executive council
-
రాజకీయ జోక్యానికి చెక్!
తెలంగాణ యూనివర్సిటీలో గతంలో చేపట్టిన నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకపోయినా ఓ వీసీ తెల్లవారితే తన పదవీ కాలం ముగుస్తుండటంతో రాత్రికి రాత్రే నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు. మహత్మాగాంధీ యూనివర్సిటీలో ఒకే రోజు 200 మందికి ఇంటర్వూ్యలు నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చేశారు. కాకతీయ యూనివర్సిటీలో చేపట్టిన అధ్యాపకుల నియామకాల్లో తమకు కావాల్సిన ఇద్దరి కోసం రోస్టర్ విధానాన్నే మార్చేశారు. దీంతో 37 మంది అధ్యాపకుల నియామకాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా రాజకీయ ఒత్తిళ్లు, ఆశ్రిత పక్షపాతం, అమ్యామ్యాల బాగోతంలో యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు అభాసుపాలయ్యాయి. ఇంటర్వూ్యల్లో నూ తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా మార్కు లు వేసుకొని ఎంపిక చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీల్లో నియామకాలంటేనే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే రాజకీయ జోక్యం, వీసీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టే కసరత్తు మొదలైంది. స్క్రీనింగ్ టెస్టుతో పారదర్శకత.. అధ్యాపకుల నియామకాల్లో గతంలో దరఖాస్తులను ఆహ్వానించి, దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వూ్యలు మాత్రమే నిర్వహించి పోస్టులకు ఎంపిక చేశారు. కానీ ఇకపై ఆ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్పు చేయనుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల్లో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా నిబంధనల రూపకల్పనపై దృష్టి పెట్టింది. అంతేకాదు పోస్టులు పదుల సంఖ్యలో ఉండటం, అభ్యర్థులు వేల సంఖ్యలో ఉండటం వల్ల అంతమందికి నెలల తరబడి ఇంటర్వూ్యలు చేయాల్సి వస్తోంది. దాంతో ఇంటర్వూ్య బోర్డు ఉండే వారిని ప్రభావితం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టు పెడితే కనుక ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. స్క్రీనింగ్ టెస్టును కూడా యూనివర్సిటీలు నిర్వహించకుండా టీఎస్పీఎస్సీ లేదా మరేదైనా థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. అందులో అర్హత సాధించిన వారిలో, పోస్టుల సంఖ్యను బట్టి ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఇంటర్వూ్యకు ఎంపిక చేసి ఆ ముగ్గురికే ఇంటర్వూ్యలు నిర్వహిస్తే సమయం వృథా కాకపోవడమే కాకుండా, ప్రతిభావంతులే పోస్టులకు ఎంపిక అయ్యేలా చూడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇంటర్వూ్యలు నిర్వహించే అవసరం ఉండదు. మరోవైపు ఇంటర్వూ్యల్లోనూ కనీస, గరిష్ట మార్కుల విధానం తెస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్వూ్య బోర్డులో ఉన్న వారు ఇష్టారాజ్యంగా మార్కులు వేయకుండా, ఆశ్రిత పక్షపాతం చూపకుండా కట్టడి చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించాకే.. అధ్యాపక నియామకాల్లో తమ అనుయాయుల కోసం నోటిఫికేషన్లోనే రోస్టర్ విధానాన్ని మార్చేసిన సందర్భాలు ఉండటంతో రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని క్రాస్ చేసేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం విద్యా శాఖ కార్యదర్శి, కళాశాల విద్యా కమిషనర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్, నిఫుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. యూనివర్సిటీ సిద్ధం చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు, రోస్టర్‌ను ఆ కమిటీ క్రాస్ చేసి, ఓకే చెప్పాకే జారీ చేసేలా నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతోంది. వీసీల నియామకం తర్వాత.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,738 ఉండగా, అందులో 1,528 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 687 అసోసియేట్ ప్రొఫెసర్, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న మొత్తం 1,528 పోస్టుల్లోనూ తొలి విడతలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీసీల నియామకం కాగానే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. దీంతో నిబంధనల రూపకల్ప నపై దృష్టి సారించింది. అందులో స్క్రీనింగ్ టెస్టుతో పాటు ఇతర సంస్కరణలను అమలు చేయాలని భావిస్తోంది. -
వారంలోగా వర్సిటీలకు ఈసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వారం రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను (ఈసీ) నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండగా, అక్టోబరులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించింది. మిగతా వర్సిటీలకు ఈసీలు లేకపోవడంతో పాలన స్తంభించిపోయింది. దీంతో వర్సిటీల ఈసీల్లో ఉండే సభ్యుల పేర్లతో కూడిన ఫైలును ప్రభుత్వానికి గతంలోనే పంపించామని, వారం రోజుల్లోగా ఈసీల నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గురువారం వెల్లడించారు. -
ఎన్నెన్నో ఆశలు
- నేడు ఆర్యూ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశం - అనుకూల నిర్ణయాలు ఉంటాయని ఉద్యోగుల నిరీక్షణ కర్నూలు(ఆర్యూ): రాయలసీమ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించే ఎగ్జిక్యూటీవ్ కౌన్సెల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో కౌన్సిల్ చైర్మన్ అయిన వీసీ వై.నరసింహులు అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ ఐఏఎస్ ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ మల్లేశ్వరరావులు హాజరయ్యారవుతున్నారు. కౌన్సిల్ సభ్యులైన సంజీవరావు, కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, నాయుడు, సిల్వర్‌జూబ్లీ ప్రిన్సిపాల్, అడ్వకేట్ శివశంకర్ తదితరులు పాల్గొంటున్నట్లు రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు తీసుకునే నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండాలని వర్సిటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని అందరూ వెయ్యికళ్లతో నిరీక్షిస్తున్నారు. ఈ సమావేశంలోనైనా ఉద్యోగులకు టైమ్ స్కేల్ వర్తింపజేస్తారని, ఇటీవల కోర్టు రద్దు చేసిన ప్రొఫెసర్ల పోస్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేమోనని ఉత్కంఠగా ఎదురు చూస్తునానరు. టైమ్ స్కేల్ వర్తింపజేయాలి: కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న చిరుద్యోగుల్లో 8 సంవత్సరాలు దాటిన వారికి టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరుతున్నారు. దినసరి కూలీతో పని చేస్తున్న వారికి జీఓ నెం.151 వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం చేపట్టాలని చిరుద్యోగులు కోరుతున్నారు. వేతనాల్లో వ్యత్యాసం: ప్రస్తుతం వీసీ వచ్చిన తర్వాత గత వీసీల హయాంలో టీచింగ్ స్టాఫ్ వేతనం క్రమం 0–5 సంవత్సరాలు, 6–10, 11–15, 16 ఆ తర్వాత అనే విధంగా ఉండేది. ప్రస్తుత వీసీ గడచిన ఈసీ మీటింగ్‌లో 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత నిబంధనలతో అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రమైన క్షోభకు గురవుతున్నారు. జీతం పెంచాలంటే 10 సంవత్సరాల తర్వాతనే ఎన్హస్మెంట్ వస్తుంది. పాత పద్ధతిలో అయితే 6 సంవత్సరాలు దాటితే దక్కేది. ప్రస్తుతం టీచింగ్ అసిస్టెంట్లకు 10 సంవత్సరాలు దాటిన వారికి రూ.30 వేలు, 15 సంవత్సరాలు దాటిన వారికి రూ.35 వేలుగా ఇస్తున్నారు. గత ఈసీ మీటింగ్‌లో చర్చించకుండానే నోటిఫికేషన్ : వర్సిటీలో ఈ మధ్య వచ్చిన టీచింగ్ ఫ్యాకల్టీల నియామకం ఈసీ మీటింగ్‌లో చర్చించకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అప్పట్లో మంత్రి గంటా శ్రీనివాసరావే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ఈ మీటింగ్‌లో సరిచేసే అవకాశం ఉంది. కోర్టులో చుక్కెదురు: వర్సిటీ పాలకుల నిర్ణయాలతో ప్రస్తుతం పని చేస్తున్న బోధనా సిబ్బంది తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకెళ్లడంతో టీచింగ్ ఫ్యాకల్టీల నియామక ప్రక్రియను కోర్టు నిలిపివేసింది. తద్వారా ఎవరైతే కోర్టుకెళ్లారో వారిపై వేధింపులుకూడా అదే స్థాయిలో చూపుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అంతేగాక వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం రద్దు చేసింది. -
పాలక మండలి లేకుండానే.. ఆరేళ్లు
