salary problems
-
గల్ఫ్ కార్మికుల కష్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న తెలంగాణ, ఆంధ్రా సహా భారత కార్మికుల దుస్థితి పై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై కేంద్రం వైఖరిని కోరాలన్న విజ్ఞప్తి కి స్పందించిన జస్టిస్ ఎన్వి రమణ బెంచ్ ప్రతివాదులైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ర్టాలకు నోటీసులు జారీ చేసింది. సరైన జీతాలు లేక గల్ఫ్ దేశాల్లో కార్మికులు వేధింపులకు గురవుతున్నారని బసంత్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. నకిలీ ఏజెంట్లు గల్ఫ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పిటీషన్లో వివరించారు. గల్ఫ్ దేశాల్లో యజమానులు కార్మికులతో వెట్టిచాకిరి చేయించి సరెైన వేతనాలు చెల్లించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో వేదింపులకు కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని పిటిషనర్ పేర్కొన్నారు. జస్టిస్ ఎన్ వి రమణ బెంచ్ విచారణ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు. దేశానికి భారీగా విదేశీ మారకం తేవడం ద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవడంలేదని వివరించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ ఎన్ వి రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఎలా ఆదేశాలు ఇవ్వలేమని ప్రశ్నించారు. భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. పిటిషనర్ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని అభిప్రాయపడ్డారు. దీనికి బదులిచ్చిన న్యాయవాది శ్రావణ్ కుమార్, తాను కేవలం గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే కాక వాటికి కారణమైన నకిలీ ఏజెంట్లపై సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నానని వివరించారు. నకిలీ ఏజెంట్ల ముఠాలు కేవలం ఒక రాష్ట్రం లోనే కాకుండా అంతర్రాష్ట్ర, విదేశాల్లో కార్యకలాపాలు చేస్తున్నాయి కాబట్టి వారిపై సిబిఐ విచారణ జరపాలని కూడా కోరుతున్నామని వివరించారు. -
వేతనాలపై ఆశ నిరాశ
పాలకొండ రూరల్: గ్రామీణ ప్రజలకు క్షేత్రస్థాయిలో ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు పడుతున్న వీరిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. టీడీపీ ప్రభుత్వం 2014 ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినా అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోగా గత కొద్ది నెలలుగా కనీస వేతనాలు అందకపోవటంతో వీరు ఆకలితో అల్లాడుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలల ముందు ‘ఆశా బాసట’ పేరిట ప్రభుత్వం చలో అమరావతి నిర్వహించి.. ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని చెప్పి జీవోలు విడుదల చేసింది. అయితే అవి అమలుకు నోచుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ క్షయ, కుష్టు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించడంతో ఆశాలు కీలక భూమిక పోషిస్తున్నారు. అలాగే 104 సిబ్బంది నిర్వహిస్తున్న శిబిరాల్లో కూడా వీరు విధులు చేపడుతున్నా తగిన గౌరవ పారితోషికం అందడం లేదు. విధి నిర్వహణకు అవసరమైన కనీస వసతులు, యూనిఫారాలు కూడా అందించకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. సీలింగ్ పేరిట అవస్థలు జిల్లావ్యాప్తంగా ఆశా వర్కర్లకు గతంలో రూ.5,600 పారితోషికం, రూ.3 వేలు గౌరవ వేతనం అందించేవారు. దీనిపై సీలింగ్ విధానం అమలు చేసి పారితోషికం వస్తే గౌరవ వేతనం, గౌరవ వేతనం వస్తే పారితోషికం బకాయి పెట్టారు. దీంతో భగ్గుమన్న ఆశాలు సీఐటీయూతో కలసి పోరుబాట పట్టారు. జీవో నెంబర్ 111ను రద్దు చేసి సీలింగ్‌ను ఎత్తివేయాలని, పారితోషికం, గౌరవ వేతనం రెండు కలసి రూ.8,600 అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం దిగివచ్చి జీవో నెంబర్ 111ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇతర జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్ల సేవలు అధికం. ఇక్కడ సీజనల్ జ్వరాలు, మలేరియా వంటివి ఎక్కువ. దీనికి తోడు ఎపిడమిక్ సీజన్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని ఆశా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇవీ ఆశా వర్కర్ల డిమాండ్లు 2019 జనవరి నుంచి గౌరవ వేతనం, పారితోషిక బకాయిలు వెంటనే చెల్లించాలి. రూ.8,600 పారితోషికం కాపీని పరిగణనలోకి తీసుకుని ఎటువంటి సీలింగ్ లేకుండా పారితోషికాలు ఇవ్వాలి. యూనిఫారాల బకాయిలు తక్షణమే చెల్లించాలి. టీబీ, 104 బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వ వెబ్సైట్లో ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడంపై అభ్యంతరం.. తొలగించాలని డిమాండ్ ఆశా వర్కర్లకు జాబ్ చార్టులు ఇవ్వాలి. ఇతర పనులు చేయించరాదు. ఆశా డే మినహా మిగిలిన రోజుల్లో పీహెచ్‌సీలకు పిలిచిన ప్రతి సందర్భంలో టీఏ, డీఏలు ఇవ్వాలి. అధికారుల వేధింపులు, అక్రమ తొలగింపులు అరికట్టాలి. వీటి సాధనకు ఈ నెలలో మరోసారి అన్ని పీహెచ్‌సీల్లో విధులు బహిష్కరించేందుకు ఆశా వర్కర్లు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భారమైన కుటుంబ పోషణ అసలే చాలీచాలని జీతాలు.. ఆపై ఐదు నెలలుగా బకాయిలు.. