అంబరాన్నంటిన సంబురాలు
నిర్మల్‌రూరల్ : ఇంటి ముందు ఆకట్టుకున్న ఆడపడుచుల రంగవల్లులు..డాబాపైన ఎగిరిన చిన్నారుల వినూత్న పతంగులు.. వాళ్లతో కలిసి కేరింతలు కొట్టిన పెద్దలు.. నోములు ఇచ్చిపుచ్చుకున్న సుహాసినులు.. గోమాతకు చేసిన పూజలు.. ఇలా భోగి, సంక్రాంతి, కనుమలు.. ముచ్చటగా గడిచిపోయిన మూడురోజులు. పల్లె నుంచి పట్టణం దాకా అంతటా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు.
పట్టణంలోని బంగల్‌పేట్ చౌరస్తాలో శనివారం సాయంత్రం భోగి మంటలు వేసి, సంక్రాంతి సంబురాలు ప్రారంభించారు. ‘స్వామియే శరణమయ్యప్పా..’ అంటూ అయ్యప్పస్వామి శరణుఘోషతో పట్టణంలోని మల్లన్నగుట్టపై గల హరిహరక్షేత్రం మార్మోగింది. అభినవ శబరిమలగా పేరొందిన ఆలయంలో సంక్రాంతి సందర్భంగా మకరజ్యోతి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిర్మల్(మామడ) : మండలంలోని పొన్కల్ గ్రామంలో శనివారం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మమత, రశ్మిత, అక్షయలు వేసిన ముగ్గులు బహుమతులను గెలుచుకున్నారు.
సారంగాపూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో శని, ఆదివారాలు సంక్రాంతి పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా మండలంలోని బోరిగాం గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు.
లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులను అందరంగా తయారు చేసారు. యువకులు ,పిల్లలు అనే తేడా లేకుండా అందరు కలిసి హుషారుగా గాలిపటాలను ఎగురవేశారు.