సాక్షి, హైదరాబాద్: ఒకటీ, రెండు కాదు.. రాష్ర్టంలో 22 విశ్వవిద్యాలయాలకు మూడేళ్లుగా పాలకవర్గాల్లేవు. రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పాలకవర్గాలను నియమించలేదు. ఫలితంగా ఆ వర్సిటీలన్నీ ఐఏఎస్‌ల పాలనలోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకంపై నడుస్తున్న కేసులో 2011 నవంబరు 2న హైకోర్టు స్టేఎత్తివేసింది. ప్రస్తుత విధానంలోనే ఉప కులపతులను నియమించుకోవచ్చని సూచిస్తూ.. ఎనిమిది వారాల్లో పాలకమండళ్లు (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే, ఉప కులపతుల నియామకం జరిగినా.. పాలక మండళ్లను మాత్రం ఏర్పాటు చేయలేదు. దాంతో వర్సిటీల చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. మార్కుల కుంభకోణాలు, నియామకాల అక్రమాలతో సతమతమవుతున్నాయి.
ఏళ్లుగా ఖాళీ: రాష్ట్రంలో 25 వర్సిటీలు ఉండగా.. వాటిలో ఆర్జీయూకేటీకి ప్రత్యేక చట్టం ఉంది. ఉస్మానియా, జేఎన్టీయూ-హైదరాబాద్ వర్సిటీలకు మాత్రమే ప్రభుత్వం పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. వాస్తవానికి 2010లో రాష్ట్రంలోని 10 పాత వర్సిటీల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం కొత్త పాలకమండళ్లను నియమించేందుకు మాజీ వీసీలు, నిపుణులతో ఒక కొలీజియంను ఏర్పాటు చేసింది. ఆ కొలీజియం 2011 మేలో 11 కొత్త వర్సిటీలు సహా 20 వర్సిటీలకు ఈసీల సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. కానీ ప్రభుత్వం పాలకమండళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. ఇక యోగివేమన, తెలంగాణ, ఆదికవి నన్నయ వర్సిటీల పదవీకాలం ముగిసి 2011లో ఖాళీ అయ్యాయి. కొన్ని వర్సిటీల్లో మానిటరింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీలు పనిచేస్తున్నా వాటి పరిధి నామమాత్రమే.
ఐఏఎస్‌ల పాలనలోనే: యూనివర్సిటీల పాలకవర్గంలో 14 మంది సభ్యులు ఉంటారు. అందులో ఉన్నత విద్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, వర్సిటీ ఉప కులపతి, రెక్టార్, కళాశాల విద్య కమిషనర్ లేదా సాంకేతిక వర్సిటీ అయితే సాంకేతిక విద్య కమిషనర్ ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఈ ఐదుగురితోపాటు తొమ్మిది మంది ఇతర సభ్యులు ఉంటారు. వారిని కొలీజియం ఎంపికచేస్తుంది. పాలకవర్గం లేనప్పుడు ఐదుగురు ఎక్స్-అఫిషియో సభ్యులు మాత్రమే వర్సిటీని పాలిస్తారు. అలా ప్రస్తుతం 22 వర్సిటీలు ఐఏఎస్‌ల పాలనలోనే నడుస్తున్నాయి.
అనాథలుగా వర్సిటీలు
Published Mon, Nov 11 2013 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement