సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా పనులు చేయించుకునేందుకే కొందరు ప్రజా ప్రతినిధులు తమ అధికారాన్ని వినియోగిస్తున్నారు. ఇందుకు గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడే ఉదాహరణ. ఏ ఉద్యోగాలొచ్చినా వాటిని తనవారికే కట్టబెట్టాలని అధికారులపై హకుం జారీ చేస్తున్నారు. అంతేనా.. ఏకంగా తన లెటర్ హెడ్‌పై సిఫార్సుల జాబితాను ఇస్తున్నారు. ఆ మధ్య అంగన్‌వాడీ నియామకాల్లోనూ అదే జరిగింది. అదే సమయంలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల్ని వదల్లేదు. వాటిని కూడా తాను చెప్పిన వారికే ఇవ్వాలని తన లెటర్ హెడ్‌పై జాబితా ఇచ్చారు. ఆ జాబితా లేఖ తాజాగా సాక్షికి చిక్కింది. ఎమ్మెల్యే చెప్పాక ఇవ్వకపోతే ఇబ్బంది వస్తుందేమోనని ఆ జాబితాలో కొందరిని ఇప్పటికే నియమించారు. మరికొందర్ని దశల వారీగా నియమించేందుకు హామీ ఇచ్చారు.
లేఖల వెనుక మర్మమేమిటో...
గతేడాది అక్టోబర్‌లో భారీగా జరిగిన అంగన్‌వాడీ నియామకాల్లో భారీ ఎత్తున నగదు చేతులు మారినట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది. కార్యకర్తల పోస్టులకైతే రూ. 4లక్షల నుంచి రూ. 7లక్షల వరకు, ఆయా పోస్టులకైతే రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే తన లెటర్‌హెడ్‌పై కొన్ని పేర్లు సూచించడం ఇక్కడ చర్చనీయాంశమైంది. అధికారులు సైతం మొదట ఊగిసలాడినా ఆ తర్వాత తల ఊపేసారు. ఎమ్మెల్యే ఏ జాబితానైతే ఇచ్చారో అందులో గల అభ్యర్థులనే ఎంపిక చేసేశారు. వాస్తవంగా ఎంపిక కమిటీతో తనకు ఎటువంటి సంబంధం లేకున్నా... ఈ లెటర్ వెనుక మర్మమేమిటన్నది చిదంబర రహస్యంగానే ఉంది. ఈ ప్రక్రియలో ఎంతోమంది అర్హులకు అవకాశం లేకుండా పోయింది.
షిఫ్ట్ ఆపరేటర్ల విషయంలోనూ...
విద్యుత్ సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల విషయంలోనూ అదే జరిగింది. తన నియోజకవర్గ పరిధిలో గల సబ్ స్టేషన్లలో తాను సూచించిన వ్యక్తులకే ఇవ్వాలని స్వామినాయుడు అనే కాంట్రాక్టర్ పేరుతో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తన లెటర్ హెడ్‌పై రాసి పంపించారు. సబ్ స్టేషన్ల వారీగా ఎవరిని వేసుకోవాలో అందులో సూచించారు. ఆ జాబితాను ట్రాన్స్‌కోలో పనిచేసే వివిధ అధికారులకు కాపీ పంపించారు. ఎమ్మెల్యే చెప్పారని ఇప్పటికే ఆ జాబితాలో కొందర్ని నియమించారు. మిగతా వారిని దశల వారీగా సర్ధుబాటు చేస్తామని లోపాయికారీగా హామీ ఇచ్చినట్టు తెలిసింది.
పైరవీలే పరమావధి
Published Thu, Jan 28 2016 11:45 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement