సత్యదేవా .. గోడు కనవా! | sample annavaram temple | Sakshi
Sakshi News home page

సత్యదేవా .. గోడు కనవా!

Published Fri, Feb 24 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

సత్యదేవా .. గోడు కనవా!

సత్యదేవా .. గోడు కనవా!

ఆదాయం ఘనం... సౌకర్యాలు శూన్యం
సత్యదేవుని నమూనా ఆలయం వద్ద వసతుల లేమి
ఏటా రూ.ఐదు కోట్ల ఆదాయం
భక్తులకు తాగేందుకు నీరు కరువు
అన్నవరం : స్థానిక జాతీయ రహదారిపై (బైపాస్‌ రోడ్‌) గల సత్యదేవుని నమూనా ఆలయం ద్వారా ఏటా దేవస్థానానికి రూ.ఐదు కోట్లు పైబడి ఆదాయం వస్తోంది. అయినా అక్కడ సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితి నెలకొని ఉంది. దాహం వేసిన భక్తులు పక్కనే పాన్‌షాపుల్లో వాటర్‌ బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. ఎండలు ముదురుతున్నా భక్తులకు సరైన షెల్టర్‌ లేదు. అన్నింటికీ మించి అక్కడ విక్రయించే సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్‌లను నిల్వ ఉంచేందుకు గదిలేకపోవడంతో ప్రసాదాలను కౌంటర్‌లో నిల్వ ఉంచుతున్నారు.  గతంలో అన్నవరం గ్రామం నుంచి వాహనాల రాకపోకలు కొనసాగేవి. వాటిలో ప్రయాణించే భక్తుల కోసం సత్యదేవుని మెట్లదారి ప్రారంభంలో తొలిపాంచా నిర్మించి అక్కడ సత్యదేవుని చిత్రపటం ఉంచి, కొబ్బరికాయలు కొట్టే ఏర్పాటు చేశారు. అక్కడే స్వామివారి ప్రసాదాలు విక్రయించే స్టాల్‌ను  కూడా ఏర్పాటు చేశారు. అయితే 1998–2000 సంవత్సరాల మధ్య చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) విస్తరణ సమయంలో అన్నవరం శివార్లలో నుంచి బైపాస్‌ రోడ్‌ నిర్మించారు. దీంతో దేవస్థానానికి వచ్చే  వాహనాలు, ఆర్టీసీ బస్‌లు తప్ప మిగిలిన వాహనాలు గ్రామంలోకి రాకుండా వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. బైపాస్‌ రోడ్‌ మీదుగా ప్రయాణించే వాహనాల్లోని భక్తుల కోసం అక్కడ కూడా స్వామివారి నమూనా ఆలయం నిర్మించారు. అక్కడ కూడా స్వామివారి హుండీ పెట్టి,  ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. గత 17 ఏళ్లుగా ఆ నమూనా ఆలయం వద్ద ప్రసాదాల విక్రయాలు, స్వామివారి హుండీ ద్వారా దేవస్థానానికి ఏటా రూ.ఐదు కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. అయినా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు శ్రద్ధ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 
తాగేందుకు చుక్కనీరు లేదు
 అధికారుల అశ్రద్ధ కారణంగా ఇక్కడ భక్తులకు తాగడానికి మంచినీరు కూడా లభ్యం కావడం లేదు. ఇక్కడ బోర్‌ వెల్‌ తవ్వితే ఉప్పునీరు పడింది. చేతులు కడుక్కోవడానికి తప్ప తాగడానికి ఆ నీరు పనిచేయడం లేదు. గతంలో మినరల్‌ వాటర్‌ టిన్‌లు దేవస్థానం అధికారులు పంపించేవారు. గత నాలుగు నెలలుగా పంపించడం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. 
ప్రసాదాలు నిల్వచేసేందుకు చోటేది?
      స్వామివారి ప్రసాదాలు విక్రయించేందుకు రెండు కౌంటర్లు పెట్టారు. ఒక కౌంటర్‌లో ప్రసాదం టిక్కెట్లు ఇవ్వడానికి, పక్క కౌంటర్‌లో ప్రసాదాలు ఇవ్వడానికి వీటిని పెట్టారు. రోజూ వేలసంఖ్యలో వచ్చే ప్రసాదం ప్యాకెట్లను నిల్వ ఉంచే గది లేకపోవడంతో ఓ కౌంటర్‌లో వాటిని పేర్చుతున్నారు. రద్దీ రోజుల్లో ఎక్కువ ప్రసాదం ప్యాకెట్లు వస్తుండడంతో వాటిని పేర్చేందుకు చోటు లేక నమూనా ఆలయం ముందు పేర్చుతున్నారు. సిబ్బంది కూడా అక్కడే ఉండి ప్రసాదాలు విక్రయిస్తున్నారు.  
చిన్న షెల్టర్‌తో ఎన్నో సమస్యలు 
ప్రస్తుతం నమూనా ఆలయం ముందు ఉన్న షెల్టర్‌ చాలా చిన్నది. భక్తులకు ఇది సరిపోవడం లేదు. ఉదయం పది గంటల వరకూ ఎండ ఆలయంలోనే ఉంటోంది. వర్షాకాలం ఎక్కువ మందికి నీడనిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ శాశ్వతంగా పెద్ద షెల్టర్‌ నిర్మించాలని, లేదా పందిరి అయినా వేయించాలని భక్తులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement