నిబంధనలు పాటిస్తేనే అనుమతి | rules importent | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటిస్తేనే అనుమతి

Published Sat, Sep 3 2016 9:54 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

నిబంధనలు పాటిస్తేనే అనుమతి - Sakshi

నిబంధనలు పాటిస్తేనే అనుమతి

  • బోట్‌ యజమానులతో కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
  •  
    కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
    నిబంధనలు పాటించని టూరిజం బోట్లను గోదావరిలోకి అనుమతించబోమని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇటీవల గోదావరిలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన టూరిజం, ఇరిగేషన్, పోలీసు శాఖల అధికారులతో పాటు బోట్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బోట్‌ యజమానులు నిబంధనలు పాటించాలన్నారు. 2012లో రూపొందించిన నిబంధనలతో పాటు కొత్తగా మరికొన్ని నిర్దేశిస్తున్నట్టు వివరించారు. గోదావరిలో ప్రయాణించే 24 టూరిజం బోట్లలో 30 శాతం మాత్రమే ఏ–గ్రేడ్‌ కలిగి ఉన్నాయని, మిగిలినవి బీ, సీ గ్రేడ్లలో ఉన్నాయని పేర్కొన్నారు. బోట్లకు లైసెన్స్, ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రక్షణ చర్యలుగా లైఫ్‌ జాకెట్లు, అగ్ని మాపక, మెడికల్‌ కిట్లు, డబుల్‌ ఇంజన్, వైర్‌లెస్‌ సెట్‌ ఏర్పాటు చేయాలని బోట్‌ యజమానులను నిర్దేశించారు.
    వచ్చే నెల నుంచి సీజన్‌
    వచ్చే నెల నుంచి గోదావరిలో టూరిజం సీజన్‌ ప్రారంభమవుతుందని, ఈలోగా బోటు యజమానులు నిబంధనల ప్రకారం బోట్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చే సమయంలోను, రెన్యువల్‌ చేసే సమయంలోను ఇరిగేషన్‌ అధికారులు జాగ్రత్త వహించాలని చెప్పారు. బోటు డ్రైవర్‌ ఫొటోను టూరిజం బోట్లకు అతికించాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. బోట్లకు అనుమతి ఇచ్చేందుకు టూరిజం, ఇరిగేషన్, పోలీసు, అటవీ శాఖలతో సింగిల్‌ విండో విధానం అమలు చేస్తామని వెల్లడించారు. గోదావరిలో రెండు, మూడు రోజుల్లో డ్రెడ్జింగ్‌ ప్రారంభమవుతుందని, దీనివల్ల రిజర్వాయర్‌ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.
    డెప్త్‌ ఇండికేటర్‌ ఉండాలి
    ప్రతి బోటుకు డెప్త్‌ ఇండికేటర్‌ ఉండాలని ఏపీటీడీసీ జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఇంజన్‌ ఉన్న బోట్‌కు రెండో ఇంజన్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. బోట్‌ నిర్మించే సమయంలో దశలవారీగా కమిటీని ఏర్పాటు చేసుకుని, పరిశీలించుకోవాలన్నారు. డ్రైవర్లు మత్స్యశాఖ, పోర్ట్, నేషనల్‌ వాటర్‌ స్పోర్ట్స్‌–గోవా వారి నుంచి లైసెన్సు పొందాలన్నారు. కాగా స్థానిక ఇన్సూరెన్స్‌ కంపెనీలు బోట్లకు బీమా చేసేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లకు గోదావరిలో ప్రయాణంపై శిక్షణ ఇప్పించాలని బోట్‌ యజమానులు కలెక్టర్‌ను కోరారు. అఖండ గోదావరి ప్రాజెక్టు సీఈఓ భీమశంకరం, రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ, ఇరిగేషన్‌ ఈఈ, డీఎఫ్‌ఓ పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement