సదావర్తి భూములు బినామీలకు కట్టబెట్టేందుకే..
Published Sat, Jul 23 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
నిబంధనల పేరుతో ప్రభుత్వం నాటకాలు
గత వేలం రద్దు చేసి కొత్త వేలం నిర్వహించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ డిమాండ్
చిలకలూరిపేటటౌన్: సదావర్తి భూముల విషయంలో తొలి నుంచి సీఎం చంద్రబాబునాయుడు తన బినామీలకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. శనివారం ఆయన నివాసంలో మాట్లాడుతూ ఈ భూములకు ఐదు కోట్లు ఎక్కువిస్తే వారికి భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు కూడా కొన్నదాని కన్నా రెండు కోట్లు ఎక్కువిస్తే భూమి ఇచ్చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ ఈ భూములకు రూ. 5 కోట్లు ఎక్కువిస్తామని ముందుకొస్తే అలవిమాలిన నిబంధనలు విధిస్తున్నారని విమర్శించారు. పీఎల్‌ఆర్ ప్రాజెక్టు వారు వారంలోగా రూ. 28 కోట్లు డిపాజిట్ చేయాలని, 60 రోజుల తరువాత వేలం నిర్వహిస్తామని, రిజిస్ట్రేషన్ చేయమని, కేవలం సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తామని మెలికలు పెట్టడం చూస్తే కేవలం అయిన వారికి భూములు కట్టబెట్టేందుకే నాటకాలు ఆడుతున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. కారు చౌకగా భూములు కొట్టేసిన వారికి రూ. 11 కోట్లు చెల్లించటానికి 90 రోజుల సమయం ఇచ్చారని, అధిక ధరకు కొంటామని వచ్చిన వారికి వారం రోజుల్లో yì పాజిట్ చెల్లించాలని నిబంధన విధించడమేమిటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఈ భూముల విలువ ఎకరం ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారని. గత ఒప్పందాన్ని రద్దు చేయటానికి ఇంతకన్నా ఏ ఆధారం కావాలని ప్రశ్నించారు. ఇంకా ఎకరా కేవలం రూ. 27 లక్షలకే భూములను కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తక్షణమే గత వేలాన్ని రద్దు చేయించి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. అర్హత లేని ఈవోను అమరలింగేశ్వరస్వామి గుడికి వేసి వేలం నిర్వహించటం కుట్రతో కూడుకున్న వ్యవహారం కాదా అని ప్రశ్నించారు.
Advertisement
Advertisement