ఇష్టారాజ్యం
► గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా
► నెలకు రూ.25 లక్షల విలువజేసే ఇసుక తరలింపు
► సూత్రధారులు అధికార పార్టీ నాయకులే
మైనింగ్ అక్రమాలకు మాంబట్టు అడ్డాగా మారింది. అధికారపార్టీ నాయకులు కొందరు తడ మండల పరిధితోపాటు చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, అటవీ భూములు, పాములకాలువలో లభించే గ్రావెల్, ఇసుక, మట్టిని ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. ఇసుక, గ్రావెల్‌ను స్థానిక పరిశ్రమలు, లేఔట్లతోపాటు తమిళనాడుకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
తడ(సూళ్లూరుపేట): పరిశ్రమల సాకును చూపుతూ అధికారపార్టీ నాయకులు కొందరు గ్రావెల్, ఇసుకను చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో నిల్వ చేసి అనుకూలమైన సమయంలో తమిళనాడుకు తరలిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా సమాచారం వచ్చిన వెంటనే సదరు స్మగ్లర్లకు ఉప్పందించి తరువాత దాడులకు వెళుతున్నారు. ఈ విషయం తెలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇటీవల ఇసుక నిల్వలపై దాడులు నిర్వహించి అధికారులకు అప్పగించారు.
రోజుకు 30 నుంచి 50 ట్రాక్టర్ల ఇసుక తరలింపు
మాంబట్టు పరిధిలో పాముల కాలువ ఇసుక, పొలాల్లో లభించే దువ్వ ఇసుకను రోజుకు సుమారు 30 నుంచి 50 ట్రాక్టర్ల వరకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక కొనుగోలుదారుల అవసరాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు రూ.లక్ష వరకు వ్యాపారం సాగుతోంది. నెలకు ఎంత లేదన్నా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు.
జేసీబీల సాయంతో ఇసుకను ట్రాక్టర్లకు నింపి తరలిస్తున్నారు. గ్రావెల్‌కు సంబంధించి అవసరాన్ని బట్టి ఒక యూనిట్ రూ.400 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. టిప్పర్ల ద్వారా నాలుగు లేదా ఐదు యూనిట్లు సరిపోయే గ్రావెల్‌ను తరలిస్తారు. ఈ లెక్కన టిప్పర్ గ్రావెల్ రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. నెలకు రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది.
కలిసి వస్తున్న సరిహద్దు
మాంబట్టు పంచాయతీలోని మాంబట్టు, ఎన్‌ఎంకండ్రిగ గ్రామాలు నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉండటంతో ఇక్కడి స్మగ్లర్లకు వరంలా మారింది. ఈ ప్రాంతంలో నాణ్యమైన గ్రావెల్ విస్తారంగా ఉంది. అదే విధంగా గ్రామం ఎగువన ప్రవహించే పాముల కాలువలో ఇసుక పుష్కలంగా ఉంది. మాంబట్టు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నాయకులు తమ అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని వారి ట్రాక్టర్ల ద్వారానే జేసీబీ సాయంతో కాలువల్లో ఇసుక, చెరువుల్లో మట్టి, అటవీ, ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌ను కొల్లగొడుతున్నారు.
వీరు రాత్రిళ్లు ఇసుకను పాముల కాలువ నుంచి తరలించి కొంత చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల పరిధిలో, మరి కొంత నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉంచుతారు. సమయానుకూలంగా దానిని తమిళనాడుకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా అధికారులు దీనిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. నెల్లూరు జిల్లా అధికారులు వచ్చిన సమయంలో తమకు ముందుగానే అందుతున్న సమాచారంతో స్మగ్లర్లు జాగ్రత్త పడుతున్నారు. అలా కాకుండా వనరులు మన రాష్ట్రానికి చెందినవే కాబట్టి రెండు జిల్లాల అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తే ఫలితం వేరుగా ఉంటుందనేది స్థానికుల అభిప్రాయం.
సహకరిస్తున్న పరిశ్రమల సిబ్బంది
ఈ స్మగ్లింగ్‌కు అధికారపార్టీ నాయకులదే పెత్తనం కావడంతో తమ పరిశ్రమకు ఇబ్బం ది లేకుండా ఫ్యాక్టరీల నిర్వాహకులు వీరికి కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారు. పరిశ్రమల్లో కీలక స్థానాల్లో ఉండే వ్యక్తులు వీరికి టెండర్లు కట్టబెట్టి, తమ స్వార్థం చూసుకునేకన్నా ఓపెన్ టెండర్ పిలిస్తే మరింత తక్కువ ధరకు సరుకు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా చేసే ఇలాంటి స్మగ్లింగ్ వ్యాపారాన్ని పరిశ్రమల వారు ప్రోత్సహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిల్వలు ఉంటే చర్యలు తీసుకుంటాం
అనుమతి పొందిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తరలించాలి. అలా కాకుండా ఎక్కడపడితే అక్కడ ఇసుక తీయడం, నిల్వ చేయడం, అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఉంటే నాకు లేదా పోలీసులకు గాని సమాచారం అందించాలి. –ఏడుకొండలు, తహసీల్దార్