జనాలకు జర మొస్తోంది..!
-
గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం
-
ప్రబలుతున్న వ్యాధులు
-
వ్యాధుల బారినపడుతున్న ప్రజలు
చెన్నూర్ : వర్షం వచ్చింది రైతుల్లో సంతోషం తెచ్చింది. గ్రామ స్థాయి అధికారులు, పాలకులు స్పహతో ఉండి ఉంటే జనాలూ సంతోషం ఉండేవారు. కానీ పారి‘శుద్ధి’పై చిత్తశుద్ధి లోపించడంతో జనాలకు జరమొస్తోంది. దీంతో గ్రామీణులు దావఖానాల పాలవుతున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు జ్వరాల, డయోరియా బారినపడి ఆస్పత్రులపాలయ్యారు. అధికారులు చెత్తపై చిత్తశుద్ధితో సమరం చేస్తే జనాలు వ్యాధుల బారిన పడరనేది వైద్యుల మాట...
గ్రామాలు స్వచ్ఛగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఆమలు చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ లక్ష్యం మంచిదే అయినప్పటికీ ఆచరణకు నోచుకోకపోవడంతో నేడు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ లోపించి ప్రజలు రోగాలపాలవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలి మంచాన పడుతున్నారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని ప్రజలు జ్వరాలు, డయోరియా సోకి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.
జ్వరం.. భయం...
చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని ప్రజలు జ్వరాలు, డయోరియా వ్యాధులు ప్రబలి మంచం పడతున్నారు. రోజు రోజుకూ జ్వరాలు, డయోరియా రోగులు పెరుగుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారితో చెన్నూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి నిండిపోతోంది. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, చెన్నూర్ పట్టణంలోని మహాంకాళివాడ, కోటబొగుడ, బొక్కలగూడెం, బేతాళవాడలతో పాటు కోటపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులు, జనాలు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.
లోపించిన పారిశుధ్యం
చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, ఇందిరానగర్ , బేతాళవాడ, చెన్నూర్ మండలంలోని కత్తరశాల, సుద్దాల, కిష్టంపేట, సుద్దాల, అంగ్రాజుపల్లి, అస్నాద్, దుగ్నెపల్లి, కొమ్మెర, కోటపల్లి మండలంలోని పారుపల్లి, ఎడగట్ట, ఎసాన్‌వాయి, ఎధుల్లబంధం, జనగామా, పిన్నారం, మల్లంపేట, పంగిడిసోమారం, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ లోపించింది. ఈ ప్రాంతాల్లో మురికి కాలువల వ్యవస్థ లేక పోవడంతో వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడే నిలిచి పోవడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే జనాలు ఆస్పత్రులపాలు కాక తప్పదు.