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. నిత్యం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాం. తాజాగా ఫొని తుపానులో సైతం విధులు నిర్వహించాం. అయినా కష్టానికి తగిన ఫలితం లేదు. –కె.గౌరీశ్వరి, ఆశా వర్కర్, పాలకొండ మండలం వేతనాలు వెంటనే చెల్లించాలి ప్రభుత్వం పేర్కొన్న మాదిరి సీలింగ్‌ను ఎత్తివేసి రూ.8,600 తక్షణమే చెల్లించాలి. చిరు ఉద్యోగులం. నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే బతికేదెలా? కనీస అవసరాలకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. –పి.కన్యాకుమారి, ఆశా కార్యకర్త, పాలకొండ మండలం నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారు ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాదిరే ఉంది మాకిచ్చిన మాట కూడా. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి. –కె.శ్రీదేవి, ఆశా వర్కర్, పాలకొండ -
వేతన వెతలు
– వేతనాలందకఅంగన్వాడీల అవస్థలు – మూడు నెలలుగా నిరీక్షణ – అక్టోబర్ నిధులు విడుదలైనా బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్యం 5126 : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 4,082 : అంగన్వాడీ కార్యకర్తలు 3,698 : ఆయాలు రూ.13.56 కోట్లు : పెండింగ్ వేతనాలు అనంతపురం టౌన్ : అంగన్వాడీలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మూడు నెలలుగా వేతనం రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంక్రాంతి పండుగ వేళ కూడా పస్తులుండాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. అక్టోబర్ వేతనానికి సంబంధించి నిధులు మంజూరైనా బిల్లులు పెట్టడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 17 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,286 మెయిన్, 840 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,082 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రతి నెలా వీరికి వేతన కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు రూ.7 వేలు, ఆయాలకు రూ.4,500లకు వేతనం పెంచినా.. సకాలంలో మాత్రం అందడం లేదు. గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి రూ.13 కోట్ల 56 లక్షల 45 వేల వేతన బకాయిలు ఉన్నాయి. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో సిబ్బంది అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కేంద్రాల అద్దె బకాయిలు, కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్ చార్జీలను సైతం ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. అయితే.. మూడు, నాలుగు నెలలకు ఒకసారి పెండింగ్‌లో ఉన్నవి మాత్రమే విడుదల చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను క్రమంగా నిర్వీర్యం చేయడంలో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని యూనియన్ నేతలు అంటున్నారు. బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్యం ఇటీవల అక్టోబర్ వేతనాలు విడుదలైనట్లు ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. ఎంత విడుదలైందో మాత్రం తెలియని పరిస్థితి. ప్రాజెక్టుల వారీగా నిధులు విడుదలయితే సీడీపీఓల పర్యవేక్షణలో బిల్లులు తయారు చేయాల్సి ఉంటుంది. వీటిని ప్రతి నెలా 5 నుంచి 11వ తేదీలోపు... ఆ తర్వాత 18 నుంచి 25వ తేదీలోపు సమర్పించాలి. సంక్రాంతి నేపథ్యంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తే పండుగ సమయానికి వేతనాలు పడే అవకాశం ఉంది. కానీ జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రాజెక్టుకు ఎంత మంజూరైందన్న వివరాలు కూడా జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో అందుబాటులో లేవు. ప్రతి నెలా ఠంచన్‌గా వేతనాలు అందుకుంటున్న ఉన్నతాధికారులు.. సిబ్బంది విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జుబేదాబేగంను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘అక్టోబర్‌కు సంబంధించిన వేతనం మంజూరైనట్లు తెలిసింది. ఎంత వచ్చిందన్నది చెప్పడం కష్టం. బిల్లులు రెడీ కాగానే ట్రెజరీకి పెడతార’ని చెప్పారు.