‘చర్చల కోసం ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టం’
ఇస్లామాబాద్: భారత్‌తో చర్చల కోసం తమ ప్రతిష్టను, హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టబోమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను భారత్ రద్దు చేసి ఉండాల్సింది కాదన్నారు. భారత్‌తో చర్చలకు ముందు కశ్మీర్ నేతలను తాము సంప్రదించడంలో కొత్తేమీలేదని, కానీ దాన్ని కారణం చూపి చర్చలు రద్దు చేశారన్నారు.
‘‘పాక్-భారత్ చర్చలు గతంలో ఎప్పుడు జరిగినా మేం కశ్మీర్ నేతలతో మాట్లాడడం సహజంగానే జరుగుతోంది. ఇందులో కొత్తేమీ లేదు. కశ్మీరీలకు కీలకమైన అంశంపై వారితో చర్చించడంలో తప్పేముంది?’’ అని షరీఫ్ పేర్కొన్నారు. గురువారం సార్క్ సమావేశంలో పాల్గొన్న అనంతరం విమానంలో స్వదేశానికి వెళుతూ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘చర్చల ప్రక్రియ హుందాగా, మర్యాదగా, ఆత్మగౌరవంతో సాగాలని పాక్ కోరుకుంటోంది. దీనిపై మాకు విశ్వాసముంది... ఏది ఏమైనా దీన్ని మేం కొనసాగిస్తాం.
భారత్ కూడా ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. చర్చలు పునరుద్ధరించాలని భారత్ అనుకుంటే.. అందులో కశ్మీర్ అంశం కచ్చితంగా ఉండాలన్నారు. కాగా, సార్క్ సమావేశంలో భారత్, పాక్ ప్రధానులు మోదీ, షరీఫ్ కరచాలనం చేసుకొని నవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్న అంశానికి పాక్ మీడియా విస్తృతమైన కవరేజీ ఇచ్చింది. మరోవైపు మోదీ, షరీఫ్‌లు షేక్‌హ్యాండ్‌తో సరిపెట్టడం చాలదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. హృదయాలను కలిపేందుకు వారు కృషి చేయాలని సూచించారు.