ఇసుకేస్తే రాలుతున్న కోట్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇసుక దందా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. డ్వాక్రా సంఘాల ముసుగులో అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇసుక రీచ్‌లను తమ అక్రమార్జనకు నెలవులుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో సర్వం తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఇసుక బల్క్ కొనుగోళ్లకు అనుమతుల పేరిట భారీయెత్తున మామూళ్ల దందా సాగిస్తున్నారు. అధికారిక, అనధికారిక లోడ్ల ద్వారా గత ఏడాది కాలంలో రూ.170 కోట్లకు పైగా కొల్లగొట్టారు.
* శ్రీకాకుళం జిల్లా జిల్లాలో క్యూబిక్ మీటరు (10 టైర్ల లారీలో 21 నుంచి 27 క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణా చేస్తున్నారు) ఇసుక ధర రూ.550.
* విశాఖపట్నంలో ప్రభుత్వ ఇసుక డిపోలో క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.1,400.
* ఇక విశాఖ నగరంలో బ్లాక్‌లో క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.2,200.
శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల మధ్య ఉన్న ఈ భారీ ధరల వ్యత్యాసం ప్రభుత్వంలోని ఆ నేతకు అక్రమంగా కోట్లు కురిపిస్తోంది. విశాఖపట్నం జిల్లాలో నిర్మాణ రంగం ఇసుక కోసం శ్రీకాకుళం జిల్లా ఇసుక రీచ్‌లపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని 23 ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను విశాఖపట్నంలోని ప్రభుత్వ ఇసుక డిపోకు తరలిస్తున్నారు. నిర్మాణ సంస్థ లు ఆ డిపో నుంచి ఇసుక కొనుగోలు చే యాలి. అయితే భారీస్థాయిలో నిర్మాణాలు చేపట్టే సంస్థలు నేరుగా శ్రీకాకుళం జిల్లాలోని రీచ్‌ల నుంచే పెద్దమొత్తంలో కొనుగోళ్లు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.
ఇందుకు జిల్లా ఉన్నతాధికారి అనుమతి ఇవ్వవచ్చు. ఇదే అంశాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీలక నేత తనకు అనుకూలంగా మలచుకున్నారు. తనకు మామూళ్లు ముట్టజెప్పేందుకు అంగీకరించిన సంస్థలు బల్క్ కొనుగోళ్లు చేసేందుకు గాను ఉన్నతాధికారి ద్వారా అనుమతి ఇప్పిస్తున్నారు. గత ఏడాది కాలంలో 36 సంస్థలకు కలపి 4.86 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక బల్క్ కొనుగోలుకు ఈ విధంగా అనుమతించారు. వాటిలో నాలుగు మాత్రమే ప్రభుత్వ సంస్థలు (విశాఖ ప్రభుత్వ ఇసుక డిపో, వుడా, పవర్ గ్రిడ్, ఈస్టుకోస్టు రైల్వే).
మరొకటి శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో థర్మల్‌ప్లాంట్ నిర్మిస్తున్న ఈస్టుకోస్టు ఎనర్జీ కార్పొరేషన్. మిగిలిన 31 ప్రైవేటు సంస్థలే కాగా వాటిలో కొన్ని అసలు నిర్మాణ రంగంలో లేనివే కావడం గమనార్హం. గత ఏడాది కాలంలో అనుమతులిచ్చిన మొత్తం 4.86 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకలో.. ప్రభుత్వ రంగ సంస్థలకు 73 వేల క్యూబిక్ మీటర్లు, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ సంస్థకు లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక కొనుగోలుకు అంగీకరించారు. మిగిలిన 3.13 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కొనుగోళ్లకు ప్రైవేటు సంస్థలకే అనుమతులిచ్చారన్నమాట.
లారీ లోడ్‌కు రూ.10 వేల మామూలు!
బల్క్ ఇసుక కొనుగోలు కింద ఒక్కో లారీ లోడ్‌కు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీలకనేత రూ.10 వేలు చొప్పున మామూలు వసూలు చేస్తున్నారు. అధికారిక అంచనాల ప్రకారం ప్రైవేటు సంస్థలకు అనుమతిచ్చిన 3.13 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు 21 వేల లారీ లోడ్లు అవుతాయి. ఆ లెక్కన కీలక నేత రూ. 21 కోట్లు మామూళ్ల రూపంలో దండుకున్నారన్నమాట. అనుమతిచ్చిన దాని కంటే అధిక ట్రిప్పుల ద్వారా ఇసుకను అక్రమంగా విశాఖపట్నం తరలిస్తున్నారు. లారీకి ఒక ట్రిప్పుకు మాత్రమే అనుమతి తీసుకుని ఆరేడు ట్రిప్పులు తిప్పుతున్నారు.
అలా ఏడాదిలో దాదాపు 1.50 లక్షల ట్రిప్పులు అనధికారికంగా నడిపినట్లు అధికారవర్గాల సమాచారం. లక్షన్నర ట్రిప్పులకు ట్రిప్పుకు రూ.10 వేల మామూలు చొప్పున కీలక నేత దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర స్థాయిలో అక్రమ ఇసుక దందాను వ్యవస్థీకృతం చేసి కేవలం మామూళ్ల ద్వారా వందల కోట్లు దండుకుంటున్న వైనం ఉన్నతాధికారులనే విస్మయపరుస్తోంది. మరోవైపు ప్రైవేటు సంస్థల ముసుగులో కీలక నేత సన్నిహితులే ఏజెన్సీల పేరిట విశాఖలో ఇసుక బ్లాక్ మార్కెటింగ్ దందా సాగిస్తుండటం కొసమెరుపు.