భార్యే గుర్తు పట్టలేదు... | Second Lieutenant in the field of defense | Sakshi
Sakshi News home page

భార్యే గుర్తు పట్టలేదు...

Published Sun, Jan 25 2015 1:10 AM | Last Updated on Sat, Mar 23 2019 8:09 PM

భార్యే గుర్తు పట్టలేదు... - Sakshi

భార్యే గుర్తు పట్టలేదు...

యుద్ధంలో ప్రత్యక్షదాడులు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే జరుగుతుంటాయి. రాత్రిళ్లయితే ఎయిర్‌క్రాఫ్ట్స్ తిరగవు. బాంబింగ్ చేయలేవు కాబట్టి. ఇదో సూత్రం. ఇలాంటి వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సాహసాలతో పద్దెనిమిది రోజులు ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న విశ్రాంత సైనికాధికారి కల్నల్ ఆర్.కె.విశ్వనాథరెడ్డి అనుభవాలు ఈవారం...
 
 
నేను రక్షణ రంగంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా 1967లో చేరాను. నా మొదటి పోస్టింగ్ హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో. ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకు ఇండో-పాక్ యుద్ధం జరిగింది. అది 1971 డిసెంబర్ మూడవ తేదీ. భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న సమాచారంతో మా రెజిమెంట్ పంజాబ్ సరిహద్దుకు చేరింది. 45 యుద్ధ ట్యాంకులను ప్రత్యేక రైళ్లలో తరలించాం. హుస్సేనీవాలా వంతెన మీద దాడి జరగబోతోందనీ, ఆ వంతెనను పరిరక్షించమనీ ఆదేశాలు వచ్చాయి. అప్పుడు సమయం సాయంత్రం ఆరు. ఇండియా- పాక్ మధ్య భూభాగంలో అది ఏడు కిలోమీటర్ల స్ట్రెచ్.

పాక్ ఫిరంగిదళాలు మన వైపు వస్తున్నాయి. మన దళాలు ఆ దాడులను ఎదుర్కొంటూ ప్రతి దాడులు చేస్తున్నాయి. ట్యాంకుల మీద పదాతిదళ సైనికులను కూడా మోహరించాం. చుట్టూ చీకటి. వంతెనకు సమీపంలో పేలోడ్ పాయింట్ దగ్గర మా బృందం విస్తరించింది. ట్యాంకు సిబ్బంది 15 కిలోమీటర్ల వార్ ఫ్రంట్‌కు సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్నీ రేడియో కమ్యూనికేషన్ ద్వారా గ్రహిస్తోంది. యుద్ధంలో ఈ సమాచారం కీలకం. సిబ్బంది ఎక్కడ ఏ చిన్న స్విచ్‌ను పొరపాటుగా వాడినా సమాచారానికి దారి మూసుకుపోతుంది.
 
వంతెనకు సమీపంలో అందరం ట్యాంకుల నుంచి దిగి పొజిషన్ తీసుకున్నాం. రెండు రోజులు తీక్షణంగా గస్తీ కాశాం. వంతెన రక్షణ కోసం ఏకంగా ఒక రెజిమెంటే దిగిందన్న సమాచారం పాక్‌కు చేరింది. దాంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇంతలో- ‘ఇక పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లండి’ అని కొత్త ఆదేశాలు వచ్చాయి. దానికోసం మేము సట్లెజ్ నది దాటాలి. అప్పటికప్పుడు ఇంజనీర్లు కాంక్రీట్ మిక్స్, ఇతర మెటీరియల్ పడవల్లో తెచ్చి మూడు గంటల్లో వంతెన కట్టేశారు.

మేము పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి వారి బంకర్లను పేల్చి, ఆ ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నాం. బంకర్‌ను పేల్చడం ద్వారా ప్రత్యర్థిని నిస్సహాయుణ్ని చేయవచ్చు. అది ఒక వ్యూహం. మొత్తం 18 రోజులు యుద్ధరంగంలో ఉన్నాను. యుద్ధం మొదలైన మూడు రోజులకు నా పై అధికారి మేజర్ బల్‌దేవ్‌సింగ్ భావా గాయపడ్డారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి మళ్లీ యుద్ధంలో పాల్గొన్నాను. భారత్ విజయం సాధించింది.
 
ఆ తర్వాత మమ్మల్ని రాజస్థాన్ కరణ్‌పూర్‌లోని నాగిపోస్టుకు బదిలీ చేశారు. అప్పటికి నాకు పెళ్లయి రెండవ నెల. నా భార్య చిత్రను ఢిల్లీలో వాళ్ల అక్కగారింట్లో వదిలి యుద్ధానికి వెళ్లాను. యుద్ధం ముగిశాక చిత్రకు ఉత్తరం రాశాను. నా భార్యకు నేను రాసిన తొలి ఉత్తరం అది. ఆ ఉత్తరం ఆవిడకు చేరిందో లేదో... పాక్ సైన్యం రాజస్థాన్‌లోని ఇసుక దిబ్బలను ఆక్రమించింది. ఆ ఆపరేషన్‌ను నిర్వహించమని ఆదేశాలందాయి.

యుద్ధంలో వేడుకలు!
పోస్ట్‌లో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో నూతన సంవత్సరం  వచ్చింది. సెలబ్రేషన్స్ కోసం కొంత విరామం తీసుకుందామని మా పై అధికారి ప్రతిపాదించారు. అదే ప్రతిపాదనను  మైక్‌లో పాక్ సైనికులనుద్దేశించి ప్రకటించారు. వాళ్లు కూడా ఒప్పుకుని ఆ రాత్రి దాడులు ఆపేశారు. తిరిగి ఉదయం ఏడు గంటల నుంచి యథావిధిగా ప్రత్యర్థులుగా మారిపోయాం.

ఫోర్ పారా బెటాలియన్, నైన్ పారా ఫీల్డ్ రెజిమెంట్‌లో పాల్గొని మన ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ ప్రయత్నంలో 60 మందికి గాను ఏడుగురు చనిపోయారు. ఆ వివరాలు వార్తా పత్రికల్లో అచ్చయ్యాయి. దాంతో ఇంట్లో వాళ్లకు ఒకటే భయం. మిలిటరీ పోస్టుకు వెళ్లి ఆ ఏడుగురిలో నా పేరు లేదని నిర్ధారించుకున్న తర్వాత స్థిమితపడింది చిత్ర. ఇదంతా నాకప్పుడు తెలియదు.

నాగిపోస్టు ఆపరేషన్ పూర్తయిన వెంటనే చిత్రకు ఉత్తరం రాద్దామనుకున్నప్పటికీ ఉత్తరం కంటే ముందు నేనే చేరుకుంటాను కదా అని నేరుగా బయల్దేరాను. ఢిల్లీ చేరుకుని పాలం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మా వదిన గారింటికి వెళ్లాను. అక్కడ నేను ఏ మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది. చిత్ర నన్ను గుర్తు పట్టలేదు. గడ్డకట్టే మంచు, ఎడారి జీవనంతో రంగు తగ్గిపోయి, సన్నబడి, పెళ్లి నాటి రూపంతో పోలిక లేకుండా మారిపోయానని నేను కూడా అప్పుడే గ్రహించాను.       
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement