అవినీతి సామ్రాట్ చంద్రబాబు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన కోసం పరితపిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. 18 కేసుల్లో కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్న అతిపెద్ద అవినీతి సామ్రాట్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
= మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం
గుమ్మఘట్ట (రాయదుర్గం) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన కోసం పరితపిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. 18 కేసుల్లో కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్న అతిపెద్ద అవినీతి సామ్రాట్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డిలో సోమవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్ టీ సిద్దప్ప, బీటీపీ గోవిందులతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు–డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి వంటి అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.