శాతవాహన యూనివ ర్సిటీ : శాతవాహన విశ్వవిద్యాలయం పాలక మండలి లేకుండానే ఆరో వసంతంలోకి అడుగిడింది. వర్సిటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే పాలక మండలి ఏర్పాటు గురించి నాటి నుంచి నేటి వరకు పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో విశ్వవిద్యాలయం అభివృద్ధి, నిధులు, విధులు, అధ్యాపకులు, సిబ్బంది నియామకాలు వంటి అనేక విషయాల్లో వైస్‌చాన్సలర్ హైదరాబాద్‌కు పరుగెత్తవలసి వస్తోంది. తెలంగాణ రాష్ర్టంలోనైనా పాలక మండలి ఏర్పాటవుతుందని వర్సిటీ అధికారులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఫైల్ పక్కకు 2008లో కరీంనగర్ శివారు మల్కాపూర్ రోడ్డులో శాతవాహన విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. వర్సిటీ ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా దీనిపై పాలకులు దృష్టి సారించలేదు. పాలక మండలి ఏర్పాటు చేసి ఉంటే ఇప్పటివరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీ మొదటి వీసీ ఇక్బాల్ అలీ హయాంలో ఓసారి పాలకమండలి ఏర్పాటుపై చర్చ జరిగింది. సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. ఓ మాజీ మంత్రి సోదరుడిని విద్యావేత్తల విభాగంలో మండలి సభ్యుడిగా నియమించడానికి విచారణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. పాలక మండలి ఏర్పాటు ప్రక్రియ అంతటితోనే నిలిచిపోయింది. అనంతరం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భేదాభిప్రాయాలతో మండలి ఫైల్ పక్కకు పోయింది. కొద్దినెలల క్రితం జంబోజెట్ రూపంలో అకడమిక్ సెనెట్‌ను ఏర్పాటు చేశారు. పాలక మండలి ఏర్పడిన అనంతరం వేయాల్సిన సెనెట్ కమిటీని ముందే వేయడంపై విమర్శలు వ్యక్తమయ్యూరుు. ఇక్బాల్ అలీ హయాంలో రూపొందించిన పాలక మండలి ఫైల్ ఎక్కడ ఉందో.. దాని ప్రోగెస్ ఏమిటో నేటికీ విశ్వవిద్యాలయ అధికారులకు సైతం తెలియడం లేదంటే కొత్త వర్సిటీలపై పాలకులు ఏ మేరకు దృష్టి పెట్టారో అర్థమవుతోంది. ఏ నిర్ణయమైనా పరుగెత్తాల్సిందే.. విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హైదరాబాద్‌లోని మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ(ఎండీసీ) వద్దకు వర్సిటీ అధికారులు పరుగుతీయాల్సి పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉన్న సమస్యలు కమిటీ సభ్యులకు వివరించినా కొన్ని సందర్భాల్లో వాటి పరిష్కార దిశగా నిర్ణయాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. అలాగే కొత్త వర్సిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అనేకం ఉంటాయి. వాటి ఆర్థికపరమైన అంశాల కోసం వైస్‌చాన్సలర్ హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులకు అన్ని హంగులతో కూడిన హాస్టల్ నిర్మాణం కావాల్సి ఉంది. విద్యాభ్యాసంలో ముఖ్యమైన లైబ్రరీ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు నిధులు రావాల్సి ఉంది. అదే పాలక మండలిని ఏర్పాటు చేస్తే సమావేశాలు ఇక్కడే నిర్వహించి.. సమస్యలు, అభివృద్ధి విషయంలో త్వరతగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని విద్యావేత్తల అభిప్రాయం. ఎగ్జిక్యుటివ్ కౌన్సిల్లో ఉండేది వీరే... క్లాస్-1 విభాగంలో : ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్, రెక్టార్, విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి, ఫైనాన్స్ విభాగ ప్రభుత్వ కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ డెరైక్టర్/కళాశాల విద్యా కమిషనర్ కీలకపాత్రగా ఉంటారు. క్లాస్-2 విభాగంలో : వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ అధ్యాపకుడు, వర్సిటీ నుంచి గుర్తింపు పొందిన కళాశాల ప్రిన్సిపాల్, మరొక అధ్యాపకుడు సభ్యులుగా ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు పారిశ్రామిక రంగంలో కృషి చేసిన పారిశ్రామికవేత్త, విద్య, వ్యవసాయం, ట్రేడ్ కామర్స్, పబ్లిక్ లైఫ్, న్యాయ, సామాజిక సేవారంగం వంటి వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని పాలక మండలిలో సభ్యులుగా ఎంపిక చేసే వీలుంటుంది. -
ఆందోళనల నడుమ ఈసీ సమావేశం
