Indo-Pak War
-
కాలశకలమై మిగిలిన జ్ఞాపకం
సీజర్ విషయంలో జరిగినట్లే ఇందిరా గాంధీకీ జరిగింది! ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తుపెట్టుకున్నది చెత్తను మాత్రమే! ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు ఈనాటికీ ఎంతో ఉత్తేజభరితమైనది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్‌కు లేఖ రాయడం అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం. అయినప్పటికీ నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యాయంగా తిరస్కరిస్తున్నాం. ఒకవేళ నేటికీ ఆమె సజీ వంగా ఉండి ఉంటే, తన 106 ఏళ్ల వయసులో ఉండేవారు (నవంబర్ 19న జయంతి). ఆమె హత్యకు గురయ్యారన్న నాలుగు దశాబ్దాల నాటి వాస్తవం నేడొక వెలిసిపోయిన జ్ఞాప కంగా మాత్రమే మిగిలినప్పుడు ఇందిరాగాంధీని నేనిలా గుర్తు చేసుకోవడం చిత్రమైన సంగతే. అయితే సఫ్దర్‌జంగ్ రోడ్డులోని ఆమె స్మారక చిహ్నాన్ని సందర్శించే అసంఖ్యాక జనసమూహానికి అదొక పర్యాటక ఆకర్షణ. తక్కిన మనందరికీ గతించి పోయిన కాల శకలం. ఎమర్జెన్సీ (అత్యవసర పరి స్థితి) తప్ప, మరేదీ మన మదిలో లేనిది. తొలిసారి నేనామెను నిబిడాశ్చర్యంతో చూశాను. అది 1975. ఎమర్జెన్సీ పరిస్థితులు పరా కాష్ఠకు చేరుకుని ఉన్న సమయం. నిజానికి నేనొక పురుషాధిపత్య స్వభావం కలిగిన ఒక మహిళను చూడబోతున్నాననే అనుకున్నాను. కానీ ఆమె సొగసుగా, స్నిగ్ధంగా ఉన్నారు. ఆమెలో నాకు అత్యంత స్పష్టంగా గుర్తున్నవి ఆమె చేతులు. అవి సన్నగా, కోమలమైన ఆకృతిని కలిగి ఉన్నాయి. ఒక నియంతలో అవి నేను ఊహించనివి. అప్పటికి నాలుగేళ్ల క్రితం ‘ది ఎకనమిస్ట్’ ఆమెను భారత సామ్రాజ్ఞి అని అభివర్ణించింది. ఆమె మణికట్టుకు మగవారి చేతివాచీ ఉన్నప్పటికీ ఒక రాకుమారిలోని సౌకుమార్యం ఆమెలో ఉట్టిపడుతూ ఉంది. అయినప్పటికీ ఆమె అతి సామాన్యంగా ఉండేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఒక ఆదివారం నేను, మా అక్కచెల్లెళ్లు... గాంధీలతో కలిసి రాష్ట్రపతి భవన్లో ‘ద పింక్ పాంథర్’ను చూసేందుకు వెళ్లడానికి ముందు అంతా కూర్చొని అల్పాహారం తీసుకుంటూ, పూర్తిగా మాటల్లో మునిగిపోయాం. శ్రీమతి గాంధీ ఒక్క ఉదుటన ‘‘పదండి, పదండి...’’ అనేంత వరకు కూడా సమయం మించిపోతున్నట్లు మేము గమనించనే లేదు. ‘‘ఇప్పటికే మనం లేట్ అయ్యాం. ఎవరైనా ఒకటికి వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లిరండి’’ అని కూడా ఆమె అన్నారు. అప్పుడు మా ప్రమీలక్క, ‘‘ప్రచారంలో ఉండగా ఒకటికి వెళ్ల వలసి వచ్చినప్పుడు మీరేం చేశారు?’’ అని శ్రీమతి గాంధీని అడి గారు. మా మాటకు ఆమె... ‘‘రాత్రి పడుకునే ముందు చివరిగా నేను చేసే పని కడుపునిండా నీళ్లు తాగడం. దాంతో ఉదయానికంతా నా సిస్టమ్ ఖాళీ అయిపోతుంది. తర్వాత ఒకటికి వెళ్లే అవసరమే ఉండదు’’ అని చెబుతూ, ‘‘మగవాళ్లలా నేను చెట్టు వెనక్కు వెళ్లలేను కదా’’ అని నవ్వారు. ఏమైనా సీజర్ విషయంలో జరిగినట్లే, ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తు పెట్టుకున్నది చెత్తను మాత్రమే! నా జ్ఞాపకాలలో 1971 డిసెంబర్ 16 నాటి ఉత్తేజం నేటికింకా స్పష్టంగా ఉంది. ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు అది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్‌కు లేఖ రాసినప్పుడు అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం ఇచ్చారని నా పదహారేళ్ల వివే చనకు అనిపించింది. నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యా యంగా తిరస్కరిస్తున్నాం. విదేశాలలో ఇందిరా గాంధీ నెలకొల్పిన భారతదేశ ప్రతిష్ఠను చూసి గర్వించిన తరం నాది. 1960ల మధ్యలో లిండన్ జాన్సన్ పక్కన చక్కటి దుస్తులలో, తీరుగా కత్తిరించిన ఒత్తయిన జుత్తుతో ఇందిరా గాంధీ నిలబడి ఉండగా ఫొటో తియ్యడం ఆ ఫొటోగ్రాఫర్ జన్మకు ధన్యత అనే చెప్పాలి. శ్వేతసౌధం పచ్చిక బయళ్లలో తీసిన ఆ ఫొటోల కంటే మెరుగ్గా మళ్లీ ఎవరైనా తియ్యడం అసాధ్యం అను కున్నాను. అయితే అది 1982లో లండన్‌లో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో నేను ఆమెను చూసేంత వరకే! ఆ కార్యక్రమంలో మార్గరెట్ థాచర్‌తో కలిసి నడుస్తున్నప్పుడు ఇందిరా గాంధీ ఆహా ర్యాన్ని చూసి ప్రేక్షకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. జామావర్ షాల్‌తో తయారైన అద్భుతమైన కోటును ధరించి ఉన్నారామె. ఆమెను అలా చూసి నా మనసు పాఠశాల రోజు లలో నేను చదువుకున్న ఎనోబార్బస్ వర్ణనను గుర్తు చేసింది. ‘‘వయసు ఆమెను వడలిపోనివ్వదు. సంప్రదాయం ఆమె అనంతమైన వైవిధ్యాన్ని నశించ నివ్వదు’’ అంటాడు ఎనోబార్బస్, క్లియో పాత్ర గురించి! 1977లో ఇందిరా గాంధీ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి కారణం ఏమిటి? బహుశా అది ఆమె గురించి ఎప్పటికీ విడివడని ముడి కావచ్చు. ఆ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఏమీ లేకపోవచ్చు. కానీ వాటిని వాయిదా వేయగల సామర్థ్యం ఆమెకు లేకపోతే కదా! ఎన్నికలకు ఆమెను బలవంతం చేసే బయటి శక్తులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఆమె తన మనస్సాక్షి ప్రకారం ముందుకు వెళ్లారని అనుకోవాలా? లేక ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెలో పశ్చాత్తాపం కలిగిందా? లేదంటే, ఎమర్జెన్సీ చాలా కాలం సాగిందన్న విషయాన్ని ఆమె అంగీకరించి ఉంటారా? వేర్వేరు వ్యక్తులు ఈ ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్కటి కూడా సబబైన జవాబుగా అనిపించదు. నిజానికి ఇంకా లోతైన ప్రశ్న ఉంది. ఆ ఎన్నికలలో తను విజయం సాధించగలనని ఆమె భావించి ఉంటారా, లేదా తనొక ఘోర పరాజయం వైపు వెళుతున్నానన్న అవగాహనను ముందే కలిగే ఉన్నారా? జరగబోయేదేమిటో తెలిసి కూడా విధిని ఆమె స్వాగతించారా? అది తనకు తను విధించుకున్న శిక్షా? ఎమర్జెన్సీ అనే పాపానికి చేసుకున్న పరిహారమా? ఇందిరా గాంధీ తర్వాత కూడా మనకు బలమైన పాలకులు వచ్చారు. చక్కటి వస్త్రధారణతో మనల్ని ముగ్ధుల్ని చేసిన అనేకమంది ప్రధానులూ ఉన్నారు. అందరిలోకి ఇందిరా గాంధీ ఒక్కరే ప్రత్యేకమైన వారిగా ఎందుకు నిలిచారు? బహుశా అలా అనిపించడం యవ్వనంలోని జ్ఞాపకాలు జమ చేసుకుని ఉంచుకున్న అవ్యక్త గతానుభూతులు ప్రతిధ్వనించడం వల్లనా? మనోవైజ్ఞానిక నిపుణులు, తత్త్వవేత్తలు దీనికి మెరుగైన వివరణ ఇవ్వగలరనుకుంటాను. నేను చెప్పగలిగింది మాత్రం ఒక్కటే – అలాగని ఏదో చెప్పాలని చెప్పడం కాదు – నేను ఏమనుకుంటానంటే ఆమెలో ఏదో లేకుండానైతే లేదని! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
1971 ఇండియా–పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు!: ఒక్కడున్నాడు
సైనికుడిగా సరిహద్దుల్లోసేవలందించడం విద్యార్థులుగా చాలామంది కల. ఆ కలను నిజం చేసుకున్నారు ఇద్దరు మిత్రులు. యుద్ధంలో పాల్గొనడం ప్రతి సైనికుడి ఆశయం. ఆ ఆశయంలోనూవాళ్లు పాలుపంచుకున్నారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే... ఇంకొకరు ఆ మిత్రున్ని ఇలా స్మరించుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విమోచనలో భాగంగా జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండాయి. ఆ యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 11 మంది అధికారులు ఉన్నారు. వారిలో మాజీ కల్నల్ డాక్టర్ వీఆర్కే ప్రసాద్, అమరుడైన సెకండ్ లెఫ్ట్‌నెంట్ విక్రమ్ బర్న్ అప్పలస్వామి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో పట్టభద్రులయ్యారు. సికింద్రాబాద్‌లో నివసిస్తూ ప్రస్తుతం రెండు ప్రైవేట్ వర్సిటీలకు వీసీగా సేవలు అందిస్తున్న వీఆర్కే ప్రసాద్ ఆప్తమిత్రుడైన విక్రమ్ గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... మాణిక్ షాకు లేఖ రాసిన విక్రమ్... విక్రమ్ బర్న్ అప్పలస్వామి, నేను హిమాయత్‌నగర్, నారాయణగూడల్లోని పక్కపక్క కాలనీల్లో నివసించే వాళ్లం. నిజాం కాలేజీలో 1967–69 మధ్య బీఎస్సీ పూర్తి చేశాం. ఆర్మీలో చేరాలనే ఉత్సుకతతో ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్నోసార్లు ఇంటర్వ్యూల వరకు వెళ్లినా విజయం సాధించలేదు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక బలంగా ఉందని, అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం వరించట్లేదని విక్రమ్ అప్పటి ఆర్మీ జనరల్ మాణిక్ షాకు ఓ లేఖ రాశారు. దీన్ని చూసిన మాణిక్ షా తన అధికారిక లెటర్ హెడ్‌పై ‘నిరాశ పడకుండా ప్రయత్నించు. నీ పట్టుదల చూస్తుంటే కచ్చితంగా సాధిస్తావనే నమ్మకం ఉంది’ అని ప్రత్యుత్తరం రాశారు. దాంతో విక్రమ్ మరెంతో స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత ఇద్దరం ఎంపికయ్యాం. విక్రమ్ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో, నేను కోర్ ఆఫ్ సిగ్నల్స్‌లో (టెలిమ్యూనికేషన్స్ బ్రాంచ్) బాధ్యతలు తీసుకున్నాం. సెకండ్ లెఫ్ట్‌నెంట్ హోదాలో విక్రమ్ «గుజరాత్లో దరంగ్‌ధరలోని ఫీల్డ్ రెజిమెంట్‌లో, నేను పఠాన్‌కోట్ సిగ్నల్ రెజిమెంట్‌కు వెళ్లాం. అప్పట్లో ఉత్తరప్రత్యుత్తరాలు, గ్రీటింగ్ కార్డుల ద్వారా మాత్రమే మా మధ్య సమాచార మార్పిడి జరిగేది. ఎయిర్ బేస్‌లపై ఏక కాలంలో దాడులు.. 1971 సెప్టెంబర్ నుంచి యుద్ధవాతావరణం నెలకొంది. డిసెంబర్ 3న పఠాన్‌కోట్ కమ్యూనికేషన్ సెంటర్లో విధుల్లో ఉన్నా. సాయంత్రం 5.45కి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. బయటకు వెళ్లి చూస్తే అక్కడి సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ పొగలు కక్కుతోంది. ఆరా తీస్తే పాకిస్థాన్ యుద్ధ విమానాలు ఓ బాంబు వేసి వెళ్లాయని చెప్పారు. అది మొదలు పఠాన్‌కోట్, ఆగ్రా, గ్వాలియర్.. ఇలా ఉత్తరాన ఉన్న ఎయిర్‌ఫీల్డ్స్‌పై ఒకేసారి ఎయిర్ ఎటాక్ జరిగింది. దీన్ని మన బలగాలు సమర్థంగా తిప్పి కొట్టాయి. డిసెంబర్ 16 సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మధ్యలోనే విక్రమ్‌కు ఓ లేఖ రాశాను. అయితే యుద్ధం నేపథ్యంలో అది పోస్టు చేయడం సాధ్యం కాలేదు. ఆ నెలాఖరు వరకు విక్రమ్‌నుంచి ఎలాంటి సమాచారం లేదు. క్రిస్ట్మస్, న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో విక్రమ్ కోసం గ్రీటింగ్ కార్డులు సిద్ధం చేసే పనిలో ఉన్నా. నిజాం కాలేజీకే గర్వకారణం.. ఈ లోపు మా సిగ్నల్స్ ఛానల్లో ఓ పిడుగులాంటి వార్త వచ్చింది. విక్రమ్ బర్న్ అప్పలస్వామి యు ద్ధంలో చనిపోయారు. అసలు ఏం జరిగిందనేది ఎంతో శోధించి తెలుసుకున్నా. అప్పట్లో విక్రమ్ వాళ్ల రెజిమెంట్‌కు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈయన వాహనం కమాండింగ్ ఆఫీసర్ వాహనం వెనుకే ఉంటుంది. డిసెంబర్ 5న ఈ జీపు రాజస్థాన్‌లోని బర్మేర్ సెక్టార్లో శత్రు సైన్యం ఏర్పాటు చేసిన ఓ యాంటీ ట్యాంక్ మైన్ మీద నుంచి వెళ్లింది. ఆ పేలుడు ధాటికి విక్రమ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ 9న కన్ను మూశారు. తర్వాత జమ్మూ నుంచి జోథ్‌పూర్ బదిలీ అయ్యా. అప్పుడు విక్రమ్ తల్లిదండ్రుల కోరిక మేరకు సెలవుపై వెళ్లి విక్రమ్ అంత్యక్రియలు నిర్వహించిన పాస్టర్‌ను కలిశాను. ఆయన చెప్పిన వివరాలతో వెళ్లి సమాధిని గుర్తించి నివాళులర్పించా. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ వచ్చా. నిజాం కాలేజీకే గర్వకారణమైన విక్రమ్ ఫొటోను ఆ కాలేజీలో పెట్టించా. ఇప్పటికీ ఏటా విక్రమ్ సంస్మరణ లెక్చర్ ఇస్తున్నా. వీఆర్కే ప్రసాద్ -
భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: మేమున్నాం!!
డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం..బాంబుల భయంతో వణుకుతున్న ఊరు. బాంబులు కురిసినా సరే దేశం కోసం చనిపోయినా పరవాలేదనే సాహసోపేత నిర్ణయం. ‘మేమున్నాం’ అంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది వీర నారీమణుల తెగువ. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్ పునరుద్ధరణ. ప్రాణాలకు తెగించి మరీ దేశభక్తిని చాటుకున్న వైనం! అంతేనా.. ప్రభుత్వ అవార్డు సొమ్మును దానం చేసిన దాతృత్వం.. జయహో.. వీరమహిళలు!! చలి పులిలా విజృంభిస్తుంది. కాని ఆ ఊరు చలితో కాదు ‘బాంబుల భయం’తో వణికిపోతుంది. అందరూ ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. పాకిస్థాన్ జెట్స్ భుజ్ (కచ్ జిల్లా, గుజరాత్)లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై బాంబులు వేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించడానికి భారత వైమానిక దళం బీఎస్ఎఫ్ జవాన్ల సహాయం కోరింది. పునరుద్ధరణ తక్కువ సమయంలో జరగాలంటే ఎక్కువమంది శ్రామికులు కావాలి. వారిని వెదికిపట్టి తీసుకురావడానికి సమయం లేదు. దగ్గరి గ్రామాల్లోని వారి సహాయం కోరాలి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న ఆ సమయంలో ఎవరు బయటకు వస్తారు? వచ్చినా సహాయపడతారా?రకరకాల సందేహాలను పటాపంచలుచేస్తూ... ఒక్కరు కాదు ఇద్దరు కాదు మాదపూర్ గ్రామానికి చెందిన 300 మంది స్త్రీలు ‘మేమున్నాం’ అంటూ ముందుకువచ్చారు. పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం నాటి దృశ్యం ఇది. ఆనాటి భుజ్ ఎయిర్ బేస్‌ను పునర్నిర్మించిన 300 మంది మహిళలను సగౌరవంగా గుర్తు తెచ్చుకుంటుంది ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రం. (అజయ్ దేవ్‌గణ్, సంజయ్‌దత్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వోటీటీలో విడుదలైంది) ఈ నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు ఆసక్తికరంగా మారాయి. ‘చనిపోయినా సరే, దేశం కోసం చనిపోయాను అనే తృప్తి మిగులుతుంది...అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని పనిలోకి దిగాము’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది సెఘాని అనే మహిళా యోధురాలు. ఆ 300 మంది మహిళలలో ఒకరైన హిరూ బుదియాలో మొదట ఒక సందేహం...‘వెళుతున్నాను సరే, కూలిపని తప్ప నాకు ఏది తెలియదు. నేను చేయగలనా?’ఆ తరువాత భయం... ‘పనిలో ఉండగా పై నుంచి బాంబులు పడితే... ఇంకేమైనా ఉందా!’తనలోని ధైర్యానికి, సందేహాలతో కూడిన భయానికి మధ్య ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాని చివరికి ధైర్యమే గెలిచింది. దేశభక్తి గొప్పతనం అదే కదా! (చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్ఫిట్, ట్వీట్ వైరల్) ‘చిన్నచిన్న విషయాలకే భయపడే నాకు అంతధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది’ అని ఆరోజును గుర్తు తెచ్చుకుంటుంది వీరు లఖాని. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్‌ను పునరుద్ధరించే పని పూర్తయింది.యుద్ధం పూర్తయిన తరువాత గ్రూప్ అవార్డ్‌గారూ. 50,000 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వీరమహిళలు. -
పండుగలో పగ మాటేల!
రెండో మాట వర్ధమాన దేశాలకు పెద్ద బెడదగా మారిపోయిన ఉగ్రవాదాన్ని నిరోధించడం అనివార్యం. అందుకు ముందుగా జరగవలసినదేమిటి? ఉగ్రవాదం పెరిగి పోవడానికి కారణమైన దాదాపు 125 దేశాలలో ఉన్న అమెరికా సైనిక, వైమానిక కేంద్రాలను ఉపసంహరించు కోవాలి. బాండుంగ్ సమావేశంలో భారత్ సహా, వర్ధమాన దేశాలు ప్రవచించి, ఆచరణలోకి తెచ్చిన పంచశీల సూత్రాలను పునరుద్ధరించాలి. దీనితో పాటు, చాలాకాలం పాటు ఇరు దేశాలు పాటించిన తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలను తిరిగి గౌరవించాలి. ‘ఈ విజయదశమి దేశానికి అందివచ్చిన ప్రత్యేక పండుగ. ఈ పండుగ దుష్టశక్తి మీద మంచి సాధించే విజయచిహ్నం. అదే ఈ ఏడాది దసరా ప్రత్యేకత అని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సభలో ప్రకటించారు. అయితే ఆయన భారత్–పాక్ సరిహద్దులలో నెలకొన్న నియంత్రణ రేఖ పొడవునా ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం జరిపిన మెరుపుదాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ ప్రకటన చేశారు.’ దిహిందూ (10–10– 16) ‘కశ్మీర్ సమస్య మీద అమెరికా వైఖరిలో మార్పులేదు. కానీ ఆ సమస్యను భారత్,పాక్ దేశాలే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇండియా ప్రపంచ స్థాయి చర్చలలో పాల్గొనాలంటే ముందు పాకిస్తాన్‌తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలి’(8వ తేదీన అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు చేసిన ప్రకటన) ప్రపంచంలో ఎక్కడైనా పండుగలు జరుపుకునేది ప్రజల మధ్య శాంతి కోసం. ఇరుగుపొరుగుల సయోధ్యతో సౌభాగ్య సంపదలను పెంచుకోవా లనే. అంతేకానీ, శాంతికోసం యుద్ధం; యుద్ధాల కోసం యుద్ధం అన్న తీరులో పండుగలు జరగవు. జరపకూడదు. ఈ దృష్ట్యా ప్రధాని మోదీ పొరుగు దేశం గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ విజయదశమి పండుగకు చెప్పిన కొత్త భాష్యం అపార్థాలకు దారితీసే విధంగా ఉంది. పఠాన్‌కోట్, ఊరిలపై జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత దాడుల పుట్టుపూర్వోత్తరాల గురించి, అవి జరిగిన తీరు గురించి మన రక్షణశాఖ గూఢచారులు విడుదల చేస్తున్న వివరాల మీద దేశంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ఉదంతాలలో సంభవించిన మరణాలు, క్షతగాత్రుల సంఖ్య గురించి కూడా స్పష్టత రాలేదు. ఈ వాస్తవ పరిస్థితికి తోడు మనకు ఈ అంశంలో అండాదండా ఇచ్చే ఇరుగుపొరుగు దేశాలు ఎన్ని? అన్న ప్రశ్న కూడా వినిపిస్తున్నది. నిజానికి భారత్, పాక్‌ల మధ్య చోటు చేసుకున్న యుద్ధాలూ, ఘర్షణల గురించి కన పడుతున్న ఆందోళన, వాటి పరిష్కారం విషయంలో కానరావడం లేదు. ఈ రెండు దేశాల ప్రభుత్వాల వైఖరీ, ఐక్యరాజ్యసమితి వేదికల మీద వినిపిస్తున్న మాటలూ, దక్షిణాసియా దేశాలలో జరుగుతున్న చర్చల సరళీ చూస్తే ఇదే భావన కలుగుతుంది. తాజా ఘర్షణల మీద ఆఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లా దేశ్లు మాత్రమే భారత్ తరఫున నిలబడనున్నట్టు ప్రకటనలు ఇచ్చాయి. శ్రీలంక తటస్థంగానే ఉంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి ఐదు అగ్రరాజ్యాలు– అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్– భారత్, పాక్ పాల కులను కశ్మీర్ సమస్యను ప్రత్యక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోమని చెబు తున్నాయి లేదా ఆదేశిస్తున్నాయి. ఈ రెండు దేశాల పాలకులు పద వులను రక్షించుకోవడానికీ, వాటిలో కొనసాగడానికీ పోటీ పడుతూ యుద్ధం ద్వారా, ఘర్షణల ద్వారా ప్రజా బాహుళ్యాల ప్రయోజనాలను దెబ్బ తీయడా నికి వెనుకాడడం లేదు. ఇందుకు కాంగ్రెస్, బీజేపీ కూడా మినహాయింపు కాదు. తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలు మరిచారా? 1947–48, 1965, 1971,1999 సంవత్సరాలలో నాలుగు పర్యాయాలు భారత్, పాక్‌ల మధ్య యుద్ధాలూ లేదా ఘర్షణలు జరిగాయి. ‘శత్రువు’ను ముగ్గులోకి లాగి చర్చల ద్వారా శక్తిహీనం చేసే సదవకాశం రెండు యుద్ధాల సమయంలో వచ్చింది కూడా. అందులో మొదటి అవకాశం లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో జరిగిన తాష్కెంట్ ఒప్పందం రూపంలోను, తరువాత ఇందిరాగాంధీ నాయకత్వంలో జుల్ఫీకర్ అలీ భుట్టోతో కుదిరిన సిమ్లా ఒప్పందం ద్వారానూ వచ్చాయి. ఇక వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమ యంలో నాటి పాక్ పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌తో ఆగ్రా ఒప్పందం చర్చల దాకా వచ్చి అర్థంతరంగా తెరమరుగైంది. కానీ ఇప్పటి సరిహద్దు ఘర్షణల అనంతర పరిస్థితిని చూస్తే ఐదో యుద్ధం గురించిన అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నది. ఉగ్రవాదం మీద ప్రపంచ వ్యాప్తంగా సమైక్యంగా యుద్ధం లేదా పోరాటం జరగవలసిందే. అదే సమయంలో ఇలాంటి తరహా ఉగ్రవాదులకు నారు పోసి పెంచిన ఘనత అమెరికా, బ్రిటన్ సామ్రాజ్యవాద దేశాలదేన న్న నగ్నసత్యాన్ని విస్మరించలేం. అమెరికాలో ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి, తరువాత అమెరికా పిలుపునకు భారత్ స్పందించిన తీరు కూడా మరువలేనివి. అయితే ఈ దాడి బయట నుంచి జరిగింది మాత్రం కాదనీ, ఇంటి గుట్టు అమెరికా పాలక వర్గానికి తెలిసిందేననీ ఆ దేశానికే చెందిన 1,500 మంది ఇంజనీర్ల బృందం ఘోషించింది. దీని మీద అంత ర్జాతీయ స్థాయి విచారణ జరగాలని కూడా ఆ బృందం కోరింది. బ్రిటన్‌లోను ఇలాంటి అభిప్రాయం లేకపోలేదు. ఆ విధ్వంస కాండ బయట నుంచి జరి గినది కానేకాదనీ, బుష్, టోనీ బ్లెయిర్ అందుకు కారకులనీ బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు కార్బిన్ కూడా అప్పుడు వ్యాఖ్యానించారు. టెర్రరిజం ఎక్కడో లేదు, దానితో వచ్చే ప్రమాదమంతా అమెరికా లోపలనే దాగి ఉందని ప్రసిద్ధ ఇండో–అమెరికన్ వ్యాఖ్యాత స్టీఫెన్ ఆల్తర్ కూడా చెప్పారు. ఇంత జరిగినా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాడు జార్జి డబ్ల్యూ బుష్ ఈ దాడినే ఒక సాకుగా ప్రచారం చేసుకున్నారు. ఏమీ రుజువులు లేకున్నా మొదటిగా ఆఫ్గానిస్తాన్, తరువాత ఇరాక్ పైన అమెరికా దాడులు చేయించింది. లక్షలాది మందిని చంపింది. అయినా బుష్ ఎన్నికలలో విజయం సాధించారు. ఫలితం ఇండియా సహా ఆఫ్రో–ఆసియన్ వర్ధమాన దేశాలు ఒక విషమ చక్ర బంధంలో చిక్కుకుపోయాయి. ఇప్పటికీ ఉగ్రవాదం మీద అంతర్జాతీయ యుద్ధం పేరుతో సాగుతున్న ఆ రాజకీయమే జాతీయ సరిహద్దులను అధిగ మించుతున్నది. అలాంటి రాజకీయం స్థిరపడుతోంది కూడా. భారత్, పాక్ వంటి వర్ధమాన దేశాలు అమెరికా పావులుగా మారడం ఇందులో భాగమే. అమెరికాను నమ్మడం పొరపాటు కాలం మారింది. సమస్య మాత్రం అలాగే ఉంది. ఉగ్రవాదం ఇంకాస్త పెరిగింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైఖరి ఉగ్రవాదం పట్ల ఆ దేశం అనుసరిస్తున్న వైఖరిని దారి మళ్లించడమంత పెద్ద పనికి అవకాశం కల్పించలేదు. ‘క్లింటన్, తరువాత ఒబామా కూడా అమెరికా సామ్రాజ్య విస్తరణకే ప్రాధాన్యం ఇచ్చారు. తన ప్రభుత్వానికి అంత పెద్ద ఇబ్బందేమీ ఉండదని భావించిన పక్షంలోనే ఒబామా ప్రత్యక్ష సైనిక జోక్యానికి దిగుతాడు. మరో దారి ఏదీ లేదని భావిస్తే లౌకిక దౌత్యానికి దిగుతాడు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనుకున్నప్పుడు పరోక్ష యుద్ధాలను ప్రోత్సహిస్తాడ’ని ప్రసిద్ధ పత్రికా రచయిత స్టాన్లీ జోహ్నీ చెబుతారు. భారత్, పాక్‌ల నడుమ యుద్ధాలు గానీ, ఘర్షణలు గానీ నాలుగు పర్యాయాలు సంభవించాయి. ఇప్పుడు తాజాగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. వీటి వల్ల ఉభయ దేశాలకు దక్కిన ఫలితం ఏమిటి? ఇందుకు సమాధానం అంత త్వరగా దొరకదు. కానీ ఒకటి నిజం. పాలకులలో రాచ రికపు పోకడలు ఇంకా పొడచూపుతూనే ఉన్నాయి. అవి అహానికి దారి తీసి ప్రజలను కష్టనష్టాలకు గురి చేస్తున్నాయి. అవి అలా కొనసాగుతున్నంత కాలం ప్రజలకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగలవు. మన ఉభయ దేశాల ప్రజ లకు దక్కిన ఫలితం ఇది మాత్రమే. అధీనరేఖ వద్ద నివశించే రైతుల మాటలే ఇందుకు తాజా ఉదాహరణ: వారు తమ గోడును ఇలా వివరించారు. ‘అవిభాజ్య భారతాన్ని విభజించి, పాకిస్తాన్‌ను సృష్టించినది లగాయితు సరి హద్దు ప్రాంతాలలో నివసించే వారందరినీ సమస్యలు చుట్టుముట్టాయి. విభజనకు ముందు ఈ సమస్యలు లేవు. విభజనానంతరం ఏర్పడిన సరి హద్దు అధీన రేఖ వెంట (హమీర్పూర్ వంటి గ్రామాలలో) స్థిరపడిన ప్రజలు ఆ ప్రాంతాల నుంచి నిరంతరం ఉద్వాసనకు గురవుతూనే ఉన్నారు. ఇండో– పాక్ యుద్ధాలూ, ఘర్షణల ఫలితమే అక్కడి ప్రజల వలస. మా పొలాలు, పంటలు విడిచి పెట్టవలసి రావడంవల్ల మాకు ఎంత నష్టమో తేల్చలేం’ (మాజీ సైనికుడు బల్జిత్సింగ్, రైతులు సూరంచంద్, లఖన్సింగ్ ఇచ్చిన వాంగ్మూలాలు. ఇవి ఈ నెల ఏడున వార్తలుగా వచ్చాయి). బాండుంగ్ ఆదేశాలు పాటించాలి వర్ధమాన దేశాలకు పెద్ద బెడదగా మారిపోయిన ఉగ్రవాదాన్ని నిరోధించడం అనివార్యం. అందుకు ముందుగా జరగవలసినదేమిటి? ఉగ్రవాదం పెరిగి పోవడానికి కారణమైన దాదాపు 125 దేశాలలో ఉన్న అమెరికా సైనిక, వైమా నిక కేంద్రాలను ఉపసంహరించుకోవాలి. బాండుంగ్ సమావేశంలో భారత్ సహా, వర్ధమాన దేశాలు ప్రవచించి, ఆచరణలోకి తెచ్చిన పంచశీల సూత్రా లను పునరుద్ధరించాలి. దీనితో పాటు, చాలాకాలం పాటు ఇరు దేశాలు పాటించిన తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలను తిరిగి గౌరవించాలి. ఇవేం చెబుతున్నాయి: ‘భారత్, పాక్‌లు ఐక్యరాజ్య సమితి ప్రణాళికకు అను గుణంగా ఉభయత్రా సుహృద్భావంతో మంచి ఇరుగు పొరుగు సంబంధా లను ఏర్పరుచుకోవడానికి ఉభయ దేశాల నాయకత్వాలు సర్వ ప్రయత్నాలు చేయడానికి సమ్మతిస్తున్నాం. ఎలాంటి బల ప్రయోగానికి దిగబోమనీ, వివా దాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామనీ, ఐక్యరాజ్య సమితి ప్రణా ళికకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి బలప్రయోగానికి దిగబోమనీ పూచీ పడుతున్నాం. ఇంతవరకు ఉభయ దేశాల సంబంధాలకు విఘాతం కలిగించిన ఘర్షణలకు స్వస్తి చెబుతామని హామీపడుతున్నాం. ఉభయుల ప్రాదేశిక సమగ్రతను, స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ పరస్పరం దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించాం.’ కాబట్టి పాత పగలను గుర్తు చేయడానికి పండుగలను వాడు కోవడం సరికాదు. ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంట ఉన్న ప్రజలు పడుతున్న ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని భారత్, పాకిస్తాన్ పాలకులు తాష్కెంట్, సిమ్లా సంధిపత్రాల ఆదేశాన్ని అక్షరాలా అమలు చేయడానికి అహంకారాలకు పోకుండా తక్షణం ఉపక్రమించాలి. (వ్యాసకర్త : ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in) -
వీరులకు శాల్యూట్
నేడు కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో గుడివాడ సిపాయి గోవిందరావు భోగాపురం: భారత్–పాకిస్తాన్ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. అన్నిసార్లు దాయాదికి అవమానాలే మిగిలాయి. అవన్నీ ఒక ఎత్తు.. కార్గిల్ యుద్ధం మరో ఎత్తు. ఈ యుద్ధం.. పాకిస్తాన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చాటింది. అరవై రోజులు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న ముగిసింది. ఎందరో వీరసైనికుల బలిదానంతో భారత్ విజయం సాధించింది. కార్గిల్ కొండల్లో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. భారత్ విజయాన్ని పురస్కరించుకుని ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న విజయనగరం జిల్లా వీరసైనికుల విజయగాథపై కథనమిది. దేశరక్షణ విధులకు ఎంపిక గుడివాడ గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి దేవి అప్పన్న కుమారుడు దేవి గోవిందరావు. పులి కడుపున పులే పడుతుందంటారు. తండ్రి వారసత్వ లక్షణం కుమారుడికీ అబ్బింది. సైన్యంలో పనిచేయాలన్న ఆకాంక్ష రగిలింది. ఫలితంగా దేశరక్షణ విధులకు ఎంపిక చేసింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొనే అవకాశం గోవిందరావుకు కలిగింది. ఈ సందర్భంగా శత్రు సైనికులు పేల్చిన తూటా తగిలి వారం రోజులు కోమాలో ఉండి ఎట్టకేలకు ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం చండీఘడ్‌లో నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేవి గోవిందరావును ఫోన్లో సంప్రదించినప్పుడు ఎన్నో విశేషాలను పంచుకున్నారు. వీరోచితంగా పోరాడాం: గోవిందరావు కార్గిల్ యుద్ధం గురించి మీరు గుర్తుచేయగానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. యుద్ధంలో మా బందం వీరోచితంగా పోరాడింది. కానీ ప్రత్యర్థి పేల్చిన తూటాలకు నా కుడి భుజం, కుడి మెడభాగంలో బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో పడిపోయాను.. అంతే తెలివి లేదు. వారం రోజులు తరువాత తెలివొచ్చింది. నాకు తూటాలు తగిలి పడిపోగానే చనిపోయానని నా సహచరులు చనిపోయానని అనుకున్నారట. ప్రత్యర్థుల దాడి ముగిసిన అనంతరం చూడగా బతికి ఉన్నానని గమనించి ఆసుపత్రికి చేర్చారట. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియనివ్వలేదు. నాకు మెడవద్ద నరం తెగిపోవడంతో తొడలో నరం తీసి అమర్చారు. తూటా తాలూకా వ్యర్థం ఇంకా నా మెడలోనే ఉంది. దానివల్ల చలికాలంలో ఇబ్బంది పడుతుంటాను. ప్రస్తుతం చండీఘడ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాను. భారత్ తరపున యుద్ధం చేయడం చెప్పలేని అనుభూతి. గర్వకారణం: నారాయణమ్మ కార్గిల్ యుద్ధంలో నా కొడుకు గోవిందరావు గాయపడిన విషయం తెలియనివ్వలేదు. వారం రోజులు కోమాలో ఉండి బతికి బయటపడ్డాడు. కోలుకున్నాక సెలవులో ఇంటికి వచ్చినప్పుడు చెబితే తెలిసింది. దీంతో అంతా ఒక్కసారిగా భయపడ్డాం. కానీ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశరక్షణకు నా కొడుకు యుద్ధంలో పాల్గొనడం మాకు గర్వంగా ఉంది. -
ఆర్బీఐ కొత్త రూ.5 నాణెం!
ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అతి త్వరలో కొత్త రూ.5 నాణేలను మార్కెట్లోకి తీసుకురానుంది. 1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నాణేలను ముద్రిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నాణెంలో ఒకవైపు అశోక స్తంభపు లయన్ క్యాపిటల్ మధ్యలో ఉండి, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. మరొకవైపు ‘అమర్ జవాన్’ స్మారక చిహ్నం మధ్యలో ఉండి దానికి ఇరువైపుల ఆలివ్ కొమ్మ ఆకులు, కింది భాగంలో 2015 అని సంవత్సరం పేరు ఉంటుంది. -
భార్యే గుర్తు పట్టలేదు...
యుద్ధంలో ప్రత్యక్షదాడులు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే జరుగుతుంటాయి. రాత్రిళ్లయితే ఎయిర్‌క్రాఫ్ట్స్ తిరగవు. బాంబింగ్ చేయలేవు కాబట్టి. ఇదో సూత్రం. ఇలాంటి వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సాహసాలతో పద్దెనిమిది రోజులు ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న విశ్రాంత సైనికాధికారి కల్నల్ ఆర్.కె.విశ్వనాథరెడ్డి అనుభవాలు ఈవారం... నేను రక్షణ రంగంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా 1967లో చేరాను. నా మొదటి పోస్టింగ్ హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో. ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకు ఇండో-పాక్ యుద్ధం జరిగింది. అది 1971 డిసెంబర్ మూడవ తేదీ. భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న సమాచారంతో మా రెజిమెంట్ పంజాబ్ సరిహద్దుకు చేరింది. 45 యుద్ధ ట్యాంకులను ప్రత్యేక రైళ్లలో తరలించాం. హుస్సేనీవాలా వంతెన మీద దాడి జరగబోతోందనీ, ఆ వంతెనను పరిరక్షించమనీ ఆదేశాలు వచ్చాయి. అప్పుడు సమయం సాయంత్రం ఆరు. ఇండియా- పాక్ మధ్య భూభాగంలో అది ఏడు కిలోమీటర్ల స్ట్రెచ్. పాక్ ఫిరంగిదళాలు మన వైపు వస్తున్నాయి. మన దళాలు ఆ దాడులను ఎదుర్కొంటూ ప్రతి దాడులు చేస్తున్నాయి. ట్యాంకుల మీద పదాతిదళ సైనికులను కూడా మోహరించాం. చుట్టూ చీకటి. వంతెనకు సమీపంలో పేలోడ్ పాయింట్ దగ్గర మా బృందం విస్తరించింది. ట్యాంకు సిబ్బంది 15 కిలోమీటర్ల వార్ ఫ్రంట్‌కు సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్నీ రేడియో కమ్యూనికేషన్ ద్వారా గ్రహిస్తోంది. యుద్ధంలో ఈ సమాచారం కీలకం. సిబ్బంది ఎక్కడ ఏ చిన్న స్విచ్‌ను పొరపాటుగా వాడినా సమాచారానికి దారి మూసుకుపోతుంది. వంతెనకు సమీపంలో అందరం ట్యాంకుల నుంచి దిగి పొజిషన్ తీసుకున్నాం. రెండు రోజులు తీక్షణంగా గస్తీ కాశాం. వంతెన రక్షణ కోసం ఏకంగా ఒక రెజిమెంటే దిగిందన్న సమాచారం పాక్‌కు చేరింది. దాంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇంతలో- ‘ఇక పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లండి’ అని కొత్త ఆదేశాలు వచ్చాయి. దానికోసం మేము సట్లెజ్ నది దాటాలి. అప్పటికప్పుడు ఇంజనీర్లు కాంక్రీట్ మిక్స్, ఇతర మెటీరియల్ పడవల్లో తెచ్చి మూడు గంటల్లో వంతెన కట్టేశారు. మేము పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి వారి బంకర్లను పేల్చి, ఆ ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నాం. బంకర్‌ను పేల్చడం ద్వారా ప్రత్యర్థిని నిస్సహాయుణ్ని చేయవచ్చు. అది ఒక వ్యూహం. మొత్తం 18 రోజులు యుద్ధరంగంలో ఉన్నాను. యుద్ధం మొదలైన మూడు రోజులకు నా పై అధికారి మేజర్ బల్దేవ్సింగ్ భావా గాయపడ్డారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి మళ్లీ యుద్ధంలో పాల్గొన్నాను. భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత మమ్మల్ని రాజస్థాన్ కరణ్‌పూర్‌లోని నాగిపోస్టుకు బదిలీ చేశారు. అప్పటికి నాకు పెళ్లయి రెండవ నెల. నా భార్య చిత్రను ఢిల్లీలో వాళ్ల అక్కగారింట్లో వదిలి యుద్ధానికి వెళ్లాను. యుద్ధం ముగిశాక చిత్రకు ఉత్తరం రాశాను. నా భార్యకు నేను రాసిన తొలి ఉత్తరం అది. ఆ ఉత్తరం ఆవిడకు చేరిందో లేదో... పాక్ సైన్యం రాజస్థాన్‌లోని ఇసుక దిబ్బలను ఆక్రమించింది. ఆ ఆపరేషన్‌ను నిర్వహించమని ఆదేశాలందాయి. యుద్ధంలో వేడుకలు! పోస్ట్‌లో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో నూతన సంవత్సరం వచ్చింది. సెలబ్రేషన్స్ కోసం కొంత విరామం తీసుకుందామని మా పై అధికారి ప్రతిపాదించారు. అదే ప్రతిపాదనను మైక్‌లో పాక్ సైనికులనుద్దేశించి ప్రకటించారు. వాళ్లు కూడా ఒప్పుకుని ఆ రాత్రి దాడులు ఆపేశారు. తిరిగి ఉదయం ఏడు గంటల నుంచి యథావిధిగా ప్రత్యర్థులుగా మారిపోయాం. ఫోర్ పారా బెటాలియన్, నైన్ పారా ఫీల్డ్ రెజిమెంట్‌లో పాల్గొని మన ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ ప్రయత్నంలో 60 మందికి గాను ఏడుగురు చనిపోయారు. ఆ వివరాలు వార్తా పత్రికల్లో అచ్చయ్యాయి. దాంతో ఇంట్లో వాళ్లకు ఒకటే భయం. మిలిటరీ పోస్టుకు వెళ్లి ఆ ఏడుగురిలో నా పేరు లేదని నిర్ధారించుకున్న తర్వాత స్థిమితపడింది చిత్ర. ఇదంతా నాకప్పుడు తెలియదు. నాగిపోస్టు ఆపరేషన్ పూర్తయిన వెంటనే చిత్రకు ఉత్తరం రాద్దామనుకున్నప్పటికీ ఉత్తరం కంటే ముందు నేనే చేరుకుంటాను కదా అని నేరుగా బయల్దేరాను. ఢిల్లీ చేరుకుని పాలం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మా వదిన గారింటికి వెళ్లాను. అక్కడ నేను ఏ మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది. చిత్ర నన్ను గుర్తు పట్టలేదు. గడ్డకట్టే మంచు, ఎడారి జీవనంతో రంగు తగ్గిపోయి, సన్నబడి, పెళ్లి నాటి రూపంతో పోలిక లేకుండా మారిపోయానని నేను కూడా అప్పుడే గ్రహించాను. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి