పొరపాటు.. గ్రహపాటు
పొరపాటు.. గ్రహపాటు
Published Sat, Feb 18 2017 12:10 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
గందరగోళంలో ఎంపీఈడీ కోర్సు విద్యార్థులు
- ఫీజు నిర్ణయంలో తప్పులో కాలేసిన ఆర్‌యూ అధికారులు
- వర్సిటీ నిర్ణయించిన ఫీజు రూ.21,735
- యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్న మొత్తం రూ.95వేలు
- కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థుల వాగ్వాదం
- ఆశలు వదులుకున్న 28 మంది విద్యార్థులు
కర్నూలు(ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీ(ఆర్‌యూ) పరిధిలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఎంపీఈడీ కోర్సు ఫీజు విషయంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. ఇదే సమయంలో ప్రైవేటు కాలేజీల ధన దాహంతో కోర్సులో చేరేందుకు విద్యార్థులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో రెండు కాలేజీలకు ఎంపీఈడీ కోర్సుకు అనుమతినిచ్చారు. శుక్రవారం ఆర్‌యూలో ఎంపీఈడీ కోర్సుకు చివరి కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం సీట్లు 120 కాగా.. అదనంగా 20 శాతం మేనేజ్‌మెంట్ కోటాగా నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వర్సిటీ నిర్ణయించిన మేరకు ఓసీలు రూ.21,735, రిజర్వేషన్ అభ్యర్థులు రూ.1,735ల ఫీజు చెల్లించారు. వాస్తవానికి కోర్సు ఫీజు రూ.59 వేలు కాగా.. ఆర్‌యూ అధికారులు పొరపాటున రూ.21,735లుగా ప్రకటించారు. తీరా ఇప్పుడు విద్యార్థులు కోర్సులో చేరిన తర్వాత.. తాము తప్పుగా ఫీజు నిర్ణయించామని చెప్పడం వివాదాస్పదమవుతోంది. పైగా ఇదే ఫీజుకే ప్రయివేట్ కాలేజీలు అడ్మిషన్లు ఇవ్వాలని ఆర్‌యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేట్ కాలేజీల యాజమాన్యం కూడా మరో తిరకాసు పెట్టింది. తమకు వర్సిటీ నిర్ణయించిన రూ.21,735 ఫీజు ఏమాత్రం సరిపోదని.. కళాశాలల్లో చదవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్‌లోనే ఉండాలనే నిబంధన విధించారు. ఇందుకోసం సంవత్సరానికి అదనంగా రూ.45వేలు చెల్లించాలని తేల్చారు. అంటే కళాశాల ఫీజుతో పాటు సెమిస్టర్‌కు రూ.2వేలు చొప్పున 4 సెమిస్టర్లకు రూ.8వేల పరీక్ష ఫీజు.. యూడీఎఫ్ రూ.5వేలు, డ్రెస్‌కు రూ.10వేలు, స్పోర్ట్్స కిట్‌కు రూ.2,500, రికార్డు ఫీజు రూ.2వేల ప్రకారం ప్రతి సంవత్సరానికి రూ.95వేల ప్రకారం రెండేళ్లకు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈవిధంగా కడతామంటే అడ్మిషన్ ఇస్తామని.. లేదంటే సీటు క్యాన్సల్ చేసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 28 మంది విద్యార్థులు ఎంపీఈడీ కోర్సు మానుకోవాల్సి వచ్చింది.
ఫీజు నిర్ణయంలో ఆర్‌యూ అధికారుల పొరపాటు
రాష్ట్రంలోని వెంకటేశ్వర, ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు అఫిలియేట్ కళాశాలల్లో ఎంపీఈడీ కోర్సు ఫీజు రూ.34,540, వర్సిటీ ప్రాంగణాల్లో రూ.4,950లుగా ఉంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలల్లో రూ.59 వేలుగా ఉంది. అయితే ఆర్‌యూ అధికారులు ఎస్కేయూను అనుసరించామని చెబుతున్నప్పటికీ.. అదీ చేయకుండా గత 15 రోజుల క్రితం పత్రికా ప్రకటనలో కన్వీనర్ కోటాలో రూ.29 వేలు ప్రకటించారు. మళ్లీ పెద్ద మనసుతో దాన్ని కాస్తా ఓసీలకు రూ.21,735లు చేస్తూ.. రిజర్వేషన్ అభ్యర్థులు కేవలం రూ.1,735 చెల్లించాలని విద్యార్థులకు పోస్టు చేశారు. దీంతో మెరిట్ మీద ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో వర్సిటీ తెలిపిన ఫీజును చెల్లించారు. అయితే యాజమాన్యాలు మొండికేయడంతో విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారింది.
ఇది ప్రైవేటు కళాశాలల మోసం : యు.మల్లేష్
నేను మొదటి ర్యాంకర్‌ను. వర్సిటీ నిర్ణయించిన ఫీజు చెల్లించా. కానీ కళాశాల యాజమాన్యం సంవత్సరానికి రూ.95 వేలు కడితేనే అడ్మిషన్ ఇస్తాం.. లేకుంటే వెళ్లిపోవచ్చంటున్నారు. మరి మా భవిష్యత్ ఏమిటి?
ఫీజు గురించి ముందే చెప్పాల్సింది.. : ఆయేషా
వర్సిటీ పాలకులు ఎంత ఫీజు చెల్లించాలో ముందే చెప్పారు. లెటర్ పంపారు. పత్రికల్లో ప్రకటించారు. మరి ఇక్కడికి వచ్చాక రూ.21 వేల నుంచి రూ.95 వేలకు పెంచి కట్టమంటున్నారు. అదెలా?
ఈ సంవత్సరానికి ఇంతే ఫీజు : బి.అమర్‌నాథ్, రిజిస్ట్రార్
ఎంపీఈడీ ఫీజు నిర్ణయించడంలో మా అధికారుల వైఫల్యం ఉంది. కన్వీనర్ కోటా రూ.59 వేలుగా నిర్ణయించినా.. పొరపాటున రూ.21,735లుగా ప్రకటించారు. వాస్తవానికి కళాశాలలకు తీవ్రమైన నష్టం వస్తుంది. అయితే ఈ సంవత్సరం వరకు మాత్రం రూ.21,735 మాత్రమే కాలేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజుకే ఈ ఏడాది అడ్మిషన్లు ఇవ్వాలి. అయితే, వచ్చే ఏడాది ఎంత ఫీజు అనే అంశంపై ఒక కమిటీ వేస్తాం. ఫీజు వివరాలను త్వరలో విడుదల చేయబోయే ఆర్‌యూ పీజీ సెట్ నోటిఫికేషన్‌లో పేర్కొంటాం.
Advertisement