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ హెచ్‌సీయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలోని పరిపాలనా విభాగంలో బుధవారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సమావేశాన్ని పలు విద్యార్థి సంఘాలు అడ్డుకునేందుకు యత్నించాయి. తాజాగా విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య ఘటనపై బాధ్యులను శిక్షించాలని, ప్రొఫెసర్ కృష్ణ కమిటీ నివేదికను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ తప్పిదాలతో ఆత్మహత్య చేసుకున్న పుల్యాల రాజు, పీహెచ్డీ విద్యార్థి వెంకటేశ్ కుటుంబాలకు పరిహారం అందజేయాలని పట్టుబట్టారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వీసీ రామకృష్ణ రామస్వామికి అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్ఏ, టీఎస్ఏ, ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ,బీఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐల నాయకులు పాల్గొన్నారు. వీసీ అంగీకరించిన డిమాండ్లు ఇవే... ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్, పుల్యాలరాజుల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు హామీ. 2008 నుంచి జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర విచారణ చేసేందుకు నిర్ణయం. బాధ్యులుగా తేలితే ప్రొఫెసర్లపై చర్యలకు నిర్ణయం. విద్యార్థులకు, ప్రొఫెసర్లకు మధ్య సమన్వయం కుదిర్చేందుకు తగిన రిఫ్రెష్మెంట్ క్లాసుల నిర్వహణ. యూనివర్సిటీలో సైకాలజిస్ట్లచే విద్యార్థుల్లో మానసిక స్వావలంబన చేకూర్చేందుకు కార్యక్రమాలు. కోలుకుంటున్న ఇషానీ.. హెచ్‌సీయూలో పీహెచ్డీ విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కలకత్తాకు చెందిన ఇషానీ(19) హెచ్‌సీయూలో ఎంఏ చరిత్ర విభాగంలో మొదటి సంవత్సరం చదవుతోంది. మంగళవారం రాత్రి ఆమె బ్లేడుతో చేతిపై కోసుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
అనాథలుగా వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: ఒకటీ, రెండు కాదు.. రాష్ర్టంలో 22 విశ్వవిద్యాలయాలకు మూడేళ్లుగా పాలకవర్గాల్లేవు. రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పాలకవర్గాలను నియమించలేదు. ఫలితంగా ఆ వర్సిటీలన్నీ ఐఏఎస్‌ల పాలనలోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకంపై నడుస్తున్న కేసులో 2011 నవంబరు 2న హైకోర్టు స్టేఎత్తివేసింది. ప్రస్తుత విధానంలోనే ఉప కులపతులను నియమించుకోవచ్చని సూచిస్తూ.. ఎనిమిది వారాల్లో పాలకమండళ్లు (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే, ఉప కులపతుల నియామకం జరిగినా.. పాలక మండళ్లను మాత్రం ఏర్పాటు చేయలేదు. దాంతో వర్సిటీల చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. మార్కుల కుంభకోణాలు, నియామకాల అక్రమాలతో సతమతమవుతున్నాయి. ఏళ్లుగా ఖాళీ: రాష్ట్రంలో 25 వర్సిటీలు ఉండగా.. వాటిలో ఆర్జీయూకేటీకి ప్రత్యేక చట్టం ఉంది. ఉస్మానియా, జేఎన్టీయూ-హైదరాబాద్ వర్సిటీలకు మాత్రమే ప్రభుత్వం పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. వాస్తవానికి 2010లో రాష్ట్రంలోని 10 పాత వర్సిటీల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం కొత్త పాలకమండళ్లను నియమించేందుకు మాజీ వీసీలు, నిపుణులతో ఒక కొలీజియంను ఏర్పాటు చేసింది. ఆ కొలీజియం 2011 మేలో 11 కొత్త వర్సిటీలు సహా 20 వర్సిటీలకు ఈసీల సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. కానీ ప్రభుత్వం పాలకమండళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. ఇక యోగివేమన, తెలంగాణ, ఆదికవి నన్నయ వర్సిటీల పదవీకాలం ముగిసి 2011లో ఖాళీ అయ్యాయి. కొన్ని వర్సిటీల్లో మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీలు పనిచేస్తున్నా వాటి పరిధి నామమాత్రమే. ఐఏఎస్‌ల పాలనలోనే: యూనివర్సిటీల పాలకవర్గంలో 14 మంది సభ్యులు ఉంటారు. అందులో ఉన్నత విద్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, వర్సిటీ ఉప కులపతి, రెక్టార్, కళాశాల విద్య కమిషనర్ లేదా సాంకేతిక వర్సిటీ అయితే సాంకేతిక విద్య కమిషనర్ ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఈ ఐదుగురితోపాటు తొమ్మిది మంది ఇతర సభ్యులు ఉంటారు. వారిని కొలీజియం ఎంపికచేస్తుంది. పాలకవర్గం లేనప్పుడు ఐదుగురు ఎక్స్-అఫిషియో సభ్యులు మాత్రమే వర్సిటీని పాలిస్తారు. అలా ప్రస్తుతం 22 వర్సిటీలు ఐఏఎస్‌ల పాలనలోనే నడుస్తున్నాయి.