కంట’పడవా’!
కంట’పడవా’!
Published Sat, Jan 28 2017 10:38 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
యథేచ్ఛగా ఇసుక దందా
చీకటి మాటున పడవల్లో రవాణా
ఎమ్మెల్యే సోదరుడి అండతో చెలరేగిపోతున్న మాఫియా
లాక్ గేట్లను తెరిచి మరీ తరలింపు
ఒక్కొక్క పడవలో 8నుంచి 12 యూనిట్ల ఇసుక
యూనిట్ రూ.4 వేలకు పైనే విక్రయం
సాక్షి టాస్క్‌ఫోర్స్ :
సర్కారు యంత్రాంగం నిద్రపోతోంది. చీకటి మాటున ఇసుక దందా చెలరేగిపోతోంది. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ఇసుక అక్రమ తరలింపునకు రాజమార్గంగా మారింది. గోదావరి నదిలో తవ్విన ఇసుకను భారీ పడవల్లో నింపి రాత్రి 12 దాటిన తర్వాత పశ్చిమ కాలువ ద్వారా దర్జాగా తరలిస్తున్నారు. రబీ సీజన్‌లో జల రవాణాపై నిషేధం ఉన్నా.. పడవల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది. ఇరిగేషన్ లాకులను అధీనంలోకి తీసుకున్న అక్రమార్కులు వాటిని తెరవడం.. మూయడం చేస్తున్నారు. కాపలా ఉండాల్సిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు మామూళ్ల మత్తులో పడి మొత్తం వ్యవస్థను అక్రమార్కులకు అప్పగించేశారు.
సీతంపేట నుంచి ఎక్కడికైనా..
గోదావరి నదిలో ఇసుక తవ్వి ఒక్కొక్క పడవలో 8నుంచి 12 యూనిట్ల ఇసుకను నింపుతున్నారు. కొవ్వూరు మండలం సీతంపేట, నిడదవోలు మండలం విజ్జేశ్వరం లాకులను తెరిచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి ఆ పడవలను నడుపుతున్నారు. అక్కడి నుంచి కావాల్సిన ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. నిత్యం 20 పడవల్లో 200 యూనిట్లకు పైగా ఇసుకను తరలించుకుపోతున్నారు. యూనిట్ ఇసుకను రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా తరలించుకుపోవడం ద్వారా రోజుకు రూ.8 లక్షల మేర ఆదాయాన్ని పొందుతున్నట్టు అంచనా. ఇది 20 పడవలు రోజుకు ఒక్క ట్రిప్ వేస్తే వచ్చే ఆదాయం మాత్రమే. కొన్ని పడవలు రెండు ట్రిప్‌లు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి డెల్టాలోని ఒక ప్రజాప్రతినిధి సోదరుడు అండగా నిలబడినట్టు సమాచారం.
జల రవాణాకు అనుమతి లేకపోయినా..
గోదావరి నదిలో ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే పూర్తిస్థాయిలో నీరు ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే పడవల్లో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయి. రబీ సీజన్‌లో గోదావరిలో నీటి నిల్వలు పడిపోతుండటంతో పడవల ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వడం లేదు. అయినా.. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా సీతంపేట, విజ్జేశ్వరం వద్ద లాకుల గేట్లను ఎత్తివేసి నదిలోంచి ఇసుక రవాణా చేస్తున్నారు. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ హెడ్‌లాక్ నుంచే అక్రమ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హెడ్‌లాక్ వద్ద ఒక సూపరింటెండెంట్, ముగ్గురు లస్కర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా ఒక లస్కర్ మాత్రమే ఉంటున్నారు. కళ్లెదుటే లాక్ గేట్లు ఎత్తుతున్నా ఇరిగేషన్ ఉద్యోగులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అక్రమ ఇసుక రవాణా సాగిపోతోంది.
సీతంపేట నుంచి ఎక్కడికైనా..
విజ్జేశ్వరం హెడ్‌లాక్ వద్ద రెండు ప్రధాన లాకులు ఉన్నాయి. ఇక్కడ నుండి పడవలు సహజ వాయు విద్యుత్ కేంద్రం వెనుక భాగంలోని కాలువ నుంచి ప్రధాన కాలువలోకి చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి నిడదవోలు, శెట్టిపేత, తాళ్లపాలెం, తాడేపల్లిగూడెం,పెంటపాడు, ఏలూరు ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నారు.
రెండు బంటాలకే అనుమతులు
కొవ్వూరు మండలం సీతంపేట, నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామాల్లో రెండు మత్య్సకార సంఘాల ఆధ్వర్యంలో రెండు బంటాలు మాత్రమే ఉన్నాయి. ఈ బంటా కార్మికులు మాత్రమే పడవల ద్వారా ఇసుక రవాణా చేయడానికి అనుమతులు పొందాయి. రెండు బంటాలకు చెందిన 32 పడవలకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాయి. ఈ పడవలు కూడా కేవలం ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే కాలువలో తిరగాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా అనుమతులు లేని 20 పడవల ద్వారా రబీలోనూ ఇసుక రవాణా చేస్తున్నారు.
నీరు వృథాగా పోతున్నా..
రబీలో సాగునీటి కొరత దృష్ట్యా గోదావరి జలాలను నీటి పారుదల అధికారులు వంతులవారీ విధానంలో విడుదల చేస్తున్నారు. అయితే, కొంతమంది ప్రజాప్రతినిధుల అండతో ఇక్కడ పడవ కార్మికులే ఇష్టారాజ్యంగా లాకు గేట్లు ఎత్తడం, దించడం చేస్తున్నారు. అవగాహన లేని కార్మికులు గేట్లు ఎత్తిన తరువాత తిరిగి మూసివేసే సమయంలో ప్రమాదం జరిగినా.. గేట్లు తిరిగి వేసేటప్పుడు మొరాయించినా.. గోదావరిలోని నీరు దిగువకు వృథాగా పోతుంది. గట్లు ధ్వంసం అయ్యే పరిస్థితులు సైతం ఉన్నాయి. ఈ విధంగా ప్రతిరోజు గేట్లు ఎత్తివేయడంతో రోజుకు 500 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని అంచనా. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల అధికారులు నోరు మెదపడం లేదు.ç ప³డవ కార్మికుల ఉపాధి ముసుగులో పడవలపై ఇసుక తరలింపునకు అనుతించాల్సిందిగా అ«ధికారులు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు. పడవలపై ఇసుక తెచ్చిన కార్మికులకు కూలి డబ్బులు చెల్లించి.. ఎమ్మెల్యే బంధువు ఒకరు అధిక ధరకు విక్రయిస్తున్నారు. దీని వెనుక ఓ ఎమ్మెల్యే సోదరుడు చక్రం తిప్పుతున్నట్టు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
జిల్లాలో రోజుకు 200 లారీల అక్రమ ఇసుక వ్యాపారం సాగుతోంది. వాడపల్లి ర్యాంపు కేంద్రంగా ప్రస్తుతం ఇసుక రవాణా సాగుతోంది. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో పడవలు బయలుదేరగానే దిగుమతి పాయింట్ల వద్ద హైవే టిప్పర్లు, కూలీలతో టీడీపీకి చెందిన ఇసుక విక్రేతలు సిద్ధంగా ఉంటున్నారు. పడవ దిగుమతి పాయింట్‌కు చేరుకోగానే క్షణాల్లో అన్‌లోడ్ చేసి టిప్పర్ల ద్వారా గమ్యాలకు చకచకా చేర్చేస్తున్నారు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే 11 కాలువ పాయింట్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ టీడీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలో ఉన్న రెండు ర్యాంపుల నుంచి ఇసుకను తరలించే విషయంలో నిడదవోలు, తణుకు ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఒక ర్యాంపు నీకు, ఒక ర్యాంపు నాకు అనే ప్రతిపాదనను తణుకు ఎమ్మెల్యే తీసుకురాగా ఇద్దరిమధ్యా ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిడదవోలు నియోజకవర్గంలోని రెండు ఇసుక ర్యాంపులలో ఒక ర్యాంపును తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం.
రబీలో అనుమతులు లేవు
విజ్జేశ్వరం హెడ్‌లాక్ వద్ద పడవల ద్వారా ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. గోదావరిలో నీటి లభ్యత ఏటా తక్కువగా ఉండటంతో ఆ సీజన్‌లో పడవల రాకపోకలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులు ఇవ్వం. ఖరీఫ్ సీజన్‌లో గోదావరిలో ఆశించిన విధంగా నీరు ఉండటంతో అప్పుడు మాత్రమే పడవల ద్వారా ఇసుక రవాణాకు అనుమతిస్తాం. విజ్జేశ్వరం లాకుల వద్ద అనధికారికంగా గేట్లు ఎత్తివేస్తున్న వ్యవహారంపై చర్యలు చేపడతాం.
ఎన్.కృష్ణారావు, హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం
Advertisement