‘ఉపాధ్యాయ విద్య’ ఇక సరికొత్తగా.. | changes in BEd, MEd, BPEd, MPEd courses | Sakshi
Sakshi News home page

‘ఉపాధ్యాయ విద్య’ ఇక సరికొత్తగా..

Published Sun, Dec 14 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

‘ఉపాధ్యాయ విద్య’ ఇక సరికొత్తగా..

‘ఉపాధ్యాయ విద్య’ ఇక సరికొత్తగా..

 కొత్త నిబంధనలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ
 బీఎడ్, ఎంఎడ్, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులు ఇకపై రెండేళ్లు
 ఇంటర్నల్స్, అంతర్గత మదింపునకు 20-30% వెయిటేజీ
 పరిశోధనలకు ప్రాధాన్యంతో బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ
 ఎడ్యుకేషన్.. బీఈఎల్‌ఈడీలకు ప్రాథమిక స్కూళ్లలో బోధనార్హత
 సాధారణ, ఉపాధ్యాయ విద్యను కలిపి సమీకృత కోర్సులు
 డిగ్రీ స్థాయి కోర్సుల్లో కంప్యూటర్, యోగా, సమ్మిళిత విద్య
 ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లోనూ మార్పులు

 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలను చేపట్టింది. దేశవ్యాప్తంగా 15 రకాల ఉపాధ్యాయ విద్య కోర్సుల కాల వ్యవధి, విధివిధానాల్లో సమూల మార్పులు చేసింది. పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఉపాధ్యాయ విద్య కోర్సుల్లో ప్రధానమైన  బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) కోర్సుల కాల వ్యవధిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించింది. బీఏ-బీఎడ్, బీఎస్సీ-బీఎడ్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు-2014గా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటినుంచే ఇవి అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2015-16) ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి ఏటా దాదాపు రెండు లక్షల మంది     ఉపాధ్యాయ విద్యా కోర్సులు చేస్తున్నారు. ప్రస్తుత సంస్కరణల ప్రభావం వీరిపై కనిపించనుంది. కేంద్రం తెచ్చిన సంస్కరణల్లోని ప్రధాన అంశాలు..
 
 ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు వెయిటేజీ..
 
 ఉపాధ్యాయ విద్యను అభ్యసించే వారి నిరంతర అంతర్గత మదింపు, ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌కు వెయిటేజీ ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. వీటికి 20 నుంచి 30 శాతం మార్కులు ఉంటాయి. కోర్సుల నిర్వహణ కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చే ప్రభుత్వ సంస్థలు ఈ ఇంటర్నల్స్‌కు ఇవ్వాల్సిన మార్కులను నిర్ధారించాలి. మిగతా 70 నుంచి 80 శాతం మార్కులకు రాత పరీక్షలు నిర్వహించాలి. మొత్తం మార్కులకు కలిపి గ్రేడ్‌లు ఇస్తారు. ప్రతి కోర్సులోనూ విద్యార్థులు, అధ్యాపకుల హాజరు కచ్చితంగా 80 శాతానికి పైగా ఉండాలి. టీచింగ్ ప్రాక్టీస్‌కు 90 శాతం హాజరు తప్పనిసరి. ఏటా 200 రోజులు పనిదినాలు ఉండాలి. వారంలో, ఐదారు రోజుల్లో కనీసంగా 36 గంటలు తరగతులు నిర్వహించాలి. ప్రస్తుతం 40 రోజులు మాత్రమే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ (టీచింగ్ ప్రాక్టీస్)ను 20 వారాల (140 రోజుల)కు పెంచారు. ప్రథమ సంవత్సరంలో నాలుగు వారాలు, ద్వితీయ సంవత్సరంలో 16 వారాలు ఉంటాయి.
 కోర్సుల వారీగా ముఖ్య అంశాలు..
 
 డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (డీఈసీఈడీ)గా ఉన్న కోర్సు ఇకపై ‘డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ)’గా మారుతుంది. ఇది రెండేళ్ల కోర్సు.
 
 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) రెండేళ్ల కోర్సు. బీటీసీ, జేబీటీ, డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) వంటి రకరకాల పేర్లతో ఉన్న వాటన్నింటిని ఇకపై ‘డీఈఎల్‌ఈడీ’గా పేర్కొంటారు.
 
 ఇక కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు. ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరవచ్చు.  బీఎడ్ వారికి లేని ప్రత్యేక అర్హత వీరికి ఉంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు ఈ కోర్సు చేసినవారు అర్హులు. ఎలిమెంటరీ విద్యలో పరిశోధనే ప్రధాన లక్ష్యంగా ఈ కోర్సు ఉంటుంది. శిశు వికాసం, అభ్యసన ప్రక్రియల్లో లోతైన పరిశీలన ఉంటుంది. ఇందులో  60 శాతం మార్కులు రాత పరీక్షలకు, 40 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు (20% ఇంటర్న్‌షిప్‌కు, 20% ఇన్నోవేషన్,  క్షేత్ర సంబంధ పరిశోధనలు, ప్రాక్టికల్స్‌కు) ఉంటాయి.
 
 ఇప్పటివరకు ఏడాది కోర్సుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) ఇకపై రెండేళ్ల కోర్సుగా ఉంటుంది. దీని సిలబస్‌లోనూ మార్పులు చేశారు. విషయ విజ్ఞానం, మానవ అభివృద్ధి బోధన నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం లక్ష్యంగా సిలబస్ ఉంటుంది. ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), లింగ వివక్షను దూరం చేసే విద్య, యోగా ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య ఇందులో ఉంటాయి.
 
 మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్)ను కూడా రెండేళ్ల కోర్సుగా చేశారు. రెండేళ్ల కోర్సుకు అదనంగా నాలుగు వారాలు క్షేత్ర స్థాయి పరిశోధన ఉంటుంది.
 
 డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) రెండేళ్ల కోర్సు. ఇది పూర్తి చేసిన వారు పీఈటీ పోస్టులకు అర్హులు.
 
 ఏడాది మాత్రమే ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)ను, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ)ను రెండేళ్ల కోర్సులుగా మార్చారు.
 
 సమీకృత కోర్సులు...
 
 నాలుగేళ్లపాటు నిర్వహించేలా ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఎడ్, బీఏ-బీఎడ్ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టారు. వీటిలో 8 సెమిస్టర్లు ఉంటాయి. ఆరేళ్లలో కోర్సును పూర్తి చేయవచ్చు. ఏటా 250 రోజులు పని దినాలు ఉండాలి. కంప్యూటర్, జెండర్, యోగా, సమ్మిళిత విద్య ఇందులో ఉంటాయి. ఈ కోర్సుల్లో 3వ, 4వ ఏడాదిలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అంతర్గత మదింపునకు 20శాతం నుంచి 40 శాతం మార్కులు, రాత పరీక్షలకు 60 నుంచి 80 శాతం మార్కులు ఉంటాయి.
 
 ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఈడ్..
 
 ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 215 రోజులు పనిదినాలు ఉండాలి. కాలేజీలు మొత్తంగా 107 వారాలు పని చేయాలి. పీజీ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement