ఎన్నెన్నో ఆశలు
ఎన్నెన్నో ఆశలు
Published Thu, Feb 2 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
- నేడు ఆర్‌యూ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశం
- అనుకూల నిర్ణయాలు ఉంటాయని ఉద్యోగుల నిరీక్షణ
కర్నూలు(ఆర్‌యూ): రాయలసీమ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించే ఎగ్జిక్యూటీవ్ కౌన్సెల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో కౌన్సిల్ చైర్మన్ అయిన వీసీ వై.నరసింహులు అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ ఐఏఎస్ ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ మల్లేశ్వరరావులు హాజరయ్యారవుతున్నారు. కౌన్సిల్ సభ్యులైన సంజీవరావు, కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, నాయుడు, సిల్వర్‌జూబ్లీ ప్రిన్సిపాల్, అడ్వకేట్ శివశంకర్ తదితరులు పాల్గొంటున్నట్లు రిజిస్ట్రార్ బి.అమర్‌నాథ్ తెలిపారు.
ఈ సమావేశంలో అధికారులు తీసుకునే నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండాలని వర్సిటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని అందరూ వెయ్యికళ్లతో నిరీక్షిస్తున్నారు. ఈ సమావేశంలోనైనా ఉద్యోగులకు టైమ్ స్కేల్ వర్తింపజేస్తారని, ఇటీవల కోర్టు రద్దు చేసిన ప్రొఫెసర్ల పోస్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేమోనని ఉత్కంఠగా ఎదురు చూస్తునానరు.
టైమ్ స్కేల్ వర్తింపజేయాలి:
కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న చిరుద్యోగుల్లో 8 సంవత్సరాలు దాటిన వారికి టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరుతున్నారు. దినసరి కూలీతో పని చేస్తున్న వారికి జీఓ నెం.151 వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం చేపట్టాలని చిరుద్యోగులు కోరుతున్నారు.
వేతనాల్లో వ్యత్యాసం:
ప్రస్తుతం వీసీ వచ్చిన తర్వాత గత వీసీల హయాంలో టీచింగ్ స్టాఫ్ వేతనం క్రమం 0–5 సంవత్సరాలు, 6–10, 11–15, 16 ఆ తర్వాత అనే విధంగా ఉండేది. ప్రస్తుత వీసీ గడచిన ఈసీ మీటింగ్‌లో 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత నిబంధనలతో అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రమైన క్షోభకు గురవుతున్నారు. జీతం పెంచాలంటే 10 సంవత్సరాల తర్వాతనే ఎన్‌హస్‌మెంట్ వస్తుంది. పాత పద్ధతిలో అయితే 6 సంవత్సరాలు దాటితే దక్కేది. ప్రస్తుతం టీచింగ్ అసిస్టెంట్లకు 10 సంవత్సరాలు దాటిన వారికి రూ.30 వేలు, 15 సంవత్సరాలు దాటిన వారికి రూ.35 వేలుగా ఇస్తున్నారు.
గత ఈసీ మీటింగ్‌లో చర్చించకుండానే నోటిఫికేషన్ :
వర్సిటీలో ఈ మధ్య వచ్చిన టీచింగ్ ఫ్యాకల్టీల నియామకం ఈసీ మీటింగ్‌లో చర్చించకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అప్పట్లో మంత్రి గంటా శ్రీనివాసరావే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ఈ మీటింగ్‌లో సరిచేసే అవకాశం ఉంది.
కోర్టులో చుక్కెదురు:
వర్సిటీ పాలకుల నిర్ణయాలతో ప్రస్తుతం పని చేస్తున్న బోధనా సిబ్బంది తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకెళ్లడంతో టీచింగ్ ఫ్యాకల్టీల నియామక ప్రక్రియను కోర్టు నిలిపివేసింది. తద్వారా ఎవరైతే కోర్టుకెళ్లారో వారిపై వేధింపులుకూడా అదే స్థాయిలో చూపుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అంతేగాక వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం రద్దు చేసింది.
Advertisement