పాలకొండ రూరల్: గ్రామీణ ప్రజలకు క్షేత్రస్థాయిలో ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు పడుతున్న వీరిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. టీడీపీ ప్రభుత్వం 2014 ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినా అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోగా గత కొద్ది నెలలుగా కనీస వేతనాలు అందకపోవటంతో వీరు ఆకలితో అల్లాడుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలల ముందు ‘ఆశా బాసట’ పేరిట ప్రభుత్వం చలో అమరావతి నిర్వహించి.. ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని చెప్పి జీవోలు విడుదల చేసింది.
అయితే అవి అమలుకు నోచుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ క్షయ, కుష్టు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించడంతో ఆశాలు కీలక భూమిక పోషిస్తున్నారు. అలాగే 104 సిబ్బంది నిర్వహిస్తున్న శిబిరాల్లో కూడా వీరు విధులు చేపడుతున్నా తగిన గౌరవ పారితోషికం అందడం లేదు. విధి నిర్వహణకు అవసరమైన కనీస వసతులు, యూనిఫారాలు కూడా అందించకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
సీలింగ్ పేరిట అవస్థలు
జిల్లావ్యాప్తంగా ఆశా వర్కర్లకు గతంలో రూ.5,600 పారితోషికం, రూ.3 వేలు గౌరవ వేతనం అందించేవారు. దీనిపై సీలింగ్ విధానం అమలు చేసి పారితోషికం వస్తే గౌరవ వేతనం, గౌరవ వేతనం వస్తే పారితోషికం బకాయి పెట్టారు. దీంతో భగ్గుమన్న ఆశాలు సీఐటీయూతో కలసి పోరుబాట పట్టారు. జీవో నెంబర్ 111ను రద్దు చేసి సీలింగ్‌ను ఎత్తివేయాలని, పారితోషికం, గౌరవ వేతనం రెండు కలసి రూ.8,600 అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం దిగివచ్చి జీవో నెంబర్ 111ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇతర జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్ల సేవలు అధికం. ఇక్కడ సీజనల్ జ్వరాలు, మలేరియా వంటివి ఎక్కువ. దీనికి తోడు ఎపిడమిక్ సీజన్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని ఆశా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
ఇవీ ఆశా వర్కర్ల డిమాండ్లు
- 2019 జనవరి నుంచి గౌరవ వేతనం, పారితోషిక బకాయిలు వెంటనే చెల్లించాలి.
- రూ.8,600 పారితోషికం కాపీని పరిగణనలోకి తీసుకుని ఎటువంటి సీలింగ్ లేకుండా పారితోషికాలు ఇవ్వాలి.
- యూనిఫారాల బకాయిలు తక్షణమే చెల్లించాలి.
- టీబీ, 104 బకాయిలు చెల్లించాలి.
- ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడంపై అభ్యంతరం.. తొలగించాలని డిమాండ్
- ఆశా వర్కర్లకు జాబ్ చార్టులు ఇవ్వాలి. ఇతర పనులు చేయించరాదు.
- ఆశా డే మినహా మిగిలిన రోజుల్లో పీహెచ్‌సీలకు పిలిచిన ప్రతి సందర్భంలో టీఏ, డీఏలు ఇవ్వాలి.
- అధికారుల వేధింపులు, అక్రమ తొలగింపులు అరికట్టాలి.
- వీటి సాధనకు ఈ నెలలో మరోసారి అన్ని పీహెచ్‌సీల్లో విధులు బహిష్కరించేందుకు ఆశా వర్కర్లు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
భారమైన కుటుంబ పోషణ
అసలే చాలీచాలని జీతాలు.. ఆపై ఐదు నెలలుగా బకాయిలు.. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. నిత్యం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాం. తాజాగా ఫొని తుపానులో సైతం విధులు నిర్వహించాం. అయినా కష్టానికి తగిన ఫలితం లేదు. –కె.గౌరీశ్వరి, ఆశా వర్కర్, పాలకొండ మండలం
వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రభుత్వం పేర్కొన్న మాదిరి సీలింగ్‌ను ఎత్తివేసి రూ.8,600 తక్షణమే చెల్లించాలి. చిరు ఉద్యోగులం. నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే బతికేదెలా? కనీస అవసరాలకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. –పి.కన్యాకుమారి, ఆశా కార్యకర్త, పాలకొండ మండలం
నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారు
ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాదిరే ఉంది మాకిచ్చిన మాట కూడా. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి.
–కె.శ్రీదేవి, ఆశా వర్కర్, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment