తెలంగాణ యూనివర్సిటీలో గతంలో చేపట్టిన నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకపోయినా ఓ వీసీ తెల్లవారితే తన పదవీ కాలం ముగుస్తుండటంతో రాత్రికి రాత్రే నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు. మహత్మాగాంధీ యూనివర్సిటీలో ఒకే రోజు 200 మందికి ఇంటర్వూ్యలు నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చేశారు. కాకతీయ యూనివర్సిటీలో చేపట్టిన అధ్యాపకుల నియామకాల్లో తమకు కావాల్సిన ఇద్దరి కోసం రోస్టర్ విధానాన్నే మార్చేశారు. దీంతో 37 మంది అధ్యాపకుల నియామకాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
ఇలా రాజకీయ ఒత్తిళ్లు, ఆశ్రిత పక్షపాతం, అమ్యామ్యాల బాగోతంలో యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు అభాసుపాలయ్యాయి. ఇంటర్వూ్యల్లో నూ తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా మార్కు లు వేసుకొని ఎంపిక చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీల్లో నియామకాలంటేనే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే రాజకీయ జోక్యం, వీసీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టే కసరత్తు మొదలైంది.
స్క్రీనింగ్ టెస్టుతో పారదర్శకత..
అధ్యాపకుల నియామకాల్లో గతంలో దరఖాస్తులను ఆహ్వానించి, దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వూ్యలు మాత్రమే నిర్వహించి పోస్టులకు ఎంపిక చేశారు. కానీ ఇకపై ఆ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్పు చేయనుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల్లో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా నిబంధనల రూపకల్పనపై దృష్టి పెట్టింది. అంతేకాదు పోస్టులు పదుల సంఖ్యలో ఉండటం, అభ్యర్థులు వేల సంఖ్యలో ఉండటం వల్ల అంతమందికి నెలల తరబడి ఇంటర్వూ్యలు చేయాల్సి వస్తోంది. దాంతో ఇంటర్వూ్య బోర్డు ఉండే వారిని ప్రభావితం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు పెడితే కనుక ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.
స్క్రీనింగ్ టెస్టును కూడా యూనివర్సిటీలు నిర్వహించకుండా టీఎస్‌పీఎస్సీ లేదా మరేదైనా థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. అందులో అర్హత సాధించిన వారిలో, పోస్టుల సంఖ్యను బట్టి ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఇంటర్వూ్యకు ఎంపిక చేసి ఆ ముగ్గురికే ఇంటర్వూ్యలు నిర్వహిస్తే సమయం వృథా కాకపోవడమే కాకుండా, ప్రతిభావంతులే పోస్టులకు ఎంపిక అయ్యేలా చూడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇంటర్వూ్యలు నిర్వహించే అవసరం ఉండదు. మరోవైపు ఇంటర్వూ్యల్లోనూ కనీస, గరిష్ట మార్కుల విధానం తెస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్వూ్య బోర్డులో ఉన్న వారు ఇష్టారాజ్యంగా మార్కులు వేయకుండా, ఆశ్రిత పక్షపాతం చూపకుండా కట్టడి చేయవచ్చని పేర్కొంటున్నాయి.
ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించాకే..
అధ్యాపక నియామకాల్లో తమ అనుయాయుల కోసం నోటిఫికేషన్‌లోనే రోస్టర్ విధానాన్ని మార్చేసిన సందర్భాలు ఉండటంతో రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని క్రాస్ చేసేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం విద్యా శాఖ కార్యదర్శి, కళాశాల విద్యా కమిషనర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్, నిఫుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. యూనివర్సిటీ సిద్ధం చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు, రోస్టర్‌ను ఆ కమిటీ క్రాస్ చేసి, ఓకే చెప్పాకే జారీ చేసేలా నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతోంది.
వీసీల నియామకం తర్వాత..
రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,738 ఉండగా, అందులో 1,528 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 687 అసోసియేట్ ప్రొఫెసర్, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న మొత్తం 1,528 పోస్టుల్లోనూ తొలి విడతలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీసీల నియామకం కాగానే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. దీంతో నిబంధనల రూపకల్ప నపై దృష్టి సారించింది. అందులో స్క్రీనింగ్ టెస్టుతో పాటు ఇతర సంస్కరణలను అమలు చేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment