1971 ఇండియా–పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు!: ఒక్కడున్నాడు | Former Colonel VRK Prasad Reminds For Indo Pak War | Sakshi
Sakshi News home page

1971 ఇండియా–పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు!: ఒక్కడున్నాడు

Published Fri, Dec 17 2021 12:10 PM | Last Updated on Fri, Dec 17 2021 12:47 PM

Former Colonel VRK Prasad Reminds For Indo Pak War - Sakshi

విక్రమ్‌ బర్న్‌

సైనికుడిగా సరిహద్దుల్లోసేవలందించడం విద్యార్థులుగా చాలామంది కల. ఆ కలను నిజం చేసుకున్నారు ఇద్దరు మిత్రులు. యుద్ధంలో పాల్గొనడం ప్రతి సైనికుడి ఆశయం. ఆ ఆశయంలోనూవాళ్లు పాలుపంచుకున్నారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే... ఇంకొకరు ఆ మిత్రున్ని ఇలా స్మరించుకుంటున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌ విమోచనలో భాగంగా జరిగిన భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండాయి. ఆ యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 11 మంది అధికారులు ఉన్నారు. వారిలో మాజీ కల్నల్‌ డాక్టర్‌ వీఆర్కే ప్రసాద్, అమరుడైన సెకండ్‌ లెఫ్ట్‌నెంట్‌ విక్రమ్‌ బర్న్‌ అప్పలస్వామి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో పట్టభద్రులయ్యారు. సికింద్రాబాద్‌లో నివసిస్తూ ప్రస్తుతం రెండు ప్రైవేట్‌ వర్సిటీలకు వీసీగా సేవలు అందిస్తున్న వీఆర్కే ప్రసాద్‌ ఆప్తమిత్రుడైన విక్రమ్‌ గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే...  

మాణిక్‌ షాకు లేఖ రాసిన విక్రమ్‌... 
విక్రమ్‌ బర్న్‌ అప్పలస్వామి, నేను హిమాయత్‌నగర్, నారాయణగూడల్లోని పక్కపక్క కాలనీల్లో నివసించే వాళ్లం. నిజాం కాలేజీలో 1967–69 మధ్య బీఎస్సీ పూర్తి చేశాం. ఆర్మీలో చేరాలనే ఉత్సుకతతో ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్నోసార్లు ఇంటర్వ్యూల వరకు వెళ్లినా విజయం సాధించలేదు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక బలంగా ఉందని, అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం వరించట్లేదని విక్రమ్‌ అప్పటి ఆర్మీ జనరల్‌ మాణిక్‌ షాకు ఓ లేఖ రాశారు. దీన్ని చూసిన మాణిక్‌ షా తన అధికారిక లెటర్‌ హెడ్‌పై ‘నిరాశ పడకుండా ప్రయత్నించు. నీ పట్టుదల చూస్తుంటే కచ్చితంగా సాధిస్తావనే నమ్మకం ఉంది’ అని ప్రత్యుత్తరం రాశారు. దాంతో విక్రమ్‌ మరెంతో స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత ఇద్దరం ఎంపికయ్యాం. విక్రమ్‌ రెజిమెంట్‌ ఆఫ్‌ ఆర్టిలరీలో, నేను కోర్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌లో (టెలిమ్యూనికేషన్స్‌ బ్రాంచ్‌) బాధ్యతలు తీసుకున్నాం. సెకండ్‌ లెఫ్ట్‌నెంట్‌ హోదాలో విక్రమ్‌ «గుజరాత్‌లో దరంగ్‌ధరలోని ఫీల్డ్‌ రెజిమెంట్‌లో, నేను పఠాన్‌కోట్‌ సిగ్నల్‌ రెజిమెంట్‌కు వెళ్లాం. అప్పట్లో ఉత్తరప్రత్యుత్తరాలు, గ్రీటింగ్‌ కార్డుల ద్వారా మాత్రమే మా మధ్య సమాచార మార్పిడి జరిగేది.  

ఎయిర్‌ బేస్‌లపై ఏక కాలంలో దాడులు.. 
1971 సెప్టెంబర్‌ నుంచి యుద్ధవాతావరణం నెలకొంది. డిసెంబర్‌ 3న పఠాన్‌కోట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌లో విధుల్లో ఉన్నా. సాయంత్రం 5.45కి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. బయటకు వెళ్లి చూస్తే అక్కడి సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్‌ పొగలు కక్కుతోంది. ఆరా తీస్తే పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు ఓ బాంబు వేసి వెళ్లాయని చెప్పారు. అది మొదలు పఠాన్‌కోట్, ఆగ్రా, గ్వాలియర్‌.. ఇలా ఉత్తరాన ఉన్న ఎయిర్‌ఫీల్డ్స్‌పై ఒకేసారి ఎయిర్‌ ఎటాక్‌ జరిగింది. దీన్ని మన బలగాలు సమర్థంగా తిప్పి కొట్టాయి. డిసెంబర్‌ 16 సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మధ్యలోనే విక్రమ్‌కు ఓ లేఖ రాశాను. అయితే యుద్ధం నేపథ్యంలో అది పోస్టు చేయడం సాధ్యం కాలేదు. ఆ నెలాఖరు వరకు విక్రమ్‌నుంచి ఎలాంటి సమాచారం లేదు. క్రిస్ట్‌మస్, న్యూ ఇయర్‌ సమీపిస్తుండటంతో విక్రమ్‌ కోసం గ్రీటింగ్‌ కార్డులు సిద్ధం చేసే పనిలో ఉన్నా.  

నిజాం కాలేజీకే గర్వకారణం.. 
ఈ లోపు మా సిగ్నల్స్‌ ఛానల్‌లో ఓ పిడుగులాంటి వార్త వచ్చింది. విక్రమ్‌ బర్న్‌ అప్పలస్వామి యు ద్ధంలో చనిపోయారు. అసలు ఏం జరిగిందనేది ఎంతో శోధించి తెలుసుకున్నా. అప్పట్లో విక్రమ్‌ వాళ్ల రెజిమెంట్‌కు ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈయన వాహనం కమాండింగ్‌ ఆఫీసర్‌ వాహనం వెనుకే ఉంటుంది. డిసెంబర్‌ 5న ఈ జీపు రాజస్థాన్‌లోని బర్మేర్‌ సెక్టార్‌లో శత్రు సైన్యం ఏర్పాటు చేసిన ఓ యాంటీ ట్యాంక్‌ మైన్‌ మీద నుంచి వెళ్లింది. ఆ పేలుడు ధాటికి విక్రమ్‌ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ 9న కన్ను మూశారు. తర్వాత జమ్మూ నుంచి జోథ్‌పూర్‌ బదిలీ అయ్యా. అప్పుడు విక్రమ్‌ తల్లిదండ్రుల కోరిక మేరకు సెలవుపై వెళ్లి విక్రమ్‌ అంత్యక్రియలు నిర్వహించిన పాస్టర్‌ను కలిశాను. ఆయన చెప్పిన వివరాలతో వెళ్లి సమాధిని గుర్తించి నివాళులర్పించా. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌ వచ్చా. నిజాం కాలేజీకే గర్వకారణమైన విక్రమ్‌ ఫొటోను ఆ కాలేజీలో పెట్టించా. ఇప్పటికీ ఏటా విక్రమ్‌ సంస్మరణ లెక్చర్‌ ఇస్తున్నా.  


వీఆర్కే ప్రసాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement