అనుకూలంగా ఉంటే అందలం
-
కార్పొరేషన్‌లో మేనేజర్ పోస్టు భర్తీలో సీనియార్టీ పాటించని వైనం
-
మేయర్‌కు అనుకూలంగా ఉన్న వ్యక్తితో పోస్టు భర్తీ
నెల్లూరు, సిటీ : నెల్లూరు నగరపాలకసంస్థలో అర్హత కలిగిన అధికారులకు పక్కనపెట్టి, మేయర్ వర్గం తమకు అనుకూలంగా ఉండే వారిని అందలం ఎక్కిస్తోందనే విమర్శలు ఎప్పటినుంచే ఎక్కువగా ఉన్నాయి. దీనికి తగినట్లుగానే ఇటీవల ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కార్పొరేషన్‌లోని నలుగురు సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించి మేనేజర్, రెండు రెవెన్యూ ఆఫీసర్, అకౌంటెంట్ పోస్టులను భీర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మేయర్ వర్గానికి అనుకూలంగా ఉండే ఇన్‌చార్జి మేనేజర్ రాజేంద్రకు రెగ్యులర్ మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. రెవెన్యూ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న గిరిజను అకౌంటెంట్‌గా, సమద్, రాజేశ్వరీలను రెవెన్యూ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
సీనియార్టీ కాదని..
కార్పొరేషన్‌లో మేనేజర్ పోస్ట్ అత్యంత ముఖ్యమైంది. అనేక కీలక వ్యవహారాలు మేనేజర్ దృష్టికి తప్పనిసరిగా వస్తాయి. దీంతో మేయర్ కార్పొరేషన్‌లో తనకు అనుకూలంగా ఉన్న అధికారి రాజేంద్రను కొన్ని నెలల క్రితం ఇన్‌చార్జ్ మేనేజర్‌గా నియమించారు. కాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాల మేరకు మేనేజర్ పోస్టు భర్తీ విషయంలో సీనియార్టీ పాటించలేదని చెబుతున్నారు. వాస్తవానికి ఆ పోస్టుకు గిరిజ అనే ఉద్యోగిని అర్హురాలు. అయితే ఆమె తమకు అనుకూలంగా ఉండదనే ఉద్ధేశంతో మేయర్ రాజేంద్రకు రెగ్యులర్ మేనేజర్‌గా నియమించాలని కమిషనర్ వెంకటేశ్వర్లుపై ఒత్తిడి తీసుకుచ్చారని సమాచారం. ఈ వ్యవహారంలో కార్పొరేషన్ అధికారులు మేయర్‌పై గుర్రుగా ఉన్నారు.