-
గ్రంథాలయం పక్కనే చెత్తాచెదారం
-
ఇబ్బందులు పడుతున్న పాఠకులు
-
సమస్య పరిష్కరించాలని విన్నపం
నిర్మల్ రూరల్ : వాళ్లంతా స్వయం ఉపాధి పొందుతున్న యువకులు. తమ వంతుగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే తలంపుతో ఉన్నవాళ్లు. తలా కొంత డబ్బు కూడబెట్టి ప్రజల అవసరాన్ని గుర్తిస్తూ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని గాంధీచౌక్‌లో స్వామి వివేకానందుడి పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించారు. దాదాపు పదేళ్లుగా ఇక్కడ సేవలందిస్తున్నారు. అయితే వీరందించే సేవలకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.
పాఠకుల కోసం..
పట్టణానికి చెందిన యువకులు గంగిశెట్టి ప్రవీణ్, కూన రమేశ్, అబ్దుల్ అజీజ్, నాయిడి మురళీధర్, వారల్ మనోజ్, అంక శంకర్, ఆర్. శ్రీధర్, శ్రీరామోజీ నరేశ్, తాళ్లపెల్లి నారాయణ, మదన్‌మోహన్‌లు నిర్మల వివేకానంద సేవా సమితిగా ఏర్పడి సేవలందిస్తున్నారు. గతంలో గాంధీచౌక్‌లో ఉన్న ప్రభుత్వ శాఖా గ్రంథాలయాన్ని భాగ్యనగర్‌కు తరలించారు. దీంతో గాంధీచౌక్, సోమవార్‌పేట్, బేస్తవార్‌పేట్, కాల్వగడ్డ, బ్రహ్మపురి, వెంకటాద్రిపేట్, బంగల్‌పేట్, నాయుడివాడ, బుధవార్‌పేట్ తదితర వీధుల ప్రజలకు గ్రంథాలయం చాలా దూరభారమైంది. దీంతో పాఠకులు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన సేవా సమితి సభ్యులు గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. తాము సంపాదించిన దాంట్లో నుంచే తలా కొంత వేసుకొని అందరికీ అందుబాటులో ఉండేలా గాంధీచౌక్‌లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. వివిధ దినపత్రికలతో పాటు వారపత్రికలు, పోటీ పరీక్షల పత్రికలను అందుబాటులో ఉంచుతున్నారు.
ముక్కు మూసుకొని చదువుతూ..
వివేకానంద గ్రంథాలయానికి నిత్యం యాభై నుంచి వందమంది వరకు పాఠకులు వస్తుంటారు. ఉదయం, సాయంత్ర వేళల్లో గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతారు. పాఠకుల్లో విశ్రాంత ఉద్యోగులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్‌గా వచ్చే పాఠకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే గ్రంథాలయం పక్కనే చెత్తచెదారం వేస్తుండటం, గ్రంథాలయ గోడలపై మూత్ర విసర్జన చేస్తుండటంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన వస్తుండటంతో ముక్కు మూసుకొని చదవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
పలుమార్లు సూచించినా..
గ్రంథాలయం వద్ద చెత్త వేయొద్దని, ఇక్కడ మూత్రం చేయొద్దని నిర్వాహకులు పలుమార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పురావడం లేదు. స్థానికులు కొంతమేరకు సహకరిస్తున్నా.. దూరప్రాంతాల నుంచి చెత్తను తీసుకువచ్చి ఇక్కడ పోస్తున్నారని పేర్కొంటున్నారు. ఇక మున్సిపల్ అధికారులే ఏదైనా శాశ్వత పరిష్కారం కల్పించాలని నిర్వాహకులు కోరుతున్నారు.