మహిమాన్వితురాలు..మహాయోగి లక్ష్మమ్మ | saint mahayogi lakshmamma | Sakshi
Sakshi News home page

మహిమాన్వితురాలు..మహాయోగి లక్ష్మమ్మ

Published Wed, May 17 2017 9:04 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

మహిమాన్వితురాలు..మహాయోగి లక్ష్మమ్మ

మహిమాన్వితురాలు..మహాయోగి లక్ష్మమ్మ

- నేడు ఆదోనిలో మహారథోత్సవం
 ఆదోని: మహాయోగి లక్ష్మమ్మ అవ్వ.. ఓ దళిత మహిళ. తన మహిమలతో సమసమాజం కోసం కృషి చేశారు. అవధూతగా ఆమె లక్షల మంది నీరాజనాలు అందుకుంటున్నారు. కొలిచేవారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మహిమాన్వితురాలి మహా రథోత్సవం ఆదోని పట్టణంలో గురువారం సాయంత్రం 3 గంటలకు జరగనుంది. గురువారం రోజు తెల్లవారుజాము నుంచే అవ్వ దర్శనం కోసం భక్తులు బారులు తీరనున్నారు. అంతకు ముందు అవ్వ మూల బృందావనానికి  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అవ్వ బృందావనాన్ని , మూల విరాట్‌కు బెంగళూరు నుంచి తెప్పించిన  పూలతో అలంకరిస్తారు. మహా రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆదోని పట్టణంలోని అవ్వ ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు.  
 
అవ్వ చరిత్ర ఇదీ...
మహాయోగిని లక్ష్మమ్మ అవ్వకు ఘన చరిత్ర ఉంది. ఆలూరు మండలం ముసానపల్లె గ్రామానికి చెందిన దళిత దంపతులు మంగమ్మ, బండెప్పల రెండో కుమార్తె చిన్న లక్ష్మమ్మ. ఆమెకు యుక్త వయస్సు రాగానే కర్ణాటకలోని ఇమ్రాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కారణ జన్మురాలైన లక్ష్మమ్మ సాధారణ మహిళగా జీవనం సాగించలేక పోయింది. సమసమాజ స్థాపనతో పాటు ప్రేమ, దయ, దానం, ధర్మం, ఆధ్యాత్మికతను  పాదుగొలిపేందుకు ఆమె నడుం బిగించారు. తాను ఆశించిన సమాజం ఆవిష్కరణ కోసం ఎన్నో మహిళలు ప్రదర్శిస్తూ ఊరూరు తిరిగారు. ఎంతో మందిలో మార్పు తెస్తూ ఆదోనికి చేరారు.
 
తాను సంకల్పించిన సమాజం ఆవిష్కారానికి బీజం పడిందని తెలుసుకున్న మహా సాద్విని 1933 మే నెల16వ తేదీన పరబ్రహ్మతో లీనమయ్యారు. తాము కోరిన కోర్కెలను తీర్చిన అవ్వ ఇకలేరని తెలుసుకున్న లక్షలాది మంది భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆమె పరబ్రహ్మలోలీనమైన చోటే  బృందావనం ఏర్పాటు చేశారు. కారుణ్యమూర్తి అయిన అవ్వ పరబ్రహ్మలో లీనమైన రోజు వైశాఖ బహుళ సప్తమినాడు మహారథోత్సవం నిర్వహిస్తున్నారు. 
 
భక్తుల సహకారంతో వెండి రథం 
భక్తుల సహకారంతో ఆలయం నిర్వాహకులు 85 ఏళ్ల క్రితం వెండి రథం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ రథంలోనే ఆవ్వ ఊరేగుతున్నారు. అవ్వ మూల విరాట్, ఉత్సవ విగ్రహంతో పాటు ఆలయంలోని అవ్వ గర్భగుడి, బృందావనానికి కూడా వెండి తొడుగులు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రముఖులు రాచోటి కుటుంబానికి చెందిన వారు ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు.  
 
రథోత్సవం అగ్రభాగాన దళితులు
 అవ్వ రథోత్సవంలో ముసానపల్లికి చెందిన దళితులు అగ్రభాగాన కొనసాగుతారు. దళితులు రథోత్సవంలో అగ్రభాగాన ఉండడం అవ్వ సంకల్పంగా పేర్కొంటారు. దళిత ముత్తయిదువులు కళశాలతో కొనసాగగా.. పురుషులు కాషాయం జెండాలతో నడుస్తారు. ఉదయమే పల్లకోత్సవంతో ముసానపల్లె నుంచి ఊరేగింపుగా వచ్చి ఆలయానికి చేరి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముసానపల్లెలో కూడా ఆలయం నిర్మించారు. అక్కడ కూడా మహా యోగిని నిత్య పూజలు అందుకుంటున్నారు.
 
రూ.కోటితో అవ్వ మహాద్వారం
ఆదోని పట్టణంలోని ఆలూరు రోడ్డులో రూ.కోటితో అవ్వ మహాద్వారం నిర్మించారు. త్వరలోనే మహా ద్వారానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. పట్టణానికి మహా ద్వారం ఎంతో అందం తెచ్చి పెట్టింది. పట్టణానికి వచ్చే వారికి అవ్వ ఆహ్వానం పలుకుతున్నట్లు ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. 
 
అవ్వ సంకల్పం మేరకు సామాజిక కార్యక్రమాలు: 
అవ్వ సంకల్పం మేరకు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భక్తులు కూడా అవ్వ సన్నిధిలో చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. గురువారం జరిగే మహారథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం. నీడ కోసం షామియానాలు, దాహార్తి తీర్చేందుకు తాగునీరు ఏర్పాటు చేశాం. జిల్లా నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.  
- రాచోటి రామయ్య, అవ్వ ఆలయం వంశపారంపర్య ధర్మకర్త
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement