పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ పీఐఏ ప్రస్తుతం విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాక్ ఎయిర్ హోస్టెస్‌లు ఫ్లైట్ డ్యూటీ చేస్తూ కెనడా వెళుతున్నారు. కానీ తిరిగి రావడం లేదు. కొద్ది రోజుల క్రితం పిఐఎ విమానంలో టొరంటో చేరుకున్న విమాన సహాయకురాలు మరియం రజా తిరిగి రాలేదు. హోటల్‌లో ఆమె గదిని వెతకగా ఆమె పీఐఏ యూనిఫాంతో పాటు ‘ధన్యవాదాలు పీఐఏ’ అని రాసివున్న చీటీ లభ్యమయ్యింది.
కెనడాలో దిగిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది కనిపించకుండా పోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వ్యవహారం కొనసాగుతోంది. పలువురు పీఐఏ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు. ఇందుకోసం వారు పీఐఏ ఆమోదం తీసుకోవడం లేదు. అలాగే ముందుగా ఎటువంటి వీసా కోసం కూడా దరఖాస్తు చేయడం లేదు.
2024, జనవరిలో కెనడాలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ అదృశ్యమైన నెల రోజల తర్వాత మరియం అదృశ్యమైంది. పీఐఏ సిబ్బంది 2018 నుండి కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. పీఐఏకి ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. పాక్‌కు చెందిన పలువురు నిపుణులు తమ భవిష్యత్ కలలను నెరవేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళుతున్నారు.
ఏవియేషన్ న్యూస్ వెబ్‌సైట్ సింప్లీ ఫ్లయింగ్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాకు వెళ్లిన పాకిస్తాన్ వైమానిక సిబ్బంది అదృశ్యమవడం అనేది 2019లో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఇది మరింతగా పెరిగింది. 2023లో కెనడాలో దిగిన ఏడుగురు పీఐఏ ఫ్లైట్ అటెండెంట్లు అదృశ్యమయ్యారు. పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ నుండి టొరంటోకు వచ్చిన ఇద్దరు పీఐఏ క్యాబిన్ సిబ్బంది డిసెంబర్ 2023లో తమ డ్యూటీని రిపోర్ట్ చేయలేదు. దీంతో సిబ్బంది లేకుండా ఆ పీఐఏ విమానం ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment