వీరులకు శాల్యూట్
వీరులకు శాల్యూట్
Published Mon, Jul 25 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
నేడు కార్గిల్ విజయ్ దివస్
యుద్ధంలో గుడివాడ సిపాయి గోవిందరావు
భోగాపురం: భారత్–పాకిస్తాన్ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. అన్నిసార్లు దాయాదికి అవమానాలే మిగిలాయి. అవన్నీ ఒక ఎత్తు.. కార్గిల్ యుద్ధం మరో ఎత్తు. ఈ యుద్ధం.. పాకిస్తాన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చాటింది. అరవై రోజులు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న ముగిసింది. ఎందరో వీరసైనికుల బలిదానంతో భారత్ విజయం సాధించింది. కార్గిల్ కొండల్లో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. భారత్ విజయాన్ని పురస్కరించుకుని ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న విజయనగరం జిల్లా వీరసైనికుల విజయగాథపై కథనమిది.
దేశరక్షణ విధులకు ఎంపిక
గుడివాడ గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి దేవి అప్పన్న కుమారుడు దేవి గోవిందరావు. పులి కడుపున పులే పడుతుందంటారు. తండ్రి వారసత్వ లక్షణం కుమారుడికీ అబ్బింది. సైన్యంలో పనిచేయాలన్న ఆకాంక్ష రగిలింది. ఫలితంగా దేశరక్షణ విధులకు ఎంపిక చేసింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొనే అవకాశం గోవిందరావుకు కలిగింది. ఈ సందర్భంగా శత్రు సైనికులు పేల్చిన తూటా తగిలి వారం రోజులు కోమాలో ఉండి ఎట్టకేలకు ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం చండీఘడ్‌లో నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేవి గోవిందరావును ఫోన్‌లో సంప్రదించినప్పుడు ఎన్నో విశేషాలను పంచుకున్నారు.
వీరోచితంగా పోరాడాం: గోవిందరావు
కార్గిల్ యుద్ధం గురించి మీరు గుర్తుచేయగానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. యుద్ధంలో మా బందం వీరోచితంగా పోరాడింది. కానీ ప్రత్యర్థి పేల్చిన తూటాలకు నా కుడి భుజం, కుడి మెడభాగంలో బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో పడిపోయాను.. అంతే తెలివి లేదు. వారం రోజులు తరువాత తెలివొచ్చింది. నాకు తూటాలు తగిలి పడిపోగానే చనిపోయానని నా సహచరులు చనిపోయానని అనుకున్నారట. ప్రత్యర్థుల దాడి ముగిసిన అనంతరం చూడగా బతికి ఉన్నానని గమనించి ఆసుపత్రికి చేర్చారట. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియనివ్వలేదు. నాకు మెడవద్ద నరం తెగిపోవడంతో తొడలో నరం తీసి అమర్చారు. తూటా తాలూకా వ్యర్థం ఇంకా నా మెడలోనే ఉంది. దానివల్ల చలికాలంలో ఇబ్బంది పడుతుంటాను. ప్రస్తుతం చండీఘడ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాను. భారత్ తరపున యుద్ధం చేయడం చెప్పలేని అనుభూతి.
గర్వకారణం: నారాయణమ్మ
కార్గిల్ యుద్ధంలో నా కొడుకు గోవిందరావు గాయపడిన విషయం తెలియనివ్వలేదు. వారం రోజులు కోమాలో ఉండి బతికి బయటపడ్డాడు. కోలుకున్నాక సెలవులో ఇంటికి వచ్చినప్పుడు చెబితే తెలిసింది. దీంతో అంతా ఒక్కసారిగా భయపడ్డాం. కానీ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశరక్షణకు నా కొడుకు యుద్ధంలో పాల్గొనడం మాకు గర్వంగా ఉంది.
Advertisement