం చూపుతున్నాయి. ఇందువల్లనే మార్చిలో నమోదైన పతనంనుంచి మార్కెట్లు తిరిగి కోలుకున్నాయ్. ఆర్థిక వ్యవస్థలు బలపడితే.. ఫెడ్, ఈసీబీ, బీవోజే తదితర కేంద్ర బ్యాంకులు లిక్విడిటీని కఠినతరం చేస్తాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఫండమెంటల్స్ మాత్రమే మార్కెట్లను ఆదుకోగలవు. అయితే ప్రస్తుత స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఆటుపోట్లు, దిద్దుబాట్ల మధ్య మార్కెట్లు నెమ్మదిగా రికవరీ సాధించే వీలుంది.
టూ వీలర్స్
ఇటీవల గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ బలపడుతోంది. వ్యవసాయ రంగ ఆదాయాలు పెరుగుతున్నాయ్. ప్రభుత్వం నుంచి లభిస్తున్న తోడ్పాటు సైతం ఇందుకు సహకరిస్తోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచనాలు వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నాయి. పంటల విస్తీర్ణం, దిగుబడులు పెరగడం ద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పుంజుకునే అవకాశముంది. దీంతో గ్రామ ప్రాంతాలలో వినియోగం ఊపందుకోనుంది. ఇది సమీప కాలంలో పారిశ్రామిక రంగానికి ఊతమివ్వవచ్చు. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, అప్లయెన్సెస్, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు వంటి విభాగాలలో డిమాండ్ ఏర్పడుతుంది. ఇక మరోపక్క ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ రంగాలు వెలుగులో నిలవనున్నాయి. సరఫరాల కోసం విదేశాల నుంచి భారీ కాంట్రాక్టులు లభించే వీలుంది.
టెలికం
ఏడాది కాలంగా టెలికం పరిశ్రమలో జరిగిన కన్సాలిడేషన్ కంపెనీలకు మేలు చేయగలదు. టెలికం పరిశ్రమకు మద్దతివ్వడం ద్వారా ప్రభుత్వం బ్యాంకుల రుణ వసూళ్లకు మరింత చేయూతనిచ్చే వీలుంది. అంతేకాకుండా కొద్ది రోజులుగా ఆదాయాలు, ఏఆర్‌పీయూలు మెరుగుపడటం వంటి అంశాలు పరిశ్రమకు చేయూతనివ్వనున్నాయి. ఇటీవల విదేశీ సంస్థలు దేశీ కంపెనీలలో పెట్టుబడులకు క్యూకట్టడం ద్వారా టెలికంతోపాటు.. సోషల్ కనెక్ట్, పేమెంట్స్ వ్యవస్థ, ఈకామర్స్ తదితర విభాగాల నుంచీ లబ్ది పొందాలని చూస్తున్నాయి. గ్రోసరీస్, అపారెల్స్, ఫుట్‌వేర్ తదితర పలు రిటైల్ అమ్మకాలపైనా కన్నేశాయి. వెరసి జియో బాటలో టెలికం కంపెనీలు డిజిటల్ బాటలో మరింత పెద్ద అడుగులు వేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment