mped
-
విశ్వవిద్యాలయం.. వేదనాలయం
అనంతపురం, ఎస్కేయూ: ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని విశ్వవిద్యాలయంలో చేరితే తరగతులే నిర్వహించకుండా వేదనకు గురి చేస్తారా అంటూ ఎంపీఈడీ విద్యార్థులు ఆగ్రహించారు. వర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలో ఎంపీఈడీ కోర్సులో చేరిన విద్యార్థులకు తరగతులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. క్లాసులు ప్రారంభించాలని విద్యార్థులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు, ఫిర్యాదుల ద్వారా అందజేశారు. అవన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. నెల రోజులైనా అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల్లో ఓపిక నశించింది. అధికారుల నిర్లక్ష్యంపై కన్నెర్రజేశారు. బుధవారం ఉదయం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. ఇన్చార్జ్ వీసీ వాహనం అడ్డగింత అదే సమయంలో క్యాంపస్‌లోకి వెళుతున్న ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ వాహనాన్ని అడ్డుకున్నారు. గంట పాటు వాహనాన్ని ముందుకు కదలనీయకుండా ఆపేశారు. దీంతో ఇన్చార్జ్ వీసీ స్పందిస్తూ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీసీ వెళ్లిన అనంతరం రిజిస్ట్రార్ వాహనం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్‌బాబు వాహనం దిగి ధర్నా చేస్తున్న ఎంపీఈడీ విద్యార్థుల వద్దకు చేరుకుని గేటు దాటి ముందుకు వెళుతున్న క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సస్పెన్షన్ పేరుతో భయపెడతారా? తరగతులు నిర్వహించండని కోరడానికి మీ చాంబర్‌కు వస్తే సస్పెండ్ చేస్తామంటూ భయపెడతారా.. ఎంతమందిని సస్పెండ్ చేస్తారో చేసుకోండి అంటూ ఎంపీఈడీ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రిజిస్ట్రార్ కె.సుధాకర్‌బాబును సూటిగా ప్రశ్నించారు. దీంతో ప్రాక్టికల్ తరగతులు ఒక ఫ్యాకల్టీకి, థియరీ తరగతులను మరొక ఫ్యాకల్టీకి అప్పగిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు. ఎంపీఈడీ విద్యార్థుల ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, అంకే శ్రీనివాస్, హేమంత్‌కుమార్, రాధాకృష్ణ, భానుప్రకాష్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకుడు శ్రీధర్‌గౌడ్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఈడీ విద్యార్థి నాయకులు పక్కీరప్ప, సునీల్, నరేంద్ర పాల్గొన్నారు. -
పొరపాటు.. గ్రహపాటు
గందరగోళంలో ఎంపీఈడీ కోర్సు విద్యార్థులు - ఫీజు నిర్ణయంలో తప్పులో కాలేసిన ఆర్యూ అధికారులు - వర్సిటీ నిర్ణయించిన ఫీజు రూ.21,735 - యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్న మొత్తం రూ.95వేలు - కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థుల వాగ్వాదం - ఆశలు వదులుకున్న 28 మంది విద్యార్థులు కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ(ఆర్యూ) పరిధిలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఎంపీఈడీ కోర్సు ఫీజు విషయంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. ఇదే సమయంలో ప్రైవేటు కాలేజీల ధన దాహంతో కోర్సులో చేరేందుకు విద్యార్థులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో రెండు కాలేజీలకు ఎంపీఈడీ కోర్సుకు అనుమతినిచ్చారు. శుక్రవారం ఆర్‌యూలో ఎంపీఈడీ కోర్సుకు చివరి కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం సీట్లు 120 కాగా.. అదనంగా 20 శాతం మేనేజ్మెంట్ కోటాగా నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వర్సిటీ నిర్ణయించిన మేరకు ఓసీలు రూ.21,735, రిజర్వేషన్ అభ్యర్థులు రూ.1,735ల ఫీజు చెల్లించారు. వాస్తవానికి కోర్సు ఫీజు రూ.59 వేలు కాగా.. ఆర్యూ అధికారులు పొరపాటున రూ.21,735లుగా ప్రకటించారు. తీరా ఇప్పుడు విద్యార్థులు కోర్సులో చేరిన తర్వాత.. తాము తప్పుగా ఫీజు నిర్ణయించామని చెప్పడం వివాదాస్పదమవుతోంది. పైగా ఇదే ఫీజుకే ప్రయివేట్ కాలేజీలు అడ్మిషన్లు ఇవ్వాలని ఆర్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేట్ కాలేజీల యాజమాన్యం కూడా మరో తిరకాసు పెట్టింది. తమకు వర్సిటీ నిర్ణయించిన రూ.21,735 ఫీజు ఏమాత్రం సరిపోదని.. కళాశాలల్లో చదవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్లోనే ఉండాలనే నిబంధన విధించారు. ఇందుకోసం సంవత్సరానికి అదనంగా రూ.45వేలు చెల్లించాలని తేల్చారు. అంటే కళాశాల ఫీజుతో పాటు సెమిస్టర్‌కు రూ.2వేలు చొప్పున 4 సెమిస్టర్లకు రూ.8వేల పరీక్ష ఫీజు.. యూడీఎఫ్ రూ.5వేలు, డ్రెస్‌కు రూ.10వేలు, స్పోర్ట్్స కిట్‌కు రూ.2,500, రికార్డు ఫీజు రూ.2వేల ప్రకారం ప్రతి సంవత్సరానికి రూ.95వేల ప్రకారం రెండేళ్లకు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈవిధంగా కడతామంటే అడ్మిషన్ ఇస్తామని.. లేదంటే సీటు క్యాన్సల్ చేసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 28 మంది విద్యార్థులు ఎంపీఈడీ కోర్సు మానుకోవాల్సి వచ్చింది. ఫీజు నిర్ణయంలో ఆర్యూ అధికారుల పొరపాటు రాష్ట్రంలోని వెంకటేశ్వర, ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు అఫిలియేట్ కళాశాలల్లో ఎంపీఈడీ కోర్సు ఫీజు రూ.34,540, వర్సిటీ ప్రాంగణాల్లో రూ.4,950లుగా ఉంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలల్లో రూ.59 వేలుగా ఉంది. అయితే ఆర్యూ అధికారులు ఎస్కేయూను అనుసరించామని చెబుతున్నప్పటికీ.. అదీ చేయకుండా గత 15 రోజుల క్రితం పత్రికా ప్రకటనలో కన్వీనర్ కోటాలో రూ.29 వేలు ప్రకటించారు. మళ్లీ పెద్ద మనసుతో దాన్ని కాస్తా ఓసీలకు రూ.21,735లు చేస్తూ.. రిజర్వేషన్ అభ్యర్థులు కేవలం రూ.1,735 చెల్లించాలని విద్యార్థులకు పోస్టు చేశారు. దీంతో మెరిట్ మీద ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో వర్సిటీ తెలిపిన ఫీజును చెల్లించారు. అయితే యాజమాన్యాలు మొండికేయడంతో విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారింది. ఇది ప్రైవేటు కళాశాలల మోసం : యు.మల్లేష్ నేను మొదటి ర్యాంకర్‌ను. వర్సిటీ నిర్ణయించిన ఫీజు చెల్లించా. కానీ కళాశాల యాజమాన్యం సంవత్సరానికి రూ.95 వేలు కడితేనే అడ్మిషన్ ఇస్తాం.. లేకుంటే వెళ్లిపోవచ్చంటున్నారు. మరి మా భవిష్యత్ ఏమిటి? ఫీజు గురించి ముందే చెప్పాల్సింది.. : ఆయేషా వర్సిటీ పాలకులు ఎంత ఫీజు చెల్లించాలో ముందే చెప్పారు. లెటర్ పంపారు. పత్రికల్లో ప్రకటించారు. మరి ఇక్కడికి వచ్చాక రూ.21 వేల నుంచి రూ.95 వేలకు పెంచి కట్టమంటున్నారు. అదెలా? ఈ సంవత్సరానికి ఇంతే ఫీజు : బి.అమర్నాథ్, రిజిస్ట్రార్ ఎంపీఈడీ ఫీజు నిర్ణయించడంలో మా అధికారుల వైఫల్యం ఉంది. కన్వీనర్ కోటా రూ.59 వేలుగా నిర్ణయించినా.. పొరపాటున రూ.21,735లుగా ప్రకటించారు. వాస్తవానికి కళాశాలలకు తీవ్రమైన నష్టం వస్తుంది. అయితే ఈ సంవత్సరం వరకు మాత్రం రూ.21,735 మాత్రమే కాలేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజుకే ఈ ఏడాది అడ్మిషన్లు ఇవ్వాలి. అయితే, వచ్చే ఏడాది ఎంత ఫీజు అనే అంశంపై ఒక కమిటీ వేస్తాం. ఫీజు వివరాలను త్వరలో విడుదల చేయబోయే ఆర్యూ పీజీ సెట్ నోటిఫికేషన్లో పేర్కొంటాం. -
‘ఉపాధ్యాయ విద్య’ ఇక సరికొత్తగా..
కొత్త నిబంధనలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ బీఎడ్, ఎంఎడ్, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులు ఇకపై రెండేళ్లు ఇంటర్నల్స్, అంతర్గత మదింపునకు 20-30% వెయిటేజీ పరిశోధనలకు ప్రాధాన్యంతో బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్.. బీఈఎల్ఈడీలకు ప్రాథమిక స్కూళ్లలో బోధనార్హత సాధారణ, ఉపాధ్యాయ విద్యను కలిపి సమీకృత కోర్సులు డిగ్రీ స్థాయి కోర్సుల్లో కంప్యూటర్, యోగా, సమ్మిళిత విద్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లోనూ మార్పులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలను చేపట్టింది. దేశవ్యాప్తంగా 15 రకాల ఉపాధ్యాయ విద్య కోర్సుల కాల వ్యవధి, విధివిధానాల్లో సమూల మార్పులు చేసింది. పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఉపాధ్యాయ విద్య కోర్సుల్లో ప్రధానమైన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) కోర్సుల కాల వ్యవధిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించింది. బీఏ-బీఎడ్, బీఎస్సీ-బీఎడ్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు-2014గా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటినుంచే ఇవి అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2015-16) ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి ఏటా దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయ విద్యా కోర్సులు చేస్తున్నారు. ప్రస్తుత సంస్కరణల ప్రభావం వీరిపై కనిపించనుంది. కేంద్రం తెచ్చిన సంస్కరణల్లోని ప్రధాన అంశాలు.. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు వెయిటేజీ.. ఉపాధ్యాయ విద్యను అభ్యసించే వారి నిరంతర అంతర్గత మదింపు, ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌కు వెయిటేజీ ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. వీటికి 20 నుంచి 30 శాతం మార్కులు ఉంటాయి. కోర్సుల నిర్వహణ కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చే ప్రభుత్వ సంస్థలు ఈ ఇంటర్నల్స్‌కు ఇవ్వాల్సిన మార్కులను నిర్ధారించాలి. మిగతా 70 నుంచి 80 శాతం మార్కులకు రాత పరీక్షలు నిర్వహించాలి. మొత్తం మార్కులకు కలిపి గ్రేడ్లు ఇస్తారు. ప్రతి కోర్సులోనూ విద్యార్థులు, అధ్యాపకుల హాజరు కచ్చితంగా 80 శాతానికి పైగా ఉండాలి. టీచింగ్ ప్రాక్టీస్‌కు 90 శాతం హాజరు తప్పనిసరి. ఏటా 200 రోజులు పనిదినాలు ఉండాలి. వారంలో, ఐదారు రోజుల్లో కనీసంగా 36 గంటలు తరగతులు నిర్వహించాలి. ప్రస్తుతం 40 రోజులు మాత్రమే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ (టీచింగ్ ప్రాక్టీస్)ను 20 వారాల (140 రోజుల)కు పెంచారు. ప్రథమ సంవత్సరంలో నాలుగు వారాలు, ద్వితీయ సంవత్సరంలో 16 వారాలు ఉంటాయి. కోర్సుల వారీగా ముఖ్య అంశాలు.. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (డీఈసీఈడీ)గా ఉన్న కోర్సు ఇకపై ‘డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)’గా మారుతుంది. ఇది రెండేళ్ల కోర్సు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) రెండేళ్ల కోర్సు. బీటీసీ, జేబీటీ, డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) వంటి రకరకాల పేర్లతో ఉన్న వాటన్నింటిని ఇకపై ‘డీఈఎల్ఈడీ’గా పేర్కొంటారు. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు. ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరవచ్చు. బీఎడ్ వారికి లేని ప్రత్యేక అర్హత వీరికి ఉంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు ఈ కోర్సు చేసినవారు అర్హులు. ఎలిమెంటరీ విద్యలో పరిశోధనే ప్రధాన లక్ష్యంగా ఈ కోర్సు ఉంటుంది. శిశు వికాసం, అభ్యసన ప్రక్రియల్లో లోతైన పరిశీలన ఉంటుంది. ఇందులో 60 శాతం మార్కులు రాత పరీక్షలకు, 40 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు (20% ఇంటర్న్‌షిప్‌కు, 20% ఇన్నోవేషన్, క్షేత్ర సంబంధ పరిశోధనలు, ప్రాక్టికల్స్‌కు) ఉంటాయి. ఇప్పటివరకు ఏడాది కోర్సుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) ఇకపై రెండేళ్ల కోర్సుగా ఉంటుంది. దీని సిలబస్‌లోనూ మార్పులు చేశారు. విషయ విజ్ఞానం, మానవ అభివృద్ధి బోధన నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం లక్ష్యంగా సిలబస్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), లింగ వివక్షను దూరం చేసే విద్య, యోగా ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య ఇందులో ఉంటాయి. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్)ను కూడా రెండేళ్ల కోర్సుగా చేశారు. రెండేళ్ల కోర్సుకు అదనంగా నాలుగు వారాలు క్షేత్ర స్థాయి పరిశోధన ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) రెండేళ్ల కోర్సు. ఇది పూర్తి చేసిన వారు పీఈటీ పోస్టులకు అర్హులు. ఏడాది మాత్రమే ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)ను, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ)ను రెండేళ్ల కోర్సులుగా మార్చారు. సమీకృత కోర్సులు... నాలుగేళ్లపాటు నిర్వహించేలా ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఎడ్, బీఏ-బీఎడ్ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టారు. వీటిలో 8 సెమిస్టర్లు ఉంటాయి. ఆరేళ్లలో కోర్సును పూర్తి చేయవచ్చు. ఏటా 250 రోజులు పని దినాలు ఉండాలి. కంప్యూటర్, జెండర్, యోగా, సమ్మిళిత విద్య ఇందులో ఉంటాయి. ఈ కోర్సుల్లో 3వ, 4వ ఏడాదిలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అంతర్గత మదింపునకు 20శాతం నుంచి 40 శాతం మార్కులు, రాత పరీక్షలకు 60 నుంచి 80 శాతం మార్కులు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఈడ్.. ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 215 రోజులు పనిదినాలు ఉండాలి. కాలేజీలు మొత్తంగా 107 వారాలు పని చేయాలి. పీజీ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు.