ఉర్దూ యూనివర్సిటీ కోసం నిధులను విడుదల చేయని ప్రభుత్వం
– ఆర్‌యూ నిధులతో పనులు చేయిస్తున్న అధికారులు
– 16న మంత్రిం గంటాతో ప్రారంభోత్సవం
– ఆడ్మిషన్లపై ఆసక్తి చూపని విద్యార్థులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవంపై ప్రచార ఆర్భాటం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూనివర్సిటీ కోసం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. మరోవైపు ఈ నెల 16న యూనివర్సిటీని తాత్కాలికంగా ఉస్మానియా డిగ్రీ కళాశాలలో ప్రారంభిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మెంటర్ వర్సిటీగా ఉన్న రాయలసీమ యూనివర్సిటీ నిధులను అధికారులు ఖర్చు చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్‌యూ నిధుల మళ్లీంపు..
కొత్తగా ఏర్పాటు కానున్న ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌గా ఆర్‌యూ వీసీ వై.నరసింహులును ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రభుత్వం అనుమతితో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ఆర్‌యూ రిజిస్ట్రార్ అమర్‌నాథ్‌కు బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. ఉస్మానియా కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు కానున్న ఉర్దూ యూనివర్సిటీ కోసం ఆయన రూ.10 లక్షలను ఆర్‌యూ నిధుల నుంచి కేటాయించారు. వాటితో 35 కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, భవనాలకు పెయింటింగ్ వేయించారు. ఆ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
రూ.1.70 కోట్ల కోసం రెండునెలలుగాఎదురుచూపు
మరోవైపు ఉర్దూ యూనివర్సిటీని తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఖర్చుల కోసం రూ.1.70 కోట్లను కేటాయించాలని రెండు నెలల క్రితమే ఇన్‌చార్జి వీసీ వై.నరసింహులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిధులు కూడా రాలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అధికారులు ఆర్‌యూ నిధులను మళ్లీంచి పనులు జరిపిస్తున్నారు.
హడావుడిగా వర్సిటీలో ప్రవేశాలకు ప్రకటన
కర్నూలులోని ఉర్దూ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించాలని తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావించారు. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ప్రభుత్వం నుంచి వర్సిటీ ప్రారంభోత్సవానికి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే కర్నూలు నగర మున్సిపల్ ఎన్నికలను దష్టిలో ఉంచుకొని ఇక్కడి నాయకులు మైనార్టీ ఓటర్ల కోసం సీఎంపై ఒత్తిడి తెచ్చి వర్సిటీ ప్రారంభోత్సవంపై జూన్‌లో ప్రభుత్వం నుంచి ప్రకటన చేయించారు. చాలా ఆలస్యంగా ప్రకటన జారీ కావడంతో ఉర్దూ వర్సిటీలో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు అప్పటికే ఇతర వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం ఉర్దూవర్సిటీలో బీఏ కోర్సుకు 20, బీఎస్సీ కోసం 9 మంది, ఎంఏ ఇంగ్లిషు 25. ఎంఏ ఉర్దూ కోసం 28 మంది, ఎంకామ్‌కు ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు.
వర్సిటీ ప్రారంభోత్సవానికి రానున్న మంత్రి గంటా
ఉర్దూ యూనివర్సిటీని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతో ఈ నెల 16న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఉస్మానియా కళాశాలలో వర్సిటీ కోసం కేటాయించిన భవనాలకు సున్నం వేయిస్తున్నారు. వర్సిటీకి అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నారు.
రూ.10 లక్షల ఆర్‌యూ నిధులను కేటాయించాం– అమర్‌నాథ్, రిజిస్ట్రార్
ఉర్దూ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం ఒక్క రూపాయిని విడుదల చేయలేదు. దీంతో రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన రూ.10 లక్షలతో అక్కడ తాత్కాలికంగా అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నాం. నేడో..రేపో ప్రభుత్వం నుంచి ఉర్దూ యూనివర్సిటీ కోసం 1.70 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆర్‌యూ నిధులను వెనక్కి తీసుకుంటాం.