వ్యవసాయ సంక్షోభానికి పాలకులే కారణం
Published Fri, Jan 20 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
– ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభానికి పాలకులే కారణమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం కార్మిక కర్షక భవన్‌లో సీఐటీయూ నగర కమిటీ కార్యదర్శి ఎండీ అంజిబాబు అధ్యక్షతన ‘వ్యవసాయ సంక్షోభం–రైతులు, కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలేదన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారడంతో వ్యవసాయానికి అనుబంధంగా పనిచేస్తున్న కూలీలు కూడా జీవన భృతిని కోల్పోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు, కూలీలను ఉదారంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు కే.బడేసాహేబ్ మాట్లాడుతూ..జపాన్‌లో 26 శాతం, అమెరికాలో 80 శాతం, యూరప్‌లో 37 శాతం, చైనాలో 34 శాతం, పాకిస్తాన్‌లో 26 శాతం వ్యవసాయానికి సబ్సిడీలు ఇస్తుంటే భారతదేశంలో ఇది రెండు శాతమే ఉంటోందన్నారు. సాగునీటి వనరులు ఉన్నా వాటిని వినియోగంలోకి తెచ్చుకునేందుకు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, పుల్లారెడ్డి, సబ్బయ్య, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement