– వేతనాలందకఅంగన్వాడీల అవస్థలు
– మూడు నెలలుగా నిరీక్షణ
– అక్టోబర్ నిధులు విడుదలైనా బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్యం
5126 : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు
4,082 : అంగన్‌వాడీ కార్యకర్తలు
3,698 : ఆయాలు
రూ.13.56 కోట్లు : పెండింగ్ వేతనాలు
అనంతపురం టౌన్ : అంగన్‌వాడీలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మూడు నెలలుగా వేతనం రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంక్రాంతి పండుగ వేళ కూడా పస్తులుండాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. అక్టోబర్ వేతనానికి సంబంధించి నిధులు మంజూరైనా బిల్లులు పెట్టడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 17 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,286 మెయిన్, 840 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,082 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు.
ప్రతి నెలా వీరికి వేతన కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.7 వేలు, ఆయాలకు రూ.4,500లకు వేతనం పెంచినా.. సకాలంలో మాత్రం అందడం లేదు. గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి రూ.13 కోట్ల 56 లక్షల 45 వేల వేతన బకాయిలు ఉన్నాయి. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో సిబ్బంది అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కేంద్రాల అద్దె బకాయిలు, కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్ చార్జీలను సైతం ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. అయితే.. మూడు, నాలుగు నెలలకు ఒకసారి పెండింగ్‌లో ఉన్నవి మాత్రమే విడుదల చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను క్రమంగా నిర్వీర్యం చేయడంలో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని యూనియన్ నేతలు అంటున్నారు.
బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్యం
ఇటీవల అక్టోబర్ వేతనాలు విడుదలైనట్లు ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. ఎంత విడుదలైందో మాత్రం తెలియని పరిస్థితి. ప్రాజెక్టుల వారీగా నిధులు విడుదలయితే సీడీపీఓల పర్యవేక్షణలో బిల్లులు తయారు చేయాల్సి ఉంటుంది. వీటిని ప్రతి నెలా 5 నుంచి 11వ తేదీలోపు... ఆ తర్వాత 18 నుంచి 25వ తేదీలోపు సమర్పించాలి. సంక్రాంతి నేపథ్యంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తే పండుగ సమయానికి వేతనాలు పడే అవకాశం ఉంది.
కానీ జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రాజెక్టుకు ఎంత మంజూరైందన్న వివరాలు కూడా జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో అందుబాటులో లేవు. ప్రతి నెలా ఠంచన్‌గా వేతనాలు అందుకుంటున్న ఉన్నతాధికారులు.. సిబ్బంది విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జుబేదాబేగంను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘అక్టోబర్‌కు సంబంధించిన వేతనం మంజూరైనట్లు తెలిసింది. ఎంత వచ్చిందన్నది చెప్పడం కష్టం. బిల్లులు రెడీ కాగానే ట్రెజరీకి పెడతార’ని చెప్పారు.
వేతన వెతలు
Published Sat, Jan 7 2017 11:36 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement