సాయి పథం.. సకల జనులకు పుణ్యపథం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి చూపిన మార్గం సర్వజనులకు పుణ్య పథమన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ విద్యార్థులు నిర్వహించిన ‘సత్యసాయి పథం’ నాటిక భక్తులను పరవశింపజేసింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన అదిలాబాద్ సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి తన భక్తులకు బోధించిన నవసూత్రాల సారాన్ని, అవి మానవాళిని సన్మార్గంలో నడిపేందుకు దోహదపడుతున్న తీరును వివరిస్తూ ‘సాయిపథం’ నాటిక సాగింది. చివరగా సత్యసాయి బోధించిన నవసూత్రాలను పాటించడం మూలంగానే తను సత్కర్మలు పొందానని, తద్వారా మానవులకు ముగ్గురు జ్ఞానులు చేసిన సేవలను తానొక్కడే చేయగలిగానని తెలియజెప్పే ఘట్టంతో ముగిసింది.