న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ విమానం భారత్‌లో దాదాపు 10 నిమిషాల పాటు ప్రయాణించి 141 కిలోమీటర్లు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. మే 4న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ నివేదికలో వెల్లడించింది.
పీకే248 అనే పీఐఏ విమానం మస్కట్ నుంచి తిరిగి పాకిస్తాన్‌కు మే4న రాత్రి 8 గంటల సమయంలో చేరుకుంది. అలామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. పైలట్ ల్యాండ్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విమానాన్ని కొద్దిసేపు గాల్లో తిప్పాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్‌కు సూచించారు.
అయితే భారీ వర్షం కారణంగా దారితప్పిన పైలట్ విమానాన్ని భారత గగనతలంలోకి తీసుకొచ్చాడు. ఈ సమయంలో గంటలకు 292 కిలీమీటర్ల వేగం, 13,500 అడుగల ఎత్తులో అది ప్రయాణించింది. బధానా పోలీస్ స్టేషన్ పరిధి గగనతలం మీదుగా భారత్‌లోకి వచ్చింది. భారత పంజాబ్‌లోని తరన్ సాహిబ్ , రసూల్‌పూర్ ప్రాంతాల్లో దాదాపు 140 కిలోమీటర్లు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానాన్ని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉంచాడు పైలట్. ఏడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పాడు.
ఆ తర్వాత భారత పంజాబ్‌లోని జాగియాన్ నూర్ మహమ్మద్ గ్రామం మీదుగా విమానం తిరిగి పాకిస్తాన్ చేరుకుంది. ఆ తర్వాత పాక్ పంజాబ్‌లోని డొనా మబ్బోకి, ఛాంట్, ధుప్సారి కాసుర్, ఘఠి కలంజార్ ప్రాంతాల్లో ప్రయాణించి తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి వచ్చింది. మళ్లీ మూడు నిమిషాలు చక్కర్లు కొట్టిన అనంతరం భారత పంజాబ్‌లోని లఖా సింఘ్వాలా హిథార్ గ్రామం మీదుగా తిరిగి పాక్ చేరుకుంది. ఈ సమయంలో విమానం 23,000 ఎత్తులో ప్రయాణించింది. అయితే ఈ ఘటనకు భారత అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి
Comments
Please login to add a commentAdd a comment