పండుగలో పగ మాటేల!
రెండో మాట
వర్ధమాన దేశాలకు పెద్ద బెడదగా మారిపోయిన ఉగ్రవాదాన్ని నిరోధించడం అనివార్యం. అందుకు ముందుగా జరగవలసినదేమిటి? ఉగ్రవాదం పెరిగి పోవడానికి కారణమైన దాదాపు 125 దేశాలలో ఉన్న అమెరికా సైనిక, వైమానిక కేంద్రాలను ఉపసంహరించు కోవాలి. బాండుంగ్ సమావేశంలో భారత్ సహా, వర్ధమాన దేశాలు ప్రవచించి, ఆచరణలోకి తెచ్చిన పంచశీల సూత్రాలను పునరుద్ధరించాలి. దీనితో పాటు, చాలాకాలం పాటు ఇరు దేశాలు పాటించిన తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలను తిరిగి గౌరవించాలి.
‘ఈ విజయదశమి దేశానికి అందివచ్చిన ప్రత్యేక పండుగ. ఈ పండుగ దుష్టశక్తి మీద మంచి సాధించే విజయచిహ్నం. అదే ఈ ఏడాది దసరా ప్రత్యేకత అని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సభలో ప్రకటించారు. అయితే ఆయన భారత్–పాక్ సరిహద్దులలో నెలకొన్న నియంత్రణ రేఖ పొడవునా ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం జరిపిన మెరుపుదాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ ప్రకటన చేశారు.’ దిహిందూ (10–10– 16)
‘కశ్మీర్ సమస్య మీద అమెరికా వైఖరిలో మార్పులేదు. కానీ ఆ సమస్యను భారత్,పాక్ దేశాలే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇండియా ప్రపంచ స్థాయి చర్చలలో పాల్గొనాలంటే ముందు పాకిస్తాన్‌తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలి’(8వ తేదీన అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు చేసిన ప్రకటన)
ప్రపంచంలో ఎక్కడైనా పండుగలు జరుపుకునేది ప్రజల మధ్య శాంతి కోసం. ఇరుగుపొరుగుల సయోధ్యతో సౌభాగ్య సంపదలను పెంచుకోవా లనే. అంతేకానీ, శాంతికోసం యుద్ధం; యుద్ధాల కోసం యుద్ధం అన్న తీరులో పండుగలు జరగవు. జరపకూడదు. ఈ దృష్ట్యా ప్రధాని మోదీ పొరుగు దేశం గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ విజయదశమి పండుగకు చెప్పిన కొత్త భాష్యం అపార్థాలకు దారితీసే విధంగా ఉంది. పఠాన్‌కోట్, ఊరిలపై జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత దాడుల పుట్టుపూర్వోత్తరాల గురించి, అవి జరిగిన తీరు గురించి మన రక్షణశాఖ గూఢచారులు విడుదల చేస్తున్న వివరాల మీద దేశంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ఉదంతాలలో సంభవించిన మరణాలు, క్షతగాత్రుల సంఖ్య గురించి కూడా స్పష్టత రాలేదు. ఈ వాస్తవ పరిస్థితికి తోడు మనకు ఈ అంశంలో అండాదండా ఇచ్చే ఇరుగుపొరుగు దేశాలు ఎన్ని? అన్న ప్రశ్న కూడా వినిపిస్తున్నది.
నిజానికి భారత్, పాక్‌ల మధ్య చోటు చేసుకున్న యుద్ధాలూ, ఘర్షణల గురించి కన పడుతున్న ఆందోళన, వాటి పరిష్కారం విషయంలో కానరావడం లేదు. ఈ రెండు దేశాల ప్రభుత్వాల వైఖరీ, ఐక్యరాజ్యసమితి వేదికల మీద వినిపిస్తున్న మాటలూ, దక్షిణాసియా దేశాలలో జరుగుతున్న చర్చల సరళీ చూస్తే ఇదే భావన కలుగుతుంది. తాజా ఘర్షణల మీద ఆఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లా దేశ్‌లు మాత్రమే భారత్ తరఫున నిలబడనున్నట్టు ప్రకటనలు ఇచ్చాయి. శ్రీలంక తటస్థంగానే ఉంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి ఐదు అగ్రరాజ్యాలు– అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్– భారత్, పాక్ పాల కులను కశ్మీర్ సమస్యను ప్రత్యక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోమని చెబు తున్నాయి లేదా ఆదేశిస్తున్నాయి. ఈ రెండు దేశాల పాలకులు పద వులను రక్షించుకోవడానికీ, వాటిలో కొనసాగడానికీ పోటీ పడుతూ యుద్ధం ద్వారా, ఘర్షణల ద్వారా ప్రజా బాహుళ్యాల ప్రయోజనాలను దెబ్బ తీయడా నికి వెనుకాడడం లేదు. ఇందుకు కాంగ్రెస్, బీజేపీ కూడా మినహాయింపు కాదు.
తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలు మరిచారా?
1947–48, 1965, 1971,1999 సంవత్సరాలలో నాలుగు పర్యాయాలు భారత్, పాక్‌ల మధ్య యుద్ధాలూ లేదా ఘర్షణలు జరిగాయి. ‘శత్రువు’ను ముగ్గులోకి లాగి చర్చల ద్వారా శక్తిహీనం చేసే సదవకాశం రెండు యుద్ధాల సమయంలో వచ్చింది కూడా. అందులో మొదటి అవకాశం లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో జరిగిన తాష్కెంట్ ఒప్పందం రూపంలోను, తరువాత ఇందిరాగాంధీ నాయకత్వంలో జుల్ఫీకర్ అలీ భుట్టోతో కుదిరిన సిమ్లా ఒప్పందం ద్వారానూ వచ్చాయి. ఇక వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమ యంలో నాటి పాక్ పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌తో ఆగ్రా ఒప్పందం చర్చల దాకా వచ్చి అర్థంతరంగా తెరమరుగైంది. కానీ ఇప్పటి సరిహద్దు ఘర్షణల అనంతర పరిస్థితిని చూస్తే ఐదో యుద్ధం గురించిన అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నది. ఉగ్రవాదం మీద ప్రపంచ వ్యాప్తంగా సమైక్యంగా యుద్ధం లేదా పోరాటం జరగవలసిందే. అదే సమయంలో ఇలాంటి తరహా ఉగ్రవాదులకు నారు పోసి పెంచిన ఘనత అమెరికా, బ్రిటన్ సామ్రాజ్యవాద దేశాలదేన న్న నగ్నసత్యాన్ని విస్మరించలేం. అమెరికాలో ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి, తరువాత అమెరికా పిలుపునకు భారత్ స్పందించిన తీరు కూడా మరువలేనివి.
అయితే ఈ దాడి బయట నుంచి జరిగింది మాత్రం కాదనీ, ఇంటి గుట్టు అమెరికా పాలక వర్గానికి తెలిసిందేననీ ఆ దేశానికే చెందిన 1,500 మంది ఇంజనీర్ల బృందం ఘోషించింది. దీని మీద అంత ర్జాతీయ స్థాయి విచారణ జరగాలని కూడా ఆ బృందం కోరింది. బ్రిటన్‌లోను ఇలాంటి అభిప్రాయం లేకపోలేదు. ఆ విధ్వంస కాండ బయట నుంచి జరి గినది కానేకాదనీ, బుష్, టోనీ బ్లెయిర్ అందుకు కారకులనీ బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు కార్బిన్ కూడా అప్పుడు వ్యాఖ్యానించారు. టెర్రరిజం ఎక్కడో లేదు, దానితో వచ్చే ప్రమాదమంతా అమెరికా లోపలనే దాగి ఉందని ప్రసిద్ధ ఇండో–అమెరికన్ వ్యాఖ్యాత స్టీఫెన్ ఆల్తర్ కూడా చెప్పారు. ఇంత జరిగినా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాడు జార్జి డబ్ల్యూ బుష్ ఈ దాడినే ఒక సాకుగా ప్రచారం చేసుకున్నారు. ఏమీ రుజువులు లేకున్నా మొదటిగా ఆఫ్గానిస్తాన్, తరువాత ఇరాక్ పైన అమెరికా దాడులు చేయించింది. లక్షలాది మందిని చంపింది. అయినా బుష్ ఎన్నికలలో విజయం సాధించారు. ఫలితం ఇండియా సహా ఆఫ్రో–ఆసియన్ వర్ధమాన దేశాలు ఒక విషమ చక్ర బంధంలో చిక్కుకుపోయాయి. ఇప్పటికీ ఉగ్రవాదం మీద అంతర్జాతీయ యుద్ధం పేరుతో సాగుతున్న ఆ రాజకీయమే జాతీయ సరిహద్దులను అధిగ మించుతున్నది. అలాంటి రాజకీయం స్థిరపడుతోంది కూడా. భారత్, పాక్ వంటి వర్ధమాన దేశాలు అమెరికా పావులుగా మారడం ఇందులో భాగమే.
అమెరికాను నమ్మడం పొరపాటు
కాలం మారింది. సమస్య మాత్రం అలాగే ఉంది. ఉగ్రవాదం ఇంకాస్త పెరిగింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైఖరి ఉగ్రవాదం పట్ల ఆ దేశం అనుసరిస్తున్న వైఖరిని దారి మళ్లించడమంత పెద్ద పనికి అవకాశం కల్పించలేదు. ‘క్లింటన్, తరువాత ఒబామా కూడా అమెరికా సామ్రాజ్య విస్తరణకే ప్రాధాన్యం ఇచ్చారు. తన ప్రభుత్వానికి అంత పెద్ద ఇబ్బందేమీ ఉండదని భావించిన పక్షంలోనే ఒబామా ప్రత్యక్ష సైనిక జోక్యానికి దిగుతాడు. మరో దారి ఏదీ లేదని భావిస్తే లౌకిక దౌత్యానికి దిగుతాడు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనుకున్నప్పుడు పరోక్ష యుద్ధాలను ప్రోత్సహిస్తాడ’ని ప్రసిద్ధ పత్రికా రచయిత స్టాన్లీ జోహ్నీ చెబుతారు. భారత్, పాక్‌ల నడుమ యుద్ధాలు గానీ, ఘర్షణలు గానీ నాలుగు పర్యాయాలు సంభవించాయి. ఇప్పుడు తాజాగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.
వీటి వల్ల ఉభయ దేశాలకు దక్కిన ఫలితం ఏమిటి? ఇందుకు సమాధానం అంత త్వరగా దొరకదు. కానీ ఒకటి నిజం. పాలకులలో రాచ రికపు పోకడలు ఇంకా పొడచూపుతూనే ఉన్నాయి. అవి అహానికి దారి తీసి ప్రజలను కష్టనష్టాలకు గురి చేస్తున్నాయి. అవి అలా కొనసాగుతున్నంత కాలం ప్రజలకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగలవు. మన ఉభయ దేశాల ప్రజ లకు దక్కిన ఫలితం ఇది మాత్రమే. అధీనరేఖ వద్ద నివశించే రైతుల మాటలే ఇందుకు తాజా ఉదాహరణ: వారు తమ గోడును ఇలా వివరించారు. ‘అవిభాజ్య భారతాన్ని విభజించి, పాకిస్తాన్‌ను సృష్టించినది లగాయితు సరి హద్దు ప్రాంతాలలో నివసించే వారందరినీ సమస్యలు చుట్టుముట్టాయి. విభజనకు ముందు ఈ సమస్యలు లేవు. విభజనానంతరం ఏర్పడిన సరి హద్దు అధీన రేఖ వెంట (హమీర్‌పూర్ వంటి గ్రామాలలో) స్థిరపడిన ప్రజలు ఆ ప్రాంతాల నుంచి నిరంతరం ఉద్వాసనకు గురవుతూనే ఉన్నారు. ఇండో– పాక్ యుద్ధాలూ, ఘర్షణల ఫలితమే అక్కడి ప్రజల వలస. మా పొలాలు, పంటలు విడిచి పెట్టవలసి రావడంవల్ల మాకు ఎంత నష్టమో తేల్చలేం’ (మాజీ సైనికుడు బల్జిత్‌సింగ్, రైతులు సూరంచంద్, లఖన్‌సింగ్ ఇచ్చిన వాంగ్మూలాలు. ఇవి ఈ నెల ఏడున వార్తలుగా వచ్చాయి).
బాండుంగ్ ఆదేశాలు పాటించాలి
వర్ధమాన దేశాలకు పెద్ద బెడదగా మారిపోయిన ఉగ్రవాదాన్ని నిరోధించడం అనివార్యం. అందుకు ముందుగా జరగవలసినదేమిటి? ఉగ్రవాదం పెరిగి పోవడానికి కారణమైన దాదాపు 125 దేశాలలో ఉన్న అమెరికా సైనిక, వైమా నిక కేంద్రాలను ఉపసంహరించుకోవాలి. బాండుంగ్ సమావేశంలో భారత్ సహా, వర్ధమాన దేశాలు ప్రవచించి, ఆచరణలోకి తెచ్చిన పంచశీల సూత్రా లను పునరుద్ధరించాలి. దీనితో పాటు, చాలాకాలం పాటు ఇరు దేశాలు పాటించిన తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలను తిరిగి గౌరవించాలి. ఇవేం చెబుతున్నాయి: ‘భారత్, పాక్‌లు ఐక్యరాజ్య సమితి ప్రణాళికకు అను గుణంగా ఉభయత్రా సుహృద్భావంతో మంచి ఇరుగు పొరుగు సంబంధా లను ఏర్పరుచుకోవడానికి ఉభయ దేశాల నాయకత్వాలు సర్వ ప్రయత్నాలు చేయడానికి సమ్మతిస్తున్నాం.
ఎలాంటి బల ప్రయోగానికి దిగబోమనీ, వివా దాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామనీ, ఐక్యరాజ్య సమితి ప్రణా ళికకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి బలప్రయోగానికి దిగబోమనీ పూచీ పడుతున్నాం. ఇంతవరకు ఉభయ దేశాల సంబంధాలకు విఘాతం కలిగించిన ఘర్షణలకు స్వస్తి చెబుతామని హామీపడుతున్నాం. ఉభయుల ప్రాదేశిక సమగ్రతను, స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ పరస్పరం దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించాం.’ కాబట్టి పాత పగలను గుర్తు చేయడానికి పండుగలను వాడు కోవడం సరికాదు. ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంట ఉన్న ప్రజలు పడుతున్న ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని భారత్, పాకిస్తాన్ పాలకులు తాష్కెంట్, సిమ్లా సంధిపత్రాల ఆదేశాన్ని అక్షరాలా అమలు చేయడానికి అహంకారాలకు పోకుండా తక్షణం ఉపక్రమించాలి.
(వ్యాసకర్త : ